పది రోజుల్లో అన్నారం వెట్ రన్…

Anaram Pump House

కన్నెపల్లిలో నాలుగు పంపుల ద్వారా నీటి విడుదల
ప్రారంభం కానున్న ఐదో పంపు
అన్నారం బ్యారేజీలోకి భారీగా నీరు
వెట్న్ కోసం వారం, పది రోజుల్లో పంపుహౌస్ సిద్ధం

హైదరాబాద్ : అన్నారం బ్యారేజీకి జలకళ వస్తున్న నేపధ్యంలో అన్నారం పంపుహౌజ్ ప్రారంభానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక వైపు కన్నెపల్లి పంపుహౌజ్‌లో అన్ని పంపులు నడపడానికి వీలుగా ఒక్కో పంపును సిద్ధం చేస్తూ, పరీక్షిస్తున్నారు. తాజాగా నాలుగు పంపులు నడుస్తున్నాయి. ఐదో పంపును శుక్రవారం అర్థరాత్రి వరకు నడపాలని యోచిస్తున్నారు.

అన్నారం బ్యారేజిలోకి నీటి ప్రవాహం కొనసాగుతున్నా, పంపుహౌజ్‌లో పంపుల వెట్న్‌క్రు మరో వారం, పది రోజులు పట్టే అవకాశం ఉందని సమాచారం. కసరత్తును అధికారులు మొదులుపెట్టినా, తొలుత నీళ్లు పంపులకు అందాల్సి ఉంటుంది. ప్రాణహిత నది ప్రవాహం క్రమంగా తగ్గుతుండడంతో పంపుల ప్రారంభంలో వేగం తగ్గినట్లు తెలిసింది. అయితే మేడిగడ్డ బ్యారేజీకి ఉన్న మొత్తం 85 గేట్లు మూసేయడంతో వచ్చే నీళ్లు మొత్తంగా బ్యారేజిలోనే ఆగిపోతాయి. ఈ నీరు బ్యారేజి అంతటా విస్తరించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మేడిగడ్డ బ్యారేజికి, కన్నెపల్లి పంపుహౌజ్‌కు మధ్య దాదాపుగా 22 కిలోమీటర్ల మేర దూరం ఉంటుంది.

గేట్లు మూసేయడంతో నీరు క్రమంగా విస్తరిస్తుంది. ఈ నీరు కన్నెపల్లి పంపుహౌజ్ వరకు చేరడానికి మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రాణహిత ప్రవాహం తగ్గడానికి తోడు, గోదావరి ఇన్నాళ్లుగా ఎర్రటి ఎండకు, తొలి నాళ్లలో వచ్చే జలాన్ని పూర్తిగా పీల్చేస్తుంది. ఫలితంగా నిల్వ ఉన్న నీళ్లు కూడా చాలా మటుకు భూమిలోకి ఇంకుతాయి. దీంతో దాదాపుగా ఈ వారం రోజుల్లో భూమి గరిష్టంగా పీల్చే అవకాశం ఉంది. తర్వాత క్రమంగా తగ్గుతుంది. మేడిగడ్డ గేట్లు గురువారం సాయంత్రం మూసేయడంతో, కొన్నాళ్లు ఇంకే నీటిని ఆపలేం. దీనికి తోడు 16 టిఎంసిల మేర నిల్వ సామర్థం మేడిగడ్డ బ్యారేజికి ఉంది. కానీ ఒకేసారి అంత నీటిని నిల్వ చేయరు. తొలుత ఒక్కో టిఎంసితో మొదలుపెట్టి క్రమంగా నిల్వ నీటిని పెంచుతారు. ఈ సీజన్లో గరిష్టంగా 5 నుంచి 6 టిఎంసిలు మాత్రమే నిల్వ చేసే అవకావం ఉంది.

అన్నారం బ్యారేజికి నీళ్లు వస్తున్నా, ఇప్పటి వరకు ఉన్న నీళ్లంతా గుంతలు నిండడానికే సరిపోయింది. దీనికి తోడు వచ్చిన నీళ్లలో భూమిలోకి కొంత ఇంకుతుంది. పేరుకుపోయిన ఇసుక దిబ్బలు, గుంతల మధ్య నుంచి భూమిలోకి ఇంకుతూ భూగర్భ జలాలు పెరుగుతాయి. కానీ ఎత్తిపోతల ద్వారా చేరిన నీరు, వర్షకాలం ప్రారంభమైనా, సరిపడా వానలు పడని కారణంగా భూమిలోకి ఇంకే నీళ్లే అధికంగా ఉంటాయి. మరో వారం దాకా నీళ్లు ఇంకుతాయని, ఆ తర్వాత క్రమంగా తగ్గిపోతుందని ఇంజనీర్లు చెబుతున్నారు.

అప్పుడే పంపుహౌజ్ అప్రోచ్ చానల్‌కు నీరు అందుతుంది. మేడిగడ్డ గేట్లు మూయడంతో నీటి నిల్వ పెరిగి, బ్యాక్‌వాటర్‌తో కన్నెపల్లి వద్ద నీటి లభ్యత పెరుగుతుంది. దీంతో పంపులు నిరంతరం పంపింగ్ చేయడం, పంపుల సంఖ్య క్రమంగా పెంచనున్నారు. 11 పంపులు ఏర్పాటు చేసినా, ఇప్పుడు 4 పంపులే పంపింగ్ చేస్తున్నారు. 5వ పంపు అర్థరాత్రి ప్రారంభించనున్నారు. పంపుల సంఖ్య పెంచితే మరో పది రోజుల్లో అన్నారం పంపుహౌజ్ అప్రోచ్ చానల్‌కు నీరు అందుతుంది. దీంతో అన్నారం పంపుహౌజ్‌లో సైతం పంపులు ప్రారంభిస్తారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్ 1, లింక్ 2కు సంబంధించిన అన్ని పనులు కీలకమైనవే. మేడిగడ్డ బ్యారేజి వెనుక జలాల ఆధారంగా కన్నెపల్లి పంపులతో ఎత్తిపోసిన నీరు అన్నారం బ్యారేజిలోకి చేరుతుంది. అన్నారం బ్యారేజి తిరుగు జలాల ఆధారంగా పంపుహౌజ్‌లో పంపుల ద్వారా ఎత్తిపోస్తే ఆ నీరు సుందిళ్ల బ్యారేజికి చేరుతుంది. ఇదేవిధంగా సుందిళ్ల బ్యారేజి వెనుకజలాలను పంపుహౌజ్ ద్వారా ఎత్తిపోసి, సిద్ధంగా ఉన్న ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు చేరుస్తారు. ఈ పనుల్లో వేగం వర్షం తాజా స్థితిగతులతో పాటు, ప్రాణహిత నుంచి వచ్చే వరదపైన ఆధారపడి ఉంటుంది.

Effort of Authorities for opening of Anaram Pump House

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పది రోజుల్లో అన్నారం వెట్ రన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.