ఆర్థిక సమస్యలతో కుటుంబం ఆత్మహత్యాయత్నం…

Suicide

 

మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని సంతోష్‌నగర్ కాలనీలో ఆర్థిక సమస్యలతో ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా తల్లి, కుమారుడు మృతి చెందారు. ఈ విషాద సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకోగా బుధవారం వెలుగు చూసింది. బాధిత కుటుంబ బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాలనీలో నివాసం ఉంటున్న పారేపల్లి లోకేశ్వర్ తన భార్య చిత్రకళ(36), పెద్ద కుమారుడు లోహిత్‌కుమార్ (11)లతో కలసిఅర్ధరాత్రి దాటిన తర్వాత కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భార్య, పెద్ద కుమారుడు మృతి చెందగా లోకేశ్వర్ ప్రాణాపాయస్ధితిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు.

సంతోష్‌నగర్‌కు చెందిన రిటైర్డ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పారేపల్లి సురేందర్ చిన్న కుమారుడు పారేపల్లి లోకేశ్వర్‌కు 12 ఏళ్ల క్రితం నల్లగొండకు చెందిన చిత్రకళతో వివాహం జరిగింది. వారికి లోహిత్‌కుమార్, శ్రీవిఘ్నేశ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 8 ఏళ్ల పాటు లోకేశ్వర్ దామరచర్ల సమీపంలోని పవర్‌ప్లాంట్‌లో పనిచేసి ఏడాది క్రితం ఉద్యోగాన్ని మానివేశాడు. అనంతరం కొంతకాలం స్థానిక రైస్‌మిల్లులో పనిచేశాడు. అద్దె ఇంట్లో ఉంటున్న లోకేశ్వర్ కుటుంబం గడవక ఇబ్బందులు పడుతున్న విషయం గుర్తించిన తండ్రి సురేందర్ కొడుకు కుటుంబాన్ని నెలరోజుల క్రితం తన వద్దకు తీసుకొచ్చుకున్నాడు. కాగా సురేందర్ మంగళవారం తన పెద్ద కుమారుడు ఇంటికి నల్లగొండకు వెళ్ళారు. ఎక్కడా ఉద్యోగం లేక, కుటుంబం గడవకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన లోకేశ్వర్ మంగళవారం రాత్రి పురుగులమందు, కూల్‌డ్రింక్ ఇంటికి తీసుకువచ్చాడు.

అప్పటికే చిన్న కుమారుడు విఘ్నేశ్ నిద్రించగా భార్య, పెద్ద కుమారుడు లోహిత్‌తో కలిసి పురుగుల మందును సేవించారు. ఆత్మహత్య చేసుకుంటున్నందుకు తనను క్షమించమని తల్లిదండ్రులను వేడుకుంటూ స్నేహితుల వద్ద చేసిన అప్పుని తీర్చాలని సూసైట్ నోటురాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అర్ధరాత్రి 2గంటల తర్వాత లోకేశ్వర్ తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని హైదరాబాద్‌లో ఉన్న తన సోదరికి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే సోదరి అప్రమత్తమై తల్లిదండ్రులకు మరో సోదరుడుకి సమాచారం ఇవ్వడంతో పాటు 100కాల్‌కు డయల్ చేశారు. పెట్రోలింగ్ పోలీసులు సమాచారం అందుకుని లోకేశ్వర్ ఇంటికి చేరుకున్నారు.

అప్పటికే చిత్రకళ, లోహిత్‌కుమార్ మృతి చెందగా లోకేష్ అపస్మారక స్థితిలో ఉండటంతో 108లో ఏరియా అసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలాన్నిడిఎస్పీ శ్రీనివాస్, సీఐలు శ్రీనివాస్‌రెడ్డి, సదానాగరాజు, ఎస్సై గౌసులు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Family Suicide attempt with Financial problems

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆర్థిక సమస్యలతో కుటుంబం ఆత్మహత్యాయత్నం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.