ఉన్నది ఒకటే జీవితం

Education

తెల్లవారింది. ఉదయం ఏడు గంటల య్యేసరికి… దొరగారి పశువుల కొట్టంలోకి అడుగుపెట్టాడు పన్నెండేళ్ల ఎంకటేసు. అక్కడ చాలా గేదెలతో పాటు…ఓ రెండు ఆవులూ ఉన్నాయి. రోజు ఎంకటేసులే ఆ గొడ్లచావిడి శుభ్రం చెయ్యాలి. ముందుగా ఓ గమేళా తీసుకుని, వదిలేసిన పేడకళ్లు ఎత్తి.. కంపౌండ్‌లోనే ఓ మూలకు పొయ్యాలి. పశువులు తినగా వదిలేసిన ఎండుగడ్డి పోచలూ, చెత్తా చెదారం లాంటివి చీపురు పెట్టి ఊడ్చాలి. అదంతా చేసేసరికి ఓ గంట పడుతుంది. ఆ తరువాత యజమానురాలు పెట్టిన టిఫిన్ తిని… మూలగా పోసిన పేడకి, కొంత ఎండుగడ్డి దూగర వేసి కలిపి ముద్దలుగా చేసి ఆ కంపౌండు గోడకే పిడకలు కొట్టాలి. ముందురోజు పిడకలు ఏమైనా ఉంటే తీసేసి వంట వసారీలోకి చేర్చాలి.

బేరం వస్తే, పిడకలు అమ్మకం చెయ్యాలి. మధ్యాహ్నం భోజనం తరువాత… పొలంగట్ల మీద ఉండే పచ్చి గడ్డి కోసుకొచ్చి పశువులకు మేపాలి. ఇంకా ఇంట్లో చెప్పిన పనులన్నీ చేస్తూ, ఎప్పుడూ అందుబాటులో ఆ ఇంటి కనుసన్నల్లోనే ఉండాలి. ఒకప్పుడు ఈ పనులన్నీ సరదాగా ఆడుతూ పాడుతూనే చేసాడు ఎంకటేసు.  అమ్మగారు పెట్టే వేడి వేడి టిఫిన్లు అన్నా.. భోజనం అన్నా ఎంతో ఇష్టం. అందుకే ఎంత పనైనా ఇష్టంగా చేసేవాడు. అమ్మగారి మాట కరుకే గానీ మనసు వెన్న. ఎంత కావాలంటే అంత తినొచ్చు.

అయితే, ఈ మధ్యే…ఇలాంటి పనులేవీ మనసుకి నచ్చడం లేదు. కారణం…తోటి వాడైన దొరగారి కొడుకు పట్నంలో హాస్టల్లో చదువుకోవడానికి వెళ్లినప్పటి నుంచీ, ఆ మంచి బట్టలూ, ఆ దర్జా చూసి తనకీ చదువుకోవాలన్న కోరిక మొదలైంది. పైగా తమలాంటి నిమ్నవర్గాలకి ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుందనీ అప్పుడే తెలిసింది. తను మూడవ తరగతి చదివే రోజుల్లో ఎందుకో స్కూల్లో అల్లరి చేసినందుకు మాస్టారు కొట్టాడని ‘నన్ను మాస్టారు కొడతాడా! అందర్నీ వదిలి తననే కొట్టాలా!’ అని ఆకతాయితనంతో బడికి వెళ్లడం మానేసాడు.

తోటి పిల్లలు అడిగితే, అదే చెప్పాడు “మాస్టారు మిమ్మల్ని అందర్నీ వదిలి..నన్నే ఎందుకు కొట్టాలి. అందుకే ఇక రాను”అంటూ చెప్పాడు దర్పంగా. తండ్రి నచ్చ చెప్పినా వినలేదు. తనలాగే ఖాళీగా ఉన్న పిల్లలతో ఆడుకోవడానికి సమయం చిక్కిందని సంతోష పడుతున్న తరుణంలోనే… తల్లి దొరగారింటిలో పనికి కుదిర్చింది. చదువు లేనందుకు… పనీ చేతకాకపోతే ఎలా? అని. కోరిక మొదలవ్వడమే ఆలస్యం అమ్మని అడిగాడు “ అమ్మ! ఇప్పుడు నాకూ సదువుకోవాలని అనిపిస్తుందే” అని. దానికి తల్లి “ఇప్పుడేం? సదువురా! కొడకా. నీ తోటి వాళ్లందరూ నీకన్నా నాలుగేళ్లు ఇప్పటికే ముందుకు పోయిన్రు గందా!. నువ్వు మల్లా ఇస్కుల్ల ఏమని జేరతావ్. నిన్నేవ్వలు జేర్చుకుంటరు.” అంది అనాసక్తంగా. కొడుకు దొరగారింటిలో పనికి కుదిరి, ఇంటికి ఆసరా అవుతున్నాడనుకుంటే మళ్లీ ఈ లొల్లి ఏమిటికి అనుకుంటూ. అదీ నిజమే. చిన్నోల్ల మధ్యలో తానెట్ల కూర్చోగలడు అనుకున్నా.

అయినా సరే! తియ్… అని తండ్రి దగ్గరా చెప్పాడు తన కోరికని. తండ్రి కూడా సప్పుడు చెయలా. దొరగారింటికి కార్లలో జనాలు వచ్చినప్పుడల్లా వాళ్ల వంక ఆశగా చూస్తాడు. వాళ్ల చదువూ, వైభవం. తను ఎప్పటికీ అందుకోలేని అందలాలు. వాళ్లు జీవితంలో ముందుకు పోవడం ఏమిటీ? తను ఉన్న చోటునే పేడ పిసుక్కుంటూ, పిడకలు కొట్టుకుంటూ ఉండిపోవడం ఏమిటీ? ఎన్నిసార్లు తరచి చూసుకున్నా సమాధానం లేని ప్రశ్నలే.

మాస్టారు కొట్టాడన్న నెపంతో.. బడి మానేసి, జీవితం అంతా వెట్టిచాకిరీ అనే ఊబిలో ఇరుక్కుపోయాడు. తోటి పిల్లల్ని మాత్రం మాస్టారు కొట్టలేదా! వాళ్లూ తనలా మానేసారా? చదువుకుని పైకి వెళ్లలేదా! ఒక్కడే కొడుకన్న అతి గారాబం. పరిస్థితిని అర్థం చేసుకుని…ఇంట్లో గట్టిగా మందలించే వాళ్లు లేకపోవడంతో తనది…ఆడింది ఆట… పాడింది పాట అయ్యింది. అయితే, ఆ మురిపెంగా కాస్తా మూడురోజులే. ఆ తరువాత దొరగారింటిలో నాన్నలాగే నమ్మకస్తుడైన మరో జీతగాడు అయ్యాడు. దొరగారి కొడుకుని చూసినప్పుడల్లా తన తప్పు తనకి తెలిసి వచ్చేది. సరిదిద్దుకోలేని పొరపాటు, జీవిత గ్రహపాటు అయ్యింది. ఎవరి ప్రమేయం లేకుండా కాలం గడిచిపోయింది. యుక్త వయసుకి రావడంతో.. ఓ ఇంటి వాడయ్యాడు ఎంకటేసు.

దొరగారి కొడుకు పట్నంలో మంచి ఉదోగంలో ఉన్నాడు. దొరగారూ ఉన్న భూములు అమ్ముకుని కొడుకు దగ్గరే ఉంటున్నారు. దొరగారింటిలో నేర్చుకున్న మెళకువలతో తండ్రి సంపాదించిన అర ఎకరానికి తోడు…రెండెకరాలు కౌలుకు తీసుకుని ఆర్థికంగా నిలదొక్కుకుని వ్యవసాయదారుడుగా మారాడు. తన పిల్లల్ని చదివించుకోవడమే కాకుండా..తనలా చదువును అశ్రద్ధ చేసిన వాళ్లకి హితవు పలికి..ప్రభుత్వం కల్పించే సౌకర్యాల గురించి వివరించి చెప్పి, మళ్లీ బడికి వెళ్లేలా ప్రోత్సహించాడు. తన హితబోధకు ఆలంబనగా..లేని వాళ్ల పిల్లలకి తన వంతు సహాయంగా రాత పుస్తకాలూ, పెన్సిళ్లు కొనిచ్చే ప్రయత్నం చేశాడు.
మొదట్లో చిన్నప్పుడు తను చదువు మానేసిన స్కూల్‌కి పరిమితమైన అతని దాతృత్వం..తరువాత చుట్టుపక్కల ఉన్న కొన్ని స్కూళ్లకి కూడా విస్తరించింది. ఆ పని తను చదువుకోకపోయినా చదువుకున్నంత సంతృప్తినిచ్చేది. అందుకే ఆ అలవాటుని అలాగే కొనసాగించాడు జీవితాంతం. తన సంపాదనలో కొంతమొత్తం పేద పిల్లల చదువు కొనసాగింపునకు వెచ్చించి.. పిల్లల మనసులో పుస్తకాల తాత వెంకటేశ్వర్లుగా చెరగని ముద్రవేసుకున్నాడు.

Education moral stories in telugu

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఉన్నది ఒకటే జీవితం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.