చల్లబడిన వాతావరణం…

 Kharif Cultivation

 

ఆదిలాబాద్‌: రెండు రోజుల క్రితం వరకు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలతో తల్లడిల్లిన జిల్లా ప్రజలు వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షం కురవడంతో జిల్లా రైతాంగం ఖరీఫ్ సాగుకు సిద్దమవుతోంది. ఇప్పటికే భూములను చదును చేసుకొని తాము సాగు చేయాల్సిన పంటలకు సంబంధించిన విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేయడంపై దృష్టి సారించిన రైతులు తమ పంట చేలల్లో చెత్తాచెదారాన్ని తొలగించే పనిలో పడ్డారు. వర్షాలు కురవడం ప్రారంభం కాగానే విత్తనాలు వేసేందుకు అన్ని సిద్దం చేసుకుంటున్నరు.

నైరుతి రుతుపవనాలు కొంత ఆలస్యం అయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నప్పటికీ రెండు రోజులుగా వాతావరణం చల్లబడడం ఆకాశం మేఘావృతం కావడంతో వర్షాలు పడతాయనే భావంతో పంటల సాగుకు అన్ని సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే 50 శాతానికి పైగా వ్యవసాయ పనులను పూర్తి చేసుకున్న రైతులు మిగిలిన పనులను సైతం వేగంగా పూర్తి చేసుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. ఇక వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది సైతం జిల్లా రైతాంగం పత్తి పంట సాగుపైనే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది వాతావరణం అనుకూలించక పత్తి రైతు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. అయినప్పటికీ వివిధ కారణాలతో జిల్లా రైతులు పత్తి పంటనే సాగు చేస్తామని చెబుతున్నారు.

జిల్లాలో 2.10 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉండగా, 1.42 లక్షల హెక్టార్లలో పత్తి పంటను సాగు చేసే అవకాశాలున్నట్లు వ్యవసాయాధికారులు తెలుపుతున్నారు. ఆ తరువాత 38,250 హెక్టార్లలో సోయాబీన్ పంట సాగవుతుందని భావిస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో అతివృష్టి, చివర్లో అనావృష్టి పరిస్థితుల కారణంగా జిల్లాలో అత్యధికంగా సాగు చేసిన పత్తి పంట దిగుబడి పూర్తిగా పడిపోయింది. ఎకరాకు 5 క్వింటాళ్ల చొప్పున దిగుబడి మాత్రమే రావడంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు తమ పంటలను కాపాడుకొనేందుకు విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యారు.

అయినప్పటికి ఇతర పంటల సాగుకు జిల్లాలోని భూములు అనుకూలంగా ఉండవని అంటున్నారు. సోయాబీన్ పంట సైతం జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే దిగుబడినిస్తుందని పేర్కొంటున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పంటల మార్పిడిపై రైతాంగానికి అవగాహన కల్పిస్తున్నప్పటికీ రైతులు మాత్రం ఎన్నో ఏళ్లుగా తమ పంట చేలల్లో పత్తి పంటను మాత్రమే సాగు చేయడం గమనార్హం. రబీ సీజన్‌లో ఇతర పంటలను సాగు చేస్తున్న రైతులు ఖరీఫ్‌లో మాత్రం పత్తి పంటను మాత్రమే సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసి పంట దిగుబడులు పెరుగుతాయని జిల్లా రైతాంగా భావిస్తోంది.

Farmers ready for Kharif Cultivation

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చల్లబడిన వాతావరణం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.