అమ్మే నాపాటకు స్పూర్తి…

 Exclusive Interview With Artist SaiChand

అతడు పుట్టింది ఉద్యమకారుల ఇంట్లో. తండ్రి ప్రజా ఉద్యమాల కోసం ఉద్యోగం వదిలేశాడు. అదే స్ఫూర్తితో అతను పెరిగి కళాకారుడయ్యాడు. పదహారేండ్లకే తల్లి చనిపోతే ఆ ప్రేమకు దూరమయ్యనని “అనురాగాల పల్లవి అమ్మ ప్రేమ”  అంటూ పాట రాసి ఎందరో హృదయాలను కదిలించాడు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు వదిలిన అమరవీరుల తల్లి ఆవేదనను తెలుపుతూ “రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా” అంటూ   పాట పాడిన కళాకారుడు. ఇప్పుడు ‘కుల మత’ రహిత సమాజం కావాలంటూ తన గొంతు వినిపిస్తున్న  సాయిచంద్ సకుటుంబంతో ముచ్చటించారు.

మాది మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి. మా అమ్మానాన్న మణెమ్మ వెంకటరాములు. అమ్మ బీడి కార్మికురాలు. నాన్న వ్యవసాయకూలి. ఇద్దరం పిల్లలం. అన్న ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. పై చదువులకోసం హైదరాబాద్ వచ్చాను. పీజీ వరకూ చదువుకుని పెళ్లి చేసుకున్నాను.

రచయితగా, సింగర్‌గా మీ ప్రస్థానం ఎలా మొదలైంది..
నేను ఉద్యమ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టాను. మా కుటుంబం అంతా కార్మిక సంఘాల ఉద్యమాలతో ముడి పడి ఉంటుంది. నాన్న సామాజిక కార్యకర్త ప్రజా ఉద్యమాల కోసం స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం వదిలేశాడు. నేను పెరిగిన వాతవరణం అంతా కూడా ప్రజా ఉద్యమాలతో ముడిపడి ఉంది. అలా చిన్నప్పటి నుండి ఉద్యమ పాటలు వినే వాడిని. పాటలను పుస్తకాలలో చూసి చిన్నప్పటి నుండి స్కూల్‌లో పాడేవాడిని. నా పాటకు, రచనకు బీజం వేసింది
మా కుటుంబం. కాని ఆ పాటను తెలంగాణ ఉద్యమంలో పదునెక్కించి స్ఫూర్తినిచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ.
ఎప్పటి నుండి పాటలు రాస్తున్నారు? ఏ పాటతో మొదలు పెట్టారు…
ఇంటర్ తర్వాత పాటలు రాయడం మొదలు పెట్టాను. “అనురాగాల పల్లవి అమ్మ ప్రేమ” నా మొదటి పాట. అమ్మ పాట ఎందుకు రాశానంటే నాకు 16సంవత్సరాలు ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. నేను కోల్పోయిన అమ్మ ప్రేమను పాట రూపంలో రాసుకున్నాను. అమ్మ పాటతో మొదలైన నా ప్రయాణం కొనసాగుతూనే ఉంది.
మీకు గుర్తింపు తెచ్చిన పాటలు..
“రాతి బొమ్మల్లో కొలువైన శివుడా” పాట నన్ను విశ్వవాప్తం చేసింది. ఆ పాట ఓయూలో 2009 డిసెంబర్ 31న విదేశీ సంస్కృతికి వ్యతిరేకంగా తెలంగాణ కల్చరల్ నైట్ ఏర్పాటు చేశారు. అప్పుడు గాయకులంతా పాడి అలసిపోయారు. అప్పుడు రాత్రి మూడు గంటలకు నేను ఆ పాట పాడితే అక్కడ పడుకున్నవాళ్లతో పాటు రూముల్లోకి వెళ్లిపోయిన వారందరూ వచ్చారు. ఇప్పటి వరకూ ఆ పాటను వెయ్యికి పైగా వేదికల మీద లక్షసార్లు పాడాను. తరువాత “నాన్న” మీద మొదటి సారిగా పాట రాసింది నేనే. “జార్జిరెడ్డి” గురించి కూడా రాశాను. ఈ మధ్య బోనాల డీజే పాట “ఎల్లు ఎల్లమ్మ” చాలా ఫేమస్ అయింది. ఇంకా చాలా పాటలు గుర్తింపునిచ్చాయి.
మీరు రాసి పాడినవి మొత్తం ఎన్ని పాటలు? ఆల్బమ్స్ ఏమైనా…
రెండు వందలకు పైగా పాటలు రాశాను. రెండు వేలకు పైగా పాడాను. తెలంగాణ ఉద్యమంలో భాగంగా “మా పల్లె తల్లి” ఆల్మమ్‌తో పాటు మొత్తం పది ఆల్బమ్స్‌కు పైగా చేశాను.
తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర…
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా నేను వేల వేదికల మీద పాటలు పాడటమే కాదు, రెండు సార్లు జైలుకి పోయాను. ఒక సారి ధర్నాలో నా చేయి విరిగింది. ఆ ఉద్యమ వాతావరణంలో నా పాట ఇంకా పదునెక్కి ప్రజలకు చేరువైంది. ఇంకా పీడిఎస్‌యూ, అరుణోదయ లాంటి సంస్థలతో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారులతో కలిసి పనిచేశాను.
అమెరికాలో పాడిన రైతు పాట గురించి…
2018 జూన్ అమెరికాలో తెలంగాణ వరల్డ్ కన్వెన్షన్ డే సందర్భంగా తెలంగాణ నుండి నేను ఒక్కడినే పాడటానికి వెళ్లాను. అక్కడికి అమెరికాలో ఉండే తెలుగువారు మాత్రమే కాదు ఇంకా 50 పైగా దేశాల నుండి తెలంగాణ అభిమానులు వచ్చారు. అక్కడ “రైతుకోసం” 30నిమిషాల పోగ్రామ్ ఏర్పాటు చేసి పాట పాడాలన్నారు. అప్పుడు నేను అదే రాత్రి పాట రాసి పాడాను. ఆ పాట నాకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టడమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా తెలుగువారందరిని కదిలించింది. రైతుబంధు మీద కూడా ఒక పాట రాశాను.
ట్యూన్ చేసి రాస్తారా రాసిన తర్వాత ట్యూన్ చేస్తారా? సినిమా పాటల అవకాశాల గురించి..
ట్యూన్ చేసుకుంటూ పాట రాస్తాను. డప్పు, డోలక్, పియానో, సంగీతానికి సంబంధించిన అన్ని చేయగలను. ఇప్పటి వరకూ రెండు (ద ఇండియన్ పోస్టుమెన్, పోలీస్ స్టేషన్) సినిమాలకు సంగీతం అందించాను. అయితే చాలా సినిమా అవకాశాలు వస్తున్నాయి. కాని ఇప్పట్లో అటువైపు వెళ్లడంలేదు. ఎందుకంటే ప్రజలతో ప్రజా ఉద్యమపాటలతో మమేకమై ఉన్నాను కాబట్టి ప్రజల పాటలకే సమయం కేటాయిస్తాను. అంబేడ్కర్ చెప్పినట్లుగా ఈ దేశ అభివృద్ధి జరగాలంటే దళిత బహుజనులకు రాజ్యాధికారం రావాలి. ఇప్పుడు నాతో పాటు చాలా మందికి రాజకీయ అవకాశం దొరికింది నాకు రాజకీయ అవకాశం వస్తే ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
మీ కుల రహిత సమాజ లక్షంలో భాగంగా, మీ ప్రేమ వివాహం గురించి…
మాది కులాంతర వివాహం. బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పినట్లుగా ఈ దేశంలో మనం ఎటు వెళ్లాలనుకున్నా ఏ దిక్కు చూసిన మనకు అడ్డుగా కనిపించేది కులం. ఈ దేశాన్ని కులరహితం చేయాలంటే కులాంతర వివాహాలు జరగాలి అప్పుడే అది సాధ్యం. మాకు డిగ్రీలో పరిచయం ఏర్పడింది. పరిచయం స్నేహమై ప్రేమగా మారింది. వేరు వేరు కులాలు అయినా మా తల్లిదండ్రులను ఒప్పించగలిగాం. మాకు ఇద్దరు పిల్లలు. అయితే మా బాబుని స్కూల్లో చేర్పించేటప్పుడు కులం కాలమ్ నింపకుండానే వదిలేశాను. తర్వాత స్కూల్ యాజమాన్యం నాకు ఫోన్ చేసి మీ కులం ఏమిటో చెప్పాలన్నారు. మాకు కులం లేదు ఒక వేళ మీకు కులం తప్పని సరి అయితే వేరే స్కూల్లోకి పంపిస్తాను అక్కడ కూడ ఈ సమస్య ఎదురైతే దాని గురించి పోరాటం చేస్తా అని చెప్పాను. అన్ని దేశాలకంటే మన దేశం వెనుకబడి ఉండటానికి కారణం ఈ కులమే. మేము మా పిల్లలకు కులం గురించి చెప్పదలచుకోలేదు. ఎందుకంటే పిల్లలకు చిన్నప్పుడే నీ కులం ఇది అని చెప్పగానే వాళ్ల మెదడులో ఆ భావన నాటుకుపోతుంది. ఆ భావన పోవా లంటే కులం పోవాలి. పిల్లలకు కుల మతాల గురించి చెప్పకూడదు. ఈ దేశంలో కులాన్ని అంతం చేయడంకోసం నా వంతుగా నేను కృషి చేస్తాను.

బొర్ర శ్రీనివాస్….

Comments

comments