వెన్నెల కుటుంబాన్ని ఆదుకుంటాం

Errabelli

 

మహిళల రక్షణకు షీ టీమ్స్‌ను పెంచుతాం
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సత్వర న్యాయం జరిపిస్తాం
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

వరంగల్ : మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నేరస్థులను కఠినంగా శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మృతిచెందిన వెన్నెల కుటుంబానికి హామీ ఇచ్చారు. సోమవారం వరంగల్ అర్బన్ జిల్లా సమ్మయ్యనగర్‌లోని వెన్నెల తాతయ్యనానమ్మలను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన ఘోర సంఘటనపై వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెన్నెల మృతిచెందిన సంఘటన దారుణమైందని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా వృద్ధ దంపతులను ఆయన ఓదార్చారు. ప్రభుత్వ పరంగా వృద్ధ దంపతులను అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతుందన్నారు.

వరంగల్‌లో మానవ మృగాల ఆగడాలు పెచ్చుమీరుతున్నందున మహిళల రక్షణ కోసం ప్రత్యేక షీ టీంలను నియమించడం జరుగుతుందన్నారు. వాటి ద్వారా మహిళలకు భద్రత కల్పించడమే కాకుండా మానవ మృగాలపై ఎప్పటి కప్పుడు నిఘాను కొనసాగిస్తు వారి ఆటలను కట్టడి చేయడానికి షీ టీంలు ప్రత్యేకంగా పనిచేస్తాయన్నారు. జరిగిన సంఘటనపై పోలీసులు సత్వర విచారణ వేగవంతం చేయాలన్నారు. స్త్రీ హిత కేసును పోలిన విధంగా సిరిగిరి వెన్నెల కేసు విచారణ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ కొనసాగుతుందన్నారు.

సత్వర న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టే సరైందని దోషులను వదిలిపెట్టేదిలేదని చెప్పారు. వెన్నెల సంఘటన జరుగడానికి దారి తీసిన పరిస్థితులు, కాలనీవాసుల అభిప్రాయాలు స్థానిక పోలీసు అధికారులతో మంత్రి కులంకుశంగా వివరాలను తెలుసుకున్నారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్‌తో బాధితులకు న్యాయం జరిగే విధంగా విచారణ వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రితోపాటు స్థానిక శాసనసభ్యుడు ధాస్యం వినయ్‌భాస్కర్ మంత్రితోపాటు వెన్నెల కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు.

వరంగల్ అత్యాచార నిందితుల్ని కఠినంగా శిక్షించాలి.. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ : ఎర్రల్ల శ్రీనివాస్

వరంగల్‌లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని అందుకు సంబంధించిన చర్యల్ని వేగవంతం చేయాలని వరంగల్ సీపీ రవీందర్‌కు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రెల్ల శ్రీనివాస్ ఫోన్‌లో ఆదేశించారు. సోమవారం మైనర్ బాలిక సామూహిక అత్యాచారం, ఆత్మహత్య ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈమేరకు వరంగల్ సీపీతో ఫోన్‌లోనే సంఘటనకు సంబంధించిన వివరాలపై మాట్లాడారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ఆయన సూచనలు ఇచ్చారు. ఈ సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సంఘటన తనను ఎంతగానో కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కరీంనగర్ రోడ్డుపై బాధితుల ధర్నా, రాస్తారోకో
మైనర్ బాలికపై సామూహిత అత్యాచారం చేసిన ఐదుగురు మానవ మృగాలపై కఠిన చర్యలు తీసుకోవాలిన కోరుతు సమ్మయ్యనగర్ కాలనీ ప్రజలు కేయూసీ పోలీస్‌స్టేషన్ దగ్గర కరీంనగర్ రోడ్డుపై రాస్తారోకో ధర్నాను నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాస్తారోకో చేయడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. జరిగిన సంఘటనపై విచారణను వేగవంతం చేస్తామని కొందరు నిందితుల్ని అరెస్టు చేయడం జరిగిందని మైనర్ బాలిక కుటుంబానికి సత్వర న్యాయం జరిగేలా చూస్తామని ఎస్సై హరికృష్ణ బాధితులకు హామిచ్చారు. హామీ మేరకు బాధితులంతా రాస్తారోకోను విరమించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి.

Errabelli said we support the Vennela Family

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వెన్నెల కుటుంబాన్ని ఆదుకుంటాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.