తుపాకులగూడెం ఎగువనుంచే సేఫ్…

 Srisailam

 

శ్రీశైలానికి గోదారిపై ఇంజినీర్ల అభిప్రాయం

హైదరాబాద్ : గోదావరి వరదను శ్రీశైలంకి తీసుకెళ్లే క్రమంలో రాంపూర్ వద్ద తలపెట్టిన బ్యారేజికి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సముద్రం పాలవుతున్న గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు తరలించి, కృష్ణా నదిలో లోటును పూడ్చాలని సూత్రప్రాయంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇంజనీర్ల కసరత్తు కొనసాగుతుంది. బుధవారం నాడు రిటైర్డ్ ఇంజనీర్లు, అంతర్రాష్ట వ్యవహారాల ఇంజనీర్లు సమావేశమై, రాంపూర్ అలైన్‌మెంట్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, దాని కంటే తుపాకుల గూడెం బ్యారేజి ఎగువ బాగం నుంచి నీటిని తీసుకుంటేనే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారు.

మిగతా అలైన్‌మెంట్ అంతా యధాతధంగా ఉండనుంది. తుపాకులగూడెం బ్యారేజి ఎగువ నుంచి ప్రస్తుతం దేవాదుల ఎత్తిపోతల పథకానికి నీటిని తీసుకుంటారు. ఆ పాయింట్‌కు కిలోమీటర్ ఎగువ నుంచి నీటిని తీసుకుని, ఒక దశ ఎత్తిపోతలతో లక్నవరం, కాకతీయ కెనాల్‌లో పోస్తే ఉదయ సముద్రం వరకు నీటిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి రెండు పాయలుగా నదిని విడగొట్టి, ఒక పాయను శ్రీశైలం, మరో పాయను నాగార్జునసాగర్‌కు తీసుకెళతారు. దేవాదుల ఇన్‌టేక్ వెల్‌కు కిలోమీటర్ ఎగువ నుంచి నీటిని తీసుకుంటారు. ఇక్కడ 85 మీటర్ల పూర్తిస్థాయి నీటిమట్టంతో బ్యారేజి నిర్మించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి 47 కిలోమీటర్ల దూరం నీటిని మళ్లించి 130 మీటర్ల ఎత్తుకు లిఫ్టు చేసి, లక్నవరం చెరువులో పోస్తారు.

రాంపూర్ నుంచి వన్యప్రాణి మృగ సంరక్షణ కేంద్రం ఉన్నందున కేంద్ర ప్రభుత్వ అనుమతులు చాలా కష్టతరంగా ఉంటాయి. దీనికి తోడు సుప్రీం కోర్టు కూడా అనుమతించాల్సి ఉంటుంది. లక్నవరం చెరువు నుంచి 18 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం తవ్వ 90 మీటర్ల ఎత్తు లిఫ్టు చేసి, కాకతీయ కెనాల్‌లో పోస్తారు. ఈ కెనాల్‌లోనే సుమారు 100 కిలోమీటర్ల మేర ప్రయాణించే నీరు మూసీ నదిపై నిర్మించే అక్వడెక్టు మీదుగా నది దాటుతుంది. మూసీ అక్వడెక్ట్ నుంచి 70 కిలోమీటర్ల దూరం కాలువ తవ్వి ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని మళ్లించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి నీటిని దేవులపల్లి చెరువుకు మళ్లిస్తే నేరుగా నాగార్జునసాగర్‌కు నీరు వెళుతుంది.

కాలువ చివర్లో 234 మీటర్ల నుంచి 274 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేలా 40 మీటర్ల ఎత్తుతో లిఫ్టు నిర్మించాలి. 30 కిలోమీటర్ల దూరం కాలువ ద్వారా నీటిని మళ్లించాలి. మళ్లీ 45 కిలోమీటర్ల ఎత్తుతో పంపుహౌజ్ నిర్మించి, 310 మీటర్ల ఎత్తుకు నీటిని తీసుకెళ్లాలి. ఈ లిఫ్టు నుంచి 70 కిలోమీటర్ల దూరం టన్నెల్ తవ్వి ఒక టిఎంసి నీటిని శ్రీశైలం రిజర్వాయర్‌లో పోయాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనకు సుమారుగా రూ.70 వేల కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుందని ప్రాధమికంగా అంచనా వేశారు. ఇందులో 131 కిలోమీటర్ల దూరం సొరంగ మార్గం, 229 కిలోమీటర్ల దూరం ప్రధాన కాలువ ఉంటుంది. 25 కిలోమీటర్ల మేర లింక్ కెనాల్, 305 మీటర్ల ఎత్తుకు నీటిని పంపేలా లిఫ్టులు నిర్మించాల్సి ఉంటుంది.

23న మరోమారు తెలంగాణ ఇంజనీర్ల సమావేశం
రాంపూర్‌కు బదులుగా తుపాకులగూడెం బ్యారేజి ఎగువ నుంచి నీటిని తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. దీనిపై సునిశితంగా అధ్యయనం చేసేందుకు 23వ తేదీన మరోమారు సమావేశం కావాలని ఇంజనీర్లు నిర్ణయించారు. వ్యయ భారం ఎంతవుతుంది. నీటి పరిమాణం, కాలువలు, మధ్యలో వచ్చే ఆయకట్టు ఎంత అనే విషయాలను తదుపరి సమావేశంలో నిర్ణయిస్తారు. తుపాకులగూడెం నుంచి మొదలుకొని శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు నీటిని తీసుకెళ్లే మార్గమధ్యంలో సుమారుగా 10 లక్షల ఎకరాలు స్థిరీకరించవచ్చని అధికారులు అంచనాకు వచ్చారు.

ఎఎంఆర్‌పి, ఎస్‌ఎల్‌బిసి ఆయకట్టు, ఉదయ సముద్రం, డిండి, ఎస్‌ఆర్‌ఎస్‌పి స్టేజ్ 2 ఆయకట్టు, మూసీ ఆయకట్టుకు కూడా రక్షణ కల్పిస్తూ నీటిని తీసుకెళ్లాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. దీంతో పాటు నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్‌లను ఈ నీటితో నింపితే మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటితో అవసరాలు తీరతాయి. రాయలసీమకు కూడా సమృద్ధిగా నీరందుతుంది.

Engineers’ opinion on Godawari for Srisailam

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తుపాకులగూడెం ఎగువనుంచే సేఫ్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.