తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు

Earthquakes

 

రిక్టర్ స్కేల్‌పై 4.6గా నమోదు, సూర్యాపేట జిల్లా దొండపాడులో, గుంటూరు జిల్లా అచ్చంపేటలో కొట్టవచ్చినట్టు కదిలిన భూమి
సీస్మిక్ జోన్-2 గా గుర్తింపు, 10కి.మీ లోతులో భూ పొరల కదలిక, కొద్ది రోజుల వరకు ఉండవచ్చని అంచనా
ఏడేళ్ల క్రితం జనవరి 26న ఇలాగే జరిగింది

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అర్థరాత్రి భూప్రకంపనలు సంభవించాయి. కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఖమ్మం నగరంలో అర్థరాత్రి 2:40 గంటలకు స్వల్పంగా భూమి కంపించగా, చింతకాని మండలంలోని పలు గ్రామాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్టు స్థానికులు పేర్కొన్నారు. నాగులవంచ, బస్వాపురం, పాతర్లపాడులో 3 సెకన్ల పాటు భూమి కంపించగా, కరీంనగర్‌లో అర్థరాత్రి 2:40 గంటలకు స్వల్పంగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

హుజుర్‌నగర్, కోదాడ నియోజకవర్గాలతో పాటు మేళ్ల చెరువుతో పాటు పలు మండలాల్లో 12 సెకన్ల పాటు భూమి కంపించింది. నడిగూడెం మండలం తెల్లబల్లిలో తెల్లవారుజామున 2 సెకన్ల పాటు భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. కూసుమంచి, మధిర, నేలకొండపల్లి, చింతకాని మండలాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కేశ్వాపురం, అగ్రహారం, నేలపట్ల, జీళ్లచెరువు, నాగులవంచ, తిమ్మినేనిపాలెం, బస్వాపురం, దేశినేనిపాలెం, ఖమ్మంపాడు, ఇల్లెందులపాడు, మధిర లడక్‌బజార్‌లో ఆరు సెకన్లపాటు భూమి కంపించగా రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదయినట్టు అధికారులు తెలిపారు.

ఏడేళ్ల క్రితం జనవరి 26న…
కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. జగ్గయ్య పేటలో అర్థరాత్రి 2:50 గంటలకు 5 నుంచి 8 సెకన్ల పాటు, నందిగామలో అర్థరాత్రి 2:40 గంటలకు 10 సెకన్ల పాటు కంపించింది. గుంటూరు జిల్లాలోని అచ్చంపేట, బెల్లంకొండ పరిసరాల్లో అర్థరాత్రి 2:40 గంటలకు 4 నుంచి 5 సెకన్ల పాటు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు వచ్చారు. ఏడేళ్ల క్రితం జనవరి 26వ తేదీన ఖమ్మం జిల్లాలోని పాతర్లపాడు, నాగులవంచ తదితర గ్రామాల్లో భూ ప్రకంపనలు సంభవించగా, తిరిగి ఈ సంవత్సరం జనవరి 26న మళ్లీ ఈ సంఘటన చోటుచేసుకుందని స్థానికులు పేర్కొన్నారు.

రెండున్నర వారాలుగా భూమిలోపల భూకంపాలు: చీఫ్ సైంటిస్ట్ నగేష్
రెండున్నర వారాలుగా భూమిలోపల భూకంపాలు సంభవిస్తున్నాయని, పగుళ్ల కారణంగానే భూమి కంపిస్తుందని గుర్తించినట్లు చీఫ్ సైంటిస్ట్ నగేష్ పేర్కొన్నారు. ఇప్పుడు సంభవించిన భూకంపాన్ని స్పెసిఫిక్ జోన్- 2గా గుర్తించామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రాంతంలోని భద్రాచలంలో 1969లో రిక్టర్ స్కేల్‌పై 5.3గా నమోదయ్యిందని, దాని తర్వాత మళ్లీ భూకంపం రావడం ఇదేనన్నారు. అయితే కట్టడాలు బలంగా ఉండడంతో ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

రాత్రి నుంచి 11 సార్లు చిన్నపాటి భూ ప్రకంపనలు వచ్చాయని, భూకంప లేఖినిపై 4.6 తీవ్రతగా నమోదయ్యిందన్నారు. కొన్ని రోజులుగా పులిచింతల ప్రాంతంలో భూమిలో కదలికలు ఏర్పడ్డాయని, మరి కొద్దిరోజుల వరకు భూమిలో ఇలాంటి కదలికలు వస్తాయని ఆయన వెల్లడించారు. సూర్యాపేట జిల్లా దొండపాడు, గుంటూరు జిల్లా అచ్చంపేటలో పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. భూమిలో 10 కిలోమీటర్ల లోతులో భూమి పొరలో కదలికలు జరిగినట్టుగా ఎన్జీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు.

Earthquakes in telugu states

The post తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.