తీపి, చేదు జ్ఞాపకాల ప్రపంచకప్…

World Cup

 

క్రీడా విభాగం : ఇంగ్లండ్ వేదికగా సుదీర్ఘ రోజుల పాలు కొనసాగిన ప్రపంచకప్ అత్యంత విజయవంతమైన విశ్వకప్‌గా క్రికెట్ చరిత్రలో చిరకాలం నిలిచి పోతుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకు ఎన్నో ప్రపంచకప్‌లు జరిగాయి. కానీ, ఈసారి ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్ అంత ఉత్కంఠభరితంగా ఏ టోర్నీ కూడా సాగలేదు. లీగ్ దశతో పాటు సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు కూడా అభిమానులను కట్టి పడేశాయి. ఇంగ్లండ్ అనూహ్యంగా విశ్వ విజేతగా నిలువడమే ఈ ప్రపంచకప్‌కు ఓ ప్రత్యేకత మారింది.

నాటకీయ పరిణామాల మధ్య ఇంగ్లండ్ విశ్వకప్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సొంత గడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ క్రమంలో ఎన్నో ఏళ్లుగా తమకు అందని ద్రాక్షగా మిగిలిన విశ్వకప్ కలను సాకారం చేసుకుంది. లీగ్ దశ నుంచే ఈ ప్రపంచకప్ అనూహ్య మలుపులతో సాగింది. టోర్నమెంట్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్‌లోనే చేతులెత్తేసింది. ఇక, ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన వెస్టిండీస్ తన ఆరంభ మ్యాచ్‌లోనే బలమైన పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది.

న్యూజిలాండ్ తన తొలి మ్యాచ్‌లో శ్రీలంకను అత్యంత అలవోకగా ఓడించి తానెంటో నిరూపించింది. ఇక, ఈ ప్రపంచకప్‌లో ఆసియా సంచలనం బంగ్లాదేశ్ అసాధారణ ఆటతో అందరిని ఆకట్టుకుంది. ఆ జట్టు స్టార్ ఆటగాడు షకిబుల్ హసన్ ఆల్‌రౌండ్‌షోతో ప్రపంచకప్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మరోవైపు ఈ ప్రపంచకప్‌లో భారీ ఆశలతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. ఒకటి రెండు సంచలన విజయాలు సాధిస్తుందని భావించిన ఆసియా యువ కెరటం అఫ్గానిస్థాన్ ఒక్క విజయం కూడా సాధించకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఈ వరల్డ్‌కప్‌లో ప్రకంపనలు సృష్టిస్తాడని భావించిన అఫ్గాన్ యువ ఆటగాడు రషీద్ ఖాన్ తన కెరీర్‌లోనే అత్యంత చెత్త ప్రదర్శనతో నిరాశే మిగిల్చాడు. అంతేగాక ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్డే చరిత్రలోనే అత్యంత చెత్త బౌలింగ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇక, ఆఖరి ప్రపంచకప్ ఆడుతున్నట్టు ముందే ప్రకటించిన వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ అత్యంత చెత్త బ్యాటింగ్‌తో అభిమానులకు తీరని ఆవేదన మిగిల్చాడు. ఏ మ్యాచ్‌లో కూడా తన స్థాయికి తగ్గ ఆటను కనబరచలేక పోయాడు. అతని పేలవమైన ప్రదర్శన వెస్టిండీస్‌కు ప్రతికూలంగా మారింది. ఐపిఎల్‌లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆండ్రీ రసెల్ కీలకమైన ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఫిట్‌నెస్ లేమితో సతమతమైన రసెల్ లీగ్ దశలోనే టోర్నీ నుంచి వైదొలిగాడు.

వరుణుడి దెబ్బ
మరోవైపు ఈ ప్రపంచకప్‌కు వరుణుడు పెద్ద సమస్యగా మారాడు. వరుణుడి ప్రతాపానికి గతంలో ఎన్నడూ లేని విధంగా పలు మ్యాచ్‌లు రద్దుకాక తప్పలేదు. కీలకమైన మ్యాచ్‌లకు వర్షం అడ్డంకిగా తయారైంది. వరుణుడి ఆగ్రహానికి ఎన్నో జట్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్ల సెమీఫైనల్ అవకాశాలను వరుణుడు దెబ్బతీశాడని చెప్పాలి. వర్షం వల్ల ఈసారి ఏకంగా నాలుగు మ్యాచ్‌లు పూర్తిగా తుడిచి పెట్టుకు పోయాయి.

భారత్‌న్యూజిలాండ్, పాకిస్థాన్‌శ్రీలంక, బంగ్లాదేశ్‌శ్రీలంక, సౌతాఫ్రికావెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు వర్షం వల్ల అర్ధాంతరంగా రద్దయ్యాయి. ఇక, భారత్‌న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డంకిగా మారాడు. ఒక రకంగా చెప్పాలంటే భారత్‌ను ప్రపంచకప్ నుంచి దూరం చేసింది వర్షమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌కు వరుణుడు అడ్డు పడిఉండక పోతే టీమిండియా కచ్చితంగా ఫైనల్‌కు చేరి ఉండేది. అయితే వర్షం వల్ల మ్యాచ్ రిజర్వ్‌డేకు మారడం కూడా భారత్ అవకాశాలను దెబ్బతీసింది.

రోహిత్ ప్రకంపనలు
ఈ ప్రపంచకప్ టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మకు చిరకాలం తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పాలి. ఒక్క సెమీ ఫైనల్ మ్యాచ్‌ను మినహాయిస్తే ఈ వరల్డ్‌కప్‌లో రోహిత్ పరుగుల సునామీ సృష్టించాడు. ప్రతి మ్యాచ్‌లోనూ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థి జట్ల బౌలర్లకు సవాలుగా మారాడు. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా రోహిత్ కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఒకే వరల్డ్‌కప్‌లో ఐదు సెంచరీలు సాధించిన ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్‌గా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అంతేగాక 9 మ్యాచులు ఆడిన 81.00 సగటుతో రికార్డు స్థాయిలో 648 పరుగులు సాధించాడు. 98.33 స్ట్రయిక్‌రేట్‌తో ఈ పరుగులు సాధించడం విశేషం. రోహిత్ రికార్డు స్థాయిలో ఐదు సెంచరీలు సాధించి ప్రపంచకప్‌లో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు.

కివీస్‌కు తీరని శోకం
కాగా, ఈ ప్రపంచకప్ న్యూజిలాండ్‌కు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇంగ్లండ్‌తో సమానంగా నిలిచినా అంతర్జాతీయ క్రికెట్ మండలి అమలు చేసిన కొత్త నిబంధనతో ట్రోఫీకి దూరం కాక తప్పలేదు. ఇంగ్లండ్‌తో కలిసి సంయుక్త విజేతగా నిలవాల్సిన కివీస్ ఐసిసి కొత్త రూల్స్‌తో రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టైగా ముగిసింది. సూపర్ ఓవర్ కూడా టై అయ్యింది. అయితే బౌండరీల కౌంట్‌తో ఇంగ్లండ్ ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఇది కివీస్‌కు ఆశనిపాతంలా మారింది. ఒక రకంగా చెప్పాలంటే న్యూజిలాండ్ గెలిచి ఓడిందనే చెప్పాలి. మరోవైపు అదృష్టం కలిసి రావడంతో ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది.

England won the trophy at the World Cup

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తీపి, చేదు జ్ఞాపకాల ప్రపంచకప్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.