సమకాలీనతను ఎత్తిచూపే ‘మూల మలుపు’

 Earth Would Look Like Without Oceans

కవిత్వమొక ప్రపంచం మునిగిన కొద్దీ మణిదీపాల వెలుగులో
నివ్వెరపోయే సముద్రంలాంటి ప్రపంచం”
అంటూ స్వీయ పరిశీలన, స్వీయానుభవాలు, అనుభూతుల ద్వారా తనకు తాను వినూత్నంగా పుటంపెట్టుకొని, నిరంతరం ఎరుకతో దార్శనిక దృష్టి దృక్పథంతో వర్తమానంలో కవిత్వమై ప్రవహిస్తున్న కవి ఏనుగు నరసింహారెడ్డి. తనదైన శబ్దప్రపంచాన్ని తాను నిర్మించుకొంటూ, తనదైన ఆత్మశైలితో, విస్తృతమైన అర్థవలయాలను ప్రసరింపజేసే పదబంధాలతో, ఎంచుకున్న సమస్యల నుండి తప్పిపోకుండా, లోచూపుతో విభిన్న కోణాల్లో వస్తువును దర్శిస్తూ కవిత్వం రాస్తున్న కవి ఆయన. వృద్ధాప్యం వచ్చాక మనిషి విలువ ఎలావుంటుందో చెప్తూ ఆ విలువ తగ్గకుండా ఉండాలంటే ఏమి చేయాలో “గూట్లో దీపం” కవితలో ఉద్బోధించాడు.
“పొద్దుగూకక ముందే
గూట్లో దీపం పెట్టడం మంచిది
హుషారుగా ఉన్నపుడే
పిట్ట ఎగిరిపోవడం ఉత్తమం”
అనే సూచనలిస్తారు. ఎందుచేతనంటే కన్నబిడ్డలు తల్లిదండ్రుల్ని అర్థం చేసుకొనే కాలం కాకుండా వచ్చింది. ముసలోళ్లు ఒకసారి
“సమస్త యవ్వనాన్ని
సాగరం ఈదడానికి ధారపోసిన
వ్యథలెవరూ వినరు”
సంసార సాగరాన్ని ఈదడానికి చేసిన అకుంఠిత కృషిని పట్టించుకోరు యువతరం.
“తీరం దాపున నావలాంటి
యవ్వనం జారిపోతూ
కాలు వణుకుతుందీ
కన్ను అదురుతుంది
దేహంలోని సమస్త శక్తులు తిరగబడతాయి”
ఇక ప్రతి మాట చేదు గుళికే అవుతుంది. మంచి చెప్పినా బహుచెప్పొచ్చేవ్‌లే అంటూ హేళన చేసే పరిస్థితి. అందుకే “ఎవరూ ఈ లోకానికి ఎక్కువ కాలం అవసరం లేదు కనుక వీలైనంత త్వరగా లోకం నుండి జారుకోవడానికి వెరవకూడదనే భావాన్ని వ్యక్తీకరిస్తాడు కవి.
సామాజిక బాధ్యతగల కవిత్వాన్ని రాసే సిధారెడ్డిని గూర్చి “పాలపిట్ట” అనే కవితలో ఆయన వ్యక్తిత్వాన్ని, నిష్టను, నిబద్ధతను గూర్చి అద్భుతంగా ఆవిష్కరిస్తాడు నరసింహారెడ్డి.
“కవిత్వం చెప్పినా
కథలోతులు విప్పినా
వేదిక లెక్కినా
వాదం చేసినా
మార్క్సిజం గీటురాయి
తెలంగాణ ఆచరణ సోయి” అంటూ సిధారెడ్డి లక్ష్యాన్ని, మార్గాన్ని సూచిస్తాడు కవి. ఒక కమిటెడ్ కవిగా సిధారెడ్డి కవిత్వయానాన్ని వ్యక్తీకరిస్తూ, మాటకు మనుగడకూ తేడా లేని వాడు, కవిత్వానికి జీవితానికి అడ్డుపొరలు లేనివాడు అంటాడు.
అసలైన కవితత్వం ఏమి చేస్తుంది ? కవిత్వం అసలెందుకు ? అనే ప్రశ్నలకు “పక్షపాతి” కవితలో నరసింహారెడ్డి కొన్ని గుర్తించుకోవాల్సిన సూచనలిచ్చాడు. కవిత్వం ఏ ప్రక్రియలో వుండాలి అనేదానికి
“నవత్వ ఆలోచన
జడత్వ విమోచన
కవిత్వం
టు ది పవర్ ఆఫ్ కవిత్వం” అంటారు. కవిత్వం ఇంకా
“చెట్లకు గుట్టలకు
మనిషిని పట్టిస్తుంది
పచ్చని బయళ్ళ మీద పడకేసి
సృష్టి రహస్యాల్ని శోధిస్తూ
లోక సంద్రంలో
మునకేసి తడసి
తడుచుకోరాని నెమలి పిట్టలా
నిలబడుతుంది
లోకాన్ని
తన అద్దంలో చూపించి
కమ్మల మీద
బొమ్మలు చేసి
కాలానికి ఆరబెడుతుంది” అంటారు. కవిత్వాన్ని గూర్చి ఒక నిర్ధారణ నిచ్చేమాట చెప్తూ
“కవిత్వం ఎప్పుడూ
కవి పక్షమే
కవే
ప్రజల పక్షం” అంటారు. నిజమైన మనిషి బయటకు రావాలంటే అంతరంగం ఆవిష్కరింపబడాలి.
“అంతరంగంలో జరిగే వేదనను
పొల్లుబోకుండా అక్షరీకరించే
కలం ఒకటి వుంటే ఎంతో బావుండేది” అంటూ కవిలోని మనిషిని బయటకు లాగితే మనిషితత్వం బయటపడుతుంది. అయితే ఈనాడు
“కాసింత కఠిన్యాన్నే
కళాత్మకంగా విపులీకరించే” కవులున్నారు.
“అనుకరణ ఉద్యమాలనే
అక్కున చేర్చుకునే
సృజనకారులున్న సందర్భంలో
అలవికాని ఆవేదనలు అందకుండానే
అదృశ్యమైపోవడం
అతిపెద్ద పరిమితత్వమై అపహస్యం చేస్తుంది” అంటూ కవి చిన్న విషయాలకు అతి పెద్దగా గోరంతలు కొండంతలు చేసి చేప్పే కవిత్వాన్ని, కవుల్ని నిరసిస్తాడు. శిలాసదృశ్య చిక్కుముళ్ళను గోరంతైన చిత్రిక పట్టలేని కలాలకు కొత్త దృష్టీ, దృక్పథం ఉంటే ఎంత బాగుంటుందో అని భావిస్తాడు కవి. కవిత్వం నిజంగా దేని మీద కవి కేంద్రీకరించాలో దాని మీద కేంద్రీకరించడంలేదనే భావన యిక్కడ కనిపిస్తుంది.
తండ్రి జ్ఞానాన్ని పంచుతాడు బిడ్డకు. ప్రపం చంలో బిడ్డ బతికే బతుకు తెరువు చూపిస్తాడు తండి. ‘నాన్న’ అనే కవితలో ఈ కవి ‘నాన్న’ను ఏ విధంగా సంభావించాడో చూద్దాం. ఆత్మచుట్టూ అల్లుకపోయే ప్రాకృతిక ప్రేమకవచంగా, సందిగ్ధ సందర్భాల్లో సరళీకరించిన గీతావాక్యంగా, అమ్మకు శక్తినిచ్చే ప్రదాతగా, పెనుమర్రిలా విస్తరించే ప్రేమ నీడను యిచ్చేవానిగా, సమస్త విశ్వమూ శతృ శిబిరమైతలపడ్డప్పుడూ నాన్న ఒక్కడే ముందుకు నడిపించే వానిగా, దీపం నుండి దీపం ప్రభవించినట్లుగా పిల్లలకూ నాన్న తనపు ఔన్నత్యాన్ని అందించేవానిగా కనిపిస్తాడు ఈ కవికి. అమ్మ ప్రేమ కాదు నాన్న ఆదరణ కూడా చాల గొప్పది’ అంటాడు కవి.
“రోజు” అనే కవితలో నరసింహారెడ్డి ఈ సోకాల్డ్ నవ నాగరికతలకు అద్భుతమైన రెండు మాటలు చెప్పాడు. “పుస్తకాలు లేని ఇల్లు ఎడారి” అని ఒక మాట. రెండో మాట “ చదవని రోజు ఏ మాత్రం ఎదగని రోజు” అధ్యయనం ఎంతముఖ్యమో చెప్తూ “ఏదీ రాయని రోజు, ఎంతో కోల్పోయిన రోజు” అంటూ నిత్యం అధ్యయనంతో పాటు భావవ్యక్తీకరణ కూడా అలవాటు చేసుకోవాలన్న భావం యిందులో దాగుంది.
“గాయపడ్డాకే” అనే కవితలో నేటి సామాజిక దుస్థితిని ఏకరువు పెడతాడు కవి. గాయపడకుండా ఉండలేని పరిస్థితిని ఎత్తిచూపుతాడు. పక్కవాడ్ని గాయపరచడం, మాటతో కాని, చేతలతో గాని ఇతరులకు వినోదమే కూర్చుతుంది. మనిషి ఇంట్ల నుండి బయటకొచ్చి తిరిగి ఇంట్లోకొచ్చే దాక గాయపడడనే నమ్మకం నశించింది. ఇది వర్తమాన సామాజిక నైతికత. దీన్ని భావయుక్తంగా, మర్యాదపూర్వకంగా, లాలిత్యంగా ఎత్తిచూపిన నరసింహారెడ్డి హృదయం ఎంతో సుకుమారమైనదిగా వినయ సాంద్రతలతో నిండిందిగా భావించవచ్చు. వైవిధ్యభరితమైన వస్తుస్వీకరణ, స్పష్టమైన భావ ప్రకటన ఈ కవిత్వంలో గమనించవచ్చును.
“మూల మలుపు” కవిత నరసింహారెడ్డి ఊహాశాలిత్వానికి మచ్చుతునుక, తన అనుభవసాంద్రతకు అద్దంపడుతుంది.
“ఎవరికి వారై పరుగెత్తే
వింతవేగంలో
లోకం చింతచేసినోల్ల
కాయమసలు
కంది పోకుండా ఉంటుందా” సమాజాన్ని గూర్చి పట్టించుకున్నవాడు, రుగ్మతల్లో తలదూర్చినవాడు చితికిపోతూనే ఉన్నాడు. ఎంతో కష్టించి దారి చేసుకుంటూ వచ్చినా “మూల మలుపులో/తొవ్వకనపడదు” అంటూ మలుపు దాటి దారి వెతకాలి” తొవ్వ ఎట్లున్నా/ప్రయాణం సాగించాలి అనే దీక్షను దక్షతతో పాటించాలి అంటారు నరసింహారెడ్డి. కవిత్వంలో అనుభవజ్ఞుడైన నరసింహారెడ్డి కవి నడవాల్సిన దారిలో “ఏనుగు” లా ధీమాగా నడుస్తూనే ఉన్నాడు. సామాజిక విధ్వంసక మూలల్లోని ప్రతి కోణాన్ని ఆకలింపు చేసుకొని అక్షరమై ప్రవహిస్తున్నాడు. “మూల మలుపు”లో మొత్తం 62 కవితలున్నాయి. అన్ని కవితలూ స్వీయ అనుభవం నుండి, అవగాహన నుండి, అక్షర రూపుదాల్చినవే.
సరళమైన భాషతో, భావగర్భితంగా, చక్కని అభివ్యక్తితో రాసిన చక్కని కవితలెన్నో “మూల మలుపు”లో మొనదేలి కనిపిస్తున్నాయి. ఏనుగు నరసింహారెడ్డి మట్టి పరిమళ మెరిగిన కవి. మమకారపు పంటపొలములో ఆత్మీయతను పండించి వండి వడ్డించే హృదయమున్న కవిగా నరసింహా రెడ్డిని భావిస్తూ అభినందిస్తున్నాను.

Comments

comments