పద్ధతి మార్చుకోకపోతే పనిపడతాం

Etela warning to private hospitals on covid treatment

 

మానవత్వానికి కళంకం తెస్తున్నారు చిన్నపాటి వైద్యానికి అంతంత డబ్బులు గుంజడం హీనమైన చర్య
ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యమంత్రి ఈటల ఘాటైన హెచ్చరిక
కరోనా చికిత్సకు రూ. 1000లోపు ఔషధాలు చాలు
రోజుకు గరిష్టంగా 9వేలకు మించి తీసుకోవద్దు
కార్పొరేటు, గాంధీలో కొవిడ్ రోగులకు ఇచ్చే మందులు ఒకటే
దగ్గు, జలుబు, జ్వరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
పిహెచ్‌సి స్థాయి నుంచి వైద్యం

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా చికిత్సకు అయ్యే ఖర్చు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమేనని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి తేల్చిచెప్పారు. ఈ వైరస్ నివారణకు అయ్యే మందులు, చికిత్స కాస్ట్‌లీ కాదని అన్నారు. హైడ్రాక్సిక్లోరోక్విన్ అజిత్రోమైసిన్, డెక్సామెథాసిన్ వంటి మెడిసిన్ కూడా వేల రూపాయల్లో లేవని ఆయన తెలిపారు. దీంతో పాటు వెంటిలేటర్ అవసరమైన రోగికి పది రోజుల పాటు రోజుకో సిలిండర్ పెట్టినా కేవలం రూ.2500 మాత్రమే ఖర్చు అ వుతుందని ఆయన స్పష్టం చేశారు. కార్పొరేట్ అయినా, గాంధీ ఆసుపత్రిలోనైనా కరోనా రోగులకు ఇచ్చే మందులు ఒకటేనని ఆయన తెలిపారు. కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగులను భయపెట్టి మరి దోపిడికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.

చిన్నపాటి వైద్యానికి అధిక ఫీజులు తీసుకోవడం హీనమైన చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అ నేక సార్లు సూచించామని, ఇక పద్ధతి మార్చకోకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రైవేట్ హస్పిటల్స్‌కి ఏ స్పూర్తితో చికిత్సకు అనుమతి ఇచ్చామో దాన్ని పాటించడం లేదని ఆయన వెల్లడించారు. ఇటీవల ప్రభుత్వ జి.ఓను ఉల్లంఘించిన డెక్కన్, వి రంచి ఆసుపత్రులపై చర్యలు తీసుకోగా, రెండు రోజుల్లో మరో రెండు కార్పొరేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు బాధ్యతగా సేవలందించాలని ఆయన మరోసారి ప్రైవేట్ ఆసుపత్రులకు విజ్ఞప్తి చేశారు.

డబ్బులు సంపాదించుకోవడానికి ఇది సరైన సమయం కాదని, కరోనా వైద్యాన్ని వ్యాపార కోణంలో చూడోద్దని ఆయన మరోసారి సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రుల చర్యలు మానవాళికే కళంకం తెచ్చేలా ఉన్నాయని మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం మంత్రి కోఠి కమా ండ్ కంట్రోల్ రూంలో డిఎంఇ డా రమేష్‌రెడ్డి, డిహెచ్ డా శ్రీనివాసరావులతో కలసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం సీజనల్ వ్యాధుల కాలం కావున దగ్గు, జలుబు, జ్వరం వచ్చినా ఏ మాత్రం నిర్లక్షం చేయొద్దని ఈటల పేర్కొన్నారు. ఈ లక్షణాలు తేలగానే వెంటనే స్థానికంగా ఉన్న పిహెచ్‌సి, సిహెచ్‌సిలకు వెళ్తే కరోనా టెస్టు చేసి, చికిత్సకు రిఫర్ చేస్తారని మంత్రి తెలిపారు. లక్షణాలు లేకుండా, సాధారణ లక్షణాలతో వైరస్ తేలితే అక్కడే మందులు ఇచ్చి హోం ఐసోలేషన్‌లో ఉంచుతారని అన్నారు.

ఈ సౌకర్యం లేని వారికి ఆయా మండల కేంద్రాల్లోనే ప్రత్యేకమైన సెంటర్లను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. సీరియస్ కండీషన్ వాళ్లను వెంటనే 108 ద్వారా ఆసుపత్రులకు తరలిస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో ఆశావర్కర్లు, ఎఎన్‌ఎంలు ఫీవర్ సర్వే చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎవరికైనా లక్షణాలు ఉంటే వెంటనే వారికి తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి జిల్లా అధికారులకు కరోనా చికిత్స విధానంపై సమీక్ష నిర్వహించి ప్రత్యేక సూచనలు చేసినట్లు ఆయన వెల్లడించారు. దీంతో పాటు స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపిలు, పిఎంపిలకు కూడా కరోనా నివారణ చర్యల్లో భాగస్వామ్యం కావాలని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. చాలా మంది తమకు ఏం కాదులే అనే భావనలో ఉన్నారని, వైరస్ లక్షణాలు ఉన్నప్పటికీ 4,5 రోజుల పాటు లైట్ తీసుకుంటున్నారని ఇది మంచిదికాదన్నారు. ఇప్పటికే వైరస్‌సోకిన కొందరిలో 4,5 రోజులకే శ్వాస సమస్యలు వస్తున్నాయన్నారు.

అన్ని టివివిపి ఆసుపత్రుల్లోనూ వైద్యం..
రోజురోజుకి కేసులు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాల్లో వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న ఆసుపత్రుల్లోనూ కరోనా వైద్యం అందించేందు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. దీంతో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్‌లోనూ బేసిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నామని అన్నారు. వీటికి అనుసంధానంగా 108 సర్వీసులను పెట్టి అవసరమైన రోగులను ఆసుపత్రులకు తరలిస్తున్నామని తెలిపారు. అదే విధంగా 104 ద్వారా ప్రతి కరోనా రోగికి టెలీమెడిసిన్ విధానాన్ని కల్పిస్తున్నామని, దీంతో పాటు సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నామన్నారు. అంతేగాక రిటైర్డ్ వైద్యులతో హీతం అనే యాప్ ద్వారా ప్రతి రోజు 70 మంది రోగులకు ఆన్‌లైన్ విధానంలో రోగులకు వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు.

దీంతో పాటు కరోనా చికిత్స పొందే రోగి వెంట కుటుంబ సభ్యులు లేకపోవడంతో చాలా మంది భయబ్రాంతులకు గురవుతున్నారని, వీరిలో మానసికంగా దైర్యాన్ని ఇచ్చేందుకు డాక్టర్లు, నర్సులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని మంత్రి అన్నారు. ఇప్పటికే ఎంఎన్‌ఆర్, మల్లారెడ్డి, మమత, కామినేని, మల్లారెడ్డి వంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా కరోనా వైద్యం ఇస్తున్నామని తెలిపారు. సకాలంలో వైద్యం పొంది ప్రాణాలు నిలపెట్టుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా సోకిన వ్యక్తికి ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటుంది కావున సకాలంలో ఆసుపత్రులకు వెళ్లాలని, ఆలస్యం చేస్తే ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు.

కార్పొరేట్‌కు వెళ్తేనే బ్రతుకుతామనే వాదనలో నిజం లేదు..
చాలా మందికి కార్పొరేట్‌కు వెళ్తేనే బ్రతుకుతాం అనే అపోహలో ఉన్నారని, దానిలో వాస్తవం లేదని మంత్రి కొట్టిపరేశారు. ప్రభుత్వాసుపత్రుల్లోనూ అద్బుతమైన వైద్యం అందుతుందని తెలిపారు. కార్పొరేట్‌లో క్రిటికల్ రోగులను చేర్చుకోవడం లేదని, చేర్చుకున్న చనిపోతాడు అనే తెలిసిన వెంటనే ప్రభుత్వాసుపత్రులకు పంపించేస్తున్నారని ఆయన చెప్పారు. దీని ద్వారా బ్రతికే మనిషి కూడా చనిపోయే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మనిషి కదలడం వలన అనేక ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. కరోనా వైద్యంలో ప్లాస్మా అనేది ఒక ప్రయత్నం మాత్రమేనని, అందరికీ ప్లాస్మా చికిత్స సత్ఫలితాలను ఇస్తుందనడంలో నిజం లేదని ఆయన మంత్రి అన్నారు.

Etela warning to private hospitals on covid treatment

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post పద్ధతి మార్చుకోకపోతే పనిపడతాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.