రాహుల్, రిషబ్ పోరాడినా…

England beat India by 118 runs in fifth Test

భారత్ ఓటమి, చివరి టెస్టులో ఇంగ్లండ్ విజయం, 41తో సిరీస్ కైవసం

లండన్: చివరి టెస్టులో ఓటమిని తప్పించుకునేందుకు భారత్ అసమాన పోరాట పటిమను కనబరిచినా ఫలితం లేకుండా పోయింది. చివరి రోజు ఓపెనర్ లోకేశ్ రాహుల్, యువ వికెట రిషబ్ పంత్‌లు చిరస్మరణీయ సెంచరీలు సాధించినా జట్టును ఓటమి నుంచి రక్షించలేక పోయారు. ఓవల్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 118 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 41తో కైవసం చేసుకుంది. 58/3 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం ఆట ప్రారంభించిన భారత్‌కు రాహుల్, రహానెలు అండగా నిలిచారు. రహానె సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ రాహుల్ సహకరించాడు. మరోవైపు రాహుల్ దూకుడుగా ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. ఇద్దరు కుదురుగా ఆడడంతో భారత్ కోలుకున్నట్టే కనిపించింది. అయితే 106 బంతుల్లో ఐదు ఫోర్లతో 37 పరుగులు చేసిన రహానెను మోయిన్ అలీ వెనక్కి పంపాడు. దీంతో 118 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన యువ ఆటగాడు హనుమ విహారి (౦) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దీంతో భారత్ 121 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ ఇన్నింగ్స్ ముగియడమే లాంఛనమేనని అందరు ఓ అంచనకు వచ్చేశారు.
రాహుల్, రిషబ్ పోరాటం..
ఈ దశలో యువ ఆటగాడు రిషబ్ పంత్‌తో కలిసి రాహుల్ అసాధారణ పోరాటాన్ని కొనసాగించాడు. ఇద్దరూ ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొం టూ ముందుకు సాగారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే అడపాదడపా బౌండరీలు కొడు తూ స్కోరును పరిగెత్తించారు. వీరిని ఔట్ చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇద్దరు పోటీ పడి ఆడడంతో భారత్ అనూహ్యంగా పుంజుకుంది. ఈ జంటను విడగొట్టేందుకు ఇంగ్లీష్ బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. సిరీస్‌లో ఆశించని విధంగా రాణించని రాహుల్ ఈ ఇన్నింగ్స్‌లో మాత్రం చిరస్మరణీయ పోరాట పటిమను కనబరిచాడు. రిషబ్ కూడా దూకుడుగా ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్లు హడలెత్తించాడు. టివిరామ సమయానికి ఇద్దరు మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డారు. చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 224 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 149 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో ఆరో వికెట్‌కు రికార్డు స్థాయిలో 204 పరుగులు జోడించాడు. ఇక, రిషబ్ తన కెరీర్‌లో తొలి శతకాన్ని సాధించాడు. ధాటిగా ఆడిన రిషబ్ 146 బంతుల్లో 15 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 114 పరుగులు చేశాడు. అతను సిక్స్‌తో సెంచరీని అందుకోవడం విశేషం. అయితే టివిరామం తర్వాత రాహుల్, రిషబ్‌లు వెంటవెంటనే ఔట్ కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. చివర్లో రవీంద్ర జడేజా (13) కాస్త పోరాటాన్ని కనబరిచినా ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ మూడు, శామ్ కరన్, ఆదిల్ రషీద్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

Comments

comments