24 గంటల్లో మార్చండి

RBI

 

తప్పనిసరిగా డేటా నిల్వ దేశీయంగానే ఉండాలి
పేమెంట్ సంస్థలకు ఆర్‌బిఐ ఆదేశాలు

న్యూఢిల్లీ: చెల్లింపులకు సంబంధించిన సమాచారం తప్పనిసరిగా భారత్‌లోనే నిల్వ ఉంచాలని, పేమెంట్ సంస్థలు 24 గంటల్లో భారత్‌లోకి ఈ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. మాస్టర్ కార్డ్, వీసా వంటి విదేశీ పేమెంట్ సంస్థలు లావాదేవీల సమాచారాన్ని భారత్‌లో కాకుండా ఇతర దేశాల్లో భద్రపరుస్తున్నాయి. అయితే ఇక నుంచి అలాంటిది ఉండకూడదని తప్పనిసరిగా భారత్‌లోనే చెల్లింపుల సమాచారాన్ని నిల్వ చేయాలని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) బుధవారం తేల్చి చెప్పింది. చెల్లింపుల డేటాను విదేశీ సంస్థలు తప్పనిసరిగా భారత్‌లోనే నిల్వ చేయాలని గతేడాది ఏప్రిల్‌లో ఆర్‌బిఐ ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల్లోగా ఆ సమాచారాన్ని భారత్‌లోనే భద్రపరచాలని సిస్టమ్ ప్రొవైడర్లకు సూచించింది. దీనిపై చెల్లింపులు సంస్థలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆర్‌బిఐ తాజాగా ఈ ప్రకటన జారీ చేసింది.

పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్(పిఎస్‌ఒఎస్) లేవనెత్తిన అంశాలపై ఆర్‌బిఐ సమాధానమిస్తూ, మొత్తం చెల్లింపు సమాచారమంతా భారత్‌లోని వ్యవస్థల్లోనే నిక్షిప్తం చేయాలని పేర్కొంది. ఒకవేళ ప్రాసెసింగ్ విదేశాల్లో జరిగితే అక్కడి సిస్టమ్స్‌లోని సమాచారాన్ని తొలగించి, 24 గంటల్లో దాన్ని భారత్‌కు తీసుకురావాలని ఆర్‌బిఐ వెల్లడించింది. గత వారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ నేతృత్వంలో ఇకామర్స్ సంస్థలు ‘డేటా లోకలైజేషన్’ అంశాన్ని లేవనెత్తారు. ఆ నేపథ్యంలో ఆర్‌బిఐ ఈ వివరణ ఇచ్చింది. కస్టమర్ల డేటాను విదేశాల్లో కాకుండా భారత్‌లో నే నిల్వ ఉంచాలంటూ గతేడాది ఏప్రిల్‌లో ఆర్‌బిఐ నిబంధన విధించింది. దీనికి గాను ఆరు నెలల గడువును విధించింది.

క్రెడిట్ కార్డు దిగ్గజ సంస్థలు వీసా, మాస్టర్ కార్డ్ సహా కొన్ని విదేశీ సంస్థలు ఈ గడువును పాటించలేకపోయాయి.దీనిపై పియూష్ గోయల్‌తో సమావేశమైన పేమెంట్ కంపెనీలు హాజరై ఆర్‌బిఐ జారీ చేసిన డేటా స్టోరేజ్ నిబంధనల పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పటి దాకా తమతమ దేశాల్లో డేటాను నిల్వ చేస్తున్న మాస్టర్, వీసా కార్డ్ వంటి సంస్థలకు ఇది పెనుభారంగా మారింది. స్థానికంగా డేటాను నిల్వ చేయాలంటే అదనంగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని గ్లోబల్ సంస్థలు పేర్కొన్నాయి. అయితే దేశీయంగా డేటాను నిల్వ చేయడం వల్ల అవసరమైనప్పుడు పర్యవేక్షణ, దర్యాప్తు చేపట్టేందుకు అనుకూలంగా ఉంటుందని భారత్‌లో విధానకర్తలు నమ్ముతున్నారు.

Entire payment data shall be stored in systems located only

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 24 గంటల్లో మార్చండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.