ఏది ముఖ్యం ఇల్లా-ఉద్యోగమా?

Women

 

ఏపుగా ఎదుగుతున్న మొక్క ప్రతిరోజూ కొత్త చిగురు వేసి, చక్కని పూవును బహుమతిగా ఇస్తున్నట్లు.. జీవితంఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త కానుక ఇస్తూనే ఉంది. ఒక్కో తరంలో ఒక్కో కొత్త సమస్య, కొత్త సమాధానం, కొత్త దారులు… ముఖ్యంగా స్త్రీల జీవితంలో వస్తున్న మార్పులకు అంతే లేదు. నాలుగయిదు దశాబ్దాల క్రితం అమ్మాయిలకు విద్యావకాశాలే లేవు. ఇంటికే పరిమితమై, పిల్లల్ని కని పెంచే యంత్రాల్లా ఉంటున్నామనుకునేవాళ్లు. ఉమ్మడి కుటుంబాల్లో అత్తలు, ఆడబిడ్డల నీడన బతికిన రోజులున్నాయి.

ఆ తరం ముందుకు నడిచింది. విద్యావకాశాలు వచ్చాయి. చదువుకున్నారు. ఉద్యోగాల్లో ముందుకుపోలేక పోతున్నామనుకునేవాళ్లు. గడపదాటి ఉద్యోగాలు చేసి స్వతంత్రంగా బతికితే బాగు అనుకున్నారు. ఆ తరం గడిచింది. ఇప్పుడీ తరంలో ఉమ్మడి సంసారాలు లేవు. అత్తగారి ఆథిపత్య సమస్యలు లేవు. కోరుకున్న చదువు, స్వేచ్ఛ, ఆర్థిక సాధికారత అన్నీ వచ్చాయి. అయితే ఇంత జరిగాక మరి సంతోషంగా ఉన్నారా అంటే లేదంటున్నాయి అధ్యయనాలు.
ఒక అధ్యయనం ప్రకారం ఇవ్వాల్టి ఉద్యోగినులైన స్త్రీలు, పెళ్లి, పిల్లలు బాధ్యతలతో ఉన్న యువతులు ఏ మాత్రం సంతోషంగా లేరంటోంది. ఎంత సంపాదిస్తున్నా, కెరీర్‌లో ఎంత ముందుకు దూసుకుపోతున్నా పిల్లలకు సరైన సమయం ఇవ్వలేకపోతున్నామని, అంతులేని పరుగులో దేన్నీ సుఖంగా ఆస్వాదించలేకపోతున్నామని, వందలకొద్దీ ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు ఒక ఆన్‌లైన్ సర్వేలో విచారం వ్యక్తం చేశారు.

క్షణం తీరుబడి లేదు: ఒక సర్వే ప్రకారం ఇద్దరూ ఉద్యోగులైన ఇంట భార్యాభర్తలు పిల్లలకోసం, కుటుంబం కోసం సమయం కేటాయించ లేక పోతున్నామనే చెప్పారు. వారం పొడుగునా నిమిషం తీరిక లేకుండా పరుగులు పెట్టే భార్యాభర్తలు వారంలో దొరికే రెండు రోజుల సెలవులో సగం ఇంటిపనులు, విశ్రాంతికే సరిపెట్టుకోగలుగుతున్నారు. పిల్లల కోసం తీరికగా గడిపే అవకాశం లేదు. కన్నపిల్లలకు సమయం ఇవ్వలేక పోతున్నామని వాపోతున్నారు. వాళ్ల ఆటపాటలు చూసి ఆనందించలేని ఉద్యోగాలు ఆదాయాలు దండగే అంటారు తల్లులు. ఆఫీసులో ఉన్నా పిల్లల గురించే ఆలోచిస్తామని, వారు స్కూలు నుంచి వచ్చే వేళకు తాము ఇళ్లల్లో లేకపోవడంతో గిల్టీ ఫీలింగ్‌తో బాధపడుతున్నమంటున్నారు. ఇది ఇవ్వాల్టి తరం సమస్య. చదువు, ఉద్యోగం, సంపాదన, స్వేచ్ఛ, పెద్దవాళ్ల బాదరబందీ లేదు. అయినా ఒక అశాంతితో కొట్టుకుపోతుందీ తరం.

పిల్లల్లో మానసిక సమస్యలు: ఇప్పటి పిల్లలకు ఇళ్లలో ఎవరి అదుపు ఉండటం లేదన్నది వాస్తవం. తల్లి తండ్రీ బిజీగా ఉండటంతో పిల్లల్లో హింసాత్మక ప్రవృత్తి ఎక్కువవుతోంది అంటున్నారు చైల్డ్ సైకాలజిస్టులు. ఇంటికి రాగానే టి.విల ముందు కూర్చోవటం, పెరిగే వయసులో వాళ్ల గురించి వాళ్లు అర్థం చేసుకునే శక్తి లేకపోవటం, వాళ్ల సందేహాలకు సమాధానం దొరికే ఛానల్ లేకపోవటం పిల్లల సమస్య. పసితనం నుంచి వాళ్ల లేత బుర్రల్లో అంతులేని సందేహాలుంటాయి. చుట్టూ సమాజంలో తాము ప్రవర్తించవలసిన తీరు గురించి వాళ్లకు చెప్పే వాళ్లు ఉండరు. ఆడే గేమ్స్, చేసే హింసాత్మక దృశ్యాలు వాళ్లలో కోపం వస్తే తీవ్రంగా ప్రవర్తించాలనే సందేశమే దొరుకుతుంది.

ఈ విషయంలో యూనివరిటీ ప్రొఫెసర్‌గా పని చేసే ఒక తల్లి స్పందిస్తూ, “మా అబ్బాయి ఎనిమిది సంవత్సరాల వాడు. ఎవరైనా నిద్రలేపాలి అంటే కాళ్లతో తన్ని లేపుతాడు. హాస్యం అంటే చేతిలో ఏ నీళ్లో తనకంటే చిన్న వాళ్లపైన పోస్తాడు. అచ్చం సినిమాలో పాత్రలాగే ఉంటుంది వాడి ప్రవర్తన” అన్నారు. నిజానికి ఎనిమిదేళ్ల వాడికి అందింది. రోజూ సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వచ్చి తల్లి వచ్చేదాకా చూసే టి.వి.లో వచ్చే సినిమా జ్ఞానమే కదా! ఇలాంటి పరిస్థితిని చూసుకుని ఉద్యోగాలు చేసే యువతుల్లో కలిగేది ఆత్మ విచారం మాత్రమే. ఏం కోరి కష్టపడుతూ ఉన్నాం. ఏం దొరుకుతుంది? అన్న బాధ మాత్రమే.

పని బాలెన్స్ చేసుకుంటేనే శాంతి: ఇంత జరుగుతుంది కదా ఆడ వాళ్లంతా ఉద్యోగాలు మానేసి ఇంటికి పరిమితం అవ్వమని ఎవ్వరూ సూచించరు. ఇంటికీ, ఉద్యోగానికీ, ఆఫీస్ పనీ, పిల్లలతో గడిపే సమయం బాలెన్స్ చేసుకోమంటున్నారు. ఆఫీస్‌లో పని గంటలు ఎక్కువే ఉంటాయి. పనిలోనే ఆనందం వెతుక్కునే జంటలు కుటుంబం గురించి ఒక్క నిమిషం ఆలోచించుకోమంటున్నారు నిపుణులు. ఇల్లు, ఉద్యోగ జీవితానికి మధ్య సమతుల్యత పాటించకపోతే ఏదో ఒక సమయంలో ఆ ఒత్తిడి భరించక తప్పని పరిస్థితి వస్తుంది.

ఆఫీస్‌లో ప్రదర్శించే టీమ్ వర్క్ ధోరణిని ఇంటి దగ్గర చూపిస్తే సగం సమస్యలు పోతాయి. ఇల్లు కూడా టీమ్ వర్క్‌తో సుఖంగా నడిచేదే. భార్యాభర్తలిద్దరూ తమ లక్షాలు, ఎదుటివాళ్ల నుంచి ఆశిస్తున్న సహకారం గురించి చక్కగా మాట్లాడుకోవాలి. ఇంటి పనులు కలిసి పంచుకునే మనస్తత్వం మగవాళ్లు అలవర్చుకోవాలి. ఇంటి శుభ్రత, వంటపని, పిల్లల బాధ్యత కలిసి పంచుకోవాలి. ఇంటికి రాగానే ఎదురుచూసే పనులు భార్యాభర్త లిద్దరివీ కావాలి.. అప్పుడిక సమయం కలిసి వస్తుంది. ఇద్దరూ కలిసి పనులు పూర్తి చేసుకుని, పిల్లలతో గడిపే సమయాన్ని కేటాయించుకోవాలి. వాళ్ల చదువు, భోజనం ప్రతి పూట తల్లిదండ్రులు పట్టించుకునే విషయంగా ఉండాలి. వారాంతపు సెలవుల్లో భార్యాభర్త పిల్లలు కలిసి గడపటం, ఆఫీస్ రోజుల్లో చేయలేని హోం వర్క్‌లు చేయించటం, వాళ్లకోసం ఉన్న సమయం వెచ్చించటం చేస్తే ముందు ఒత్తిడి తగ్గుతుంది.

రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఒక బాధ్యత రెండో బాధ్యతకు అడ్డంకి అవ్వకూడదు. రెండు బాధ్యతలు ఇష్టంగా స్వీకరించారు కాబట్టి ఇష్టంగానే పూర్తి చేయాలి. ఇద్దరూ కలిసి ఇంట్లో పనులన్నీ పంచుకుని, ఎవరికి దొరికిన సమయాన్ని వాళ్లు పిల్లల కోసం, ఇంటి పనుల కోసం కేటాయించుకుని, సహకరించుకుంటే ఎలాంటి చిక్కులు ఉండవు. ఆఫీస్ పని ఎంత ముఖ్యమో, ఇంటిపనీ అంతే ముఖ్యం. అది కేవలం మహిళలకే సంబంధించిన వ్యవహారం కాదు. ఈ తరంలో ఆమె సంపాదించేది వేన్నీళ్లకు చన్నీళ్లు కాదు. సమానమైన వేతనం, సమానమైన హోదా. ఆమె చేయి కలిస్తే కుటుంబం వృద్ధిలోకి వెళుతుంది. జీవన ప్రయాణం మెరుగవుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు, ఇద్దరూ కలిసి పిల్లల్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచుకోవచ్చు, చింతల్లేని జీవితం గడపొచ్చని చెబుతున్నారు నిపుణులు.

Employed Women are not Happy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఏది ముఖ్యం ఇల్లా-ఉద్యోగమా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.