ఎదురులేని ఇంగ్లండ్…

 World Cup

 

లండన్ : ప్రపంచకప్‌లో ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ అంచనాలకు తగినట్టుగానే రాణించి ఫైనల్‌కు చేరుకుంది. ఆరంభం నుంచే ఇంగ్లండ్ అద్భుతంగా ఆడింది. అయితే పాకిస్థాన్ చేతిలో ఓటమి ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. తర్వాత పేలవమైన ప్రదర్శనతో సెమీస్ బెర్త్‌ను ప్రశ్నార్థకంగా మార్చుకుంది. కానీ, కీలక సమయంలో వరుస విజయాలు సాధించి మళ్లీ రేసులో నిలిచింది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ సమరంలో అద్భుత విజయం సాధించి ఫైనల్లో ప్రవేశించింది.

ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే తుది పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్ అసాధారణంగా రాణిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఓపెనర్లు జాసన్ రాయ్, బెయిర్‌స్టోలు ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నారు. మధ్యలో కొన్ని మ్యాచులకు రాయ్ దూరం కావడంతో జట్టు బ్యాటింగ్ గాడి తప్పింది. ఎప్పుడైతే జాసన్ మళ్లీ జట్టులోకి వచ్చాడో ఇంగ్లండ్ మళ్లీ గాడిలో పడింది.

భారత్, న్యూజిలాండ్‌లతో జరిగిన మ్యాచుల్లో ఇంగ్లండ్ అలవోక విజయాలు సాధించి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లలో మోర్గాన్ సేన సమష్టిగా రాణించింది. వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాను ఓడించి సెమీస్ రేసులో నిలిచింది. ఈ విజయం ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. తర్వాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను కూడా ఓడించి మూడో స్థానాన్ని దక్కించుకుంది.

సమష్టిగా ముందుకు
ఇంగ్లండ్ ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ సమష్టి పోరాటాన్నే నమ్ముకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా పోరాడింది. ఇటు బ్యాట్స్‌మెన్, అటు బౌలర్లు తమవంతు పాత్ర సమర్థంగా పోషించారు. ప్రతి ఆటగాడు తనవంతు పాత్రను బాగానే నిర్వర్తించాడు. దీనికి మోర్గాన్ అద్భుత కెప్టెన్సీ తోడు కావడంతో ఇంగ్లండ్‌కు ఎదురే లేకుండా పోయింది. క్లిష్ట సమయాల్లో బెయిర్‌స్టో, మోర్గాన్, రాయ్, బెన్‌స్టోక్స్ తదితరులు అద్భుతంగా ఆడారు. జట్టు అవసరాలకు అనుగుణంగా తమ ఆటను మార్చుకుంటూ ముందుకు సాగారు.

ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ సమరంలో ఇంగ్లండ్ ఆటను ఎంత పొగిడినా తక్కువే. ముందు బౌలర్లు వోక్స్, ఆర్చర్, రషీద్ అసాధారణ రీతిలో చెలరేగి పోయారు. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. ఇక లక్షఛేదనకు దిగిన జట్టుకు ఓపెనర్లు రాయ్, బెయిర్‌స్టోలు కళ్లు చెదిరే శుభారంభం అందించారు. రాయ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ విజయాన్ని ఖరారు చేశాడు. మోర్గాన్, రూట్‌లు తమవంతు పాత్ర పోషించారు.

England team in World Cup final

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎదురులేని ఇంగ్లండ్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.