ముగిసిన నరసింహన్ ‘దశకం’

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నరసింహన్ కంటె ముందు గవర్నర్ ఎవరు అంటే కొంత తడుముకొని జవాబు ఇయ్యవలసిందే. గవర్నర్ అంటే నరసింహన్ అన్నట్లుగా సుదీర్థ కాలం గడిచిపోవడంతో ఇలా అనిపిస్తోంది. రాజకీయ కురు వృద్ధుడు, కాంగ్రెస్ హయాంలో ఎన్నో పదవులు చేపట్టిన నారాయణ దత్ తివారీ నరసింహన్‌కు ముందు ఎపి గవర్నర్‌గా ఉన్నారు. అయితే ఆయన అమ్మాయిలతో సరససల్లాపాలు జరిపినట్లు స్టింగ్ ఆపరేషన్ ఫోటోలు బయటపడడంతో పరువు కాపాడుకునేందుకు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పదవి నుండి దిగిపొమ్మంది. […] The post ముగిసిన నరసింహన్ ‘దశకం’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నరసింహన్ కంటె ముందు గవర్నర్ ఎవరు అంటే కొంత తడుముకొని జవాబు ఇయ్యవలసిందే. గవర్నర్ అంటే నరసింహన్ అన్నట్లుగా సుదీర్థ కాలం గడిచిపోవడంతో ఇలా అనిపిస్తోంది. రాజకీయ కురు వృద్ధుడు, కాంగ్రెస్ హయాంలో ఎన్నో పదవులు చేపట్టిన నారాయణ దత్ తివారీ నరసింహన్‌కు ముందు ఎపి గవర్నర్‌గా ఉన్నారు. అయితే ఆయన అమ్మాయిలతో సరససల్లాపాలు జరిపినట్లు స్టింగ్ ఆపరేషన్ ఫోటోలు బయటపడడంతో పరువు కాపాడుకునేందుకు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పదవి నుండి దిగిపొమ్మంది. 27 డిసెంబర్ 2009న దత్ రాజీనామా సమర్పించారు.

అప్పటికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జోరుమీదుంది. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో అతలాకుతలమైన రాష్ట్రానికి కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆర్థిక మంత్రిగా ఉద్దండుడైన రోశయ్యకు సిఎం సీటు ముళ్ల కిరీటం లాగే అయ్యింది. శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన పాత్ర సంతృప్తికరంగా కేంద్రానికి అనిపించలేదు. రెండింటికి వైద్యంగా ఆనాటి హోం మంత్రి పి. చిదంబరం ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా నరసింహన్‌ను పంపారు. ఇరువురూ తమిళ బ్రాహ్మణులైనందున, నరసింహన్ కేంద్రం ఆధీనంలో ఉండే ఇంటెలిజెన్స్ బ్యూరోలో చాలా కాలం పని చేయడం వల్ల చిదంబరంకు నరసింహన్ దగ్గరి మనిషి అయ్యారు.

నరసింహన్ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా డిసెంబర్ 2006న రిటైర్డ్ కాగానే జనవరి 2007లో అనగా సరిగ్గా నెల రోజుల వ్యవధిలోనే ఆయన చత్తీస్‌గఢ్‌కు గవర్నర్‌గా నియమించబడ్డాడు. చత్తీస్‌గఢ్‌లోని నక్సలైట్ ఉద్యమాన్ని కట్టడి చేసేందుకు పోలీసు గవర్నర్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా చిదంబరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం, సుదీర్ఘ కాలం రమణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉండడం, ప్రభుత్వ నిర్వహణలోనే నక్సలైట్లను ఎదుర్కొనేందుకు గిరిజనులతో సల్వాజుడుం పని చేయడం లాంటి పలు కారణాల వల్ల నరసింహన్ చత్తీస్‌గఢ్‌తో తనదైన ముద్ర వేసే అవసరం రాలేదు.

తివారీ దిగిపోవడంతో నరసింహన్‌కు హుటాహుటిగా 27 డిసెంబర్ 2009న ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. చత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ అణచివేత కన్నా తెలంగాణ ఉద్యమ ఉధృతిని అణగదొక్కడమే ముఖ్యమనిపించిన కేంద్ర ప్రభుత్వం నరసింహన్‌ను 23 జనవరి 2010 నాడు పూర్తి స్థాయి గవర్నర్‌గా మార్చివేసింది. 9 డిసెంబర్ 2009న చిదంబరం తెలంగాణపై ప్రకటన చేసి తిరిగి అదే నెల 23న ప్రస్తుతానికి అలాంటిదేదీ లేదని యుటర్న్ తీసుకోవడం జరిగింది. దీంతో తెలంగాణ భగ్గుమంది. ఆంధ్ర ప్రాంతం నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్రం వెనుకడుగువేసింది. తెలంగాణ యువత, విద్యార్థులు తీవ్ర నిరాశతో ఆవేశకావేశాలకు లోనవుతున్నారు.

గవర్నర్ నరసింహన్ నివేదిక మేరకు పారా మిలిటరీ దళాలు దిగాయి. యూనివర్శిటీ ఆవరణలు దిగ్బంధాలకు గురయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమున్నా కేంద్రం మాత్రం గవర్నర్ మాటలకే విలువెక్కువ ఇచ్చింది. ఆయనెపపుడూ తెలంగాణ ఉద్యమంపై రిపోర్టులతో ఢిల్లీకి చక్కర్లు కొట్టేవారు. ప్రభుత్వంలోని ఆంధ్ర నాయకులు తప్ప తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం ఆయన పాత్ర పట్ల వ్యతిరేకతను ప్రకటించారు. ఆయన రిపోర్టులు తెలంగాణ ఏర్పాటుకు విరుద్ధంగా ఉంటాయని ఆరోపించే వారు. తెలంగాణ విడిపడితే మావోయిస్టులు రెచ్చిపోతారని ఆయన కేంద్రానికి రాశారని నమ్మిన వారు ఉన్నారు. సెప్టెంబర్, అక్టోబర్ 2011లో జరిగిన సకల జనుల సమ్మె కాలంలో నక్సలైట్ల కార్యకలాపాలు పెరిగాయని ఆయన కేంద్రానికి నివేదించినారంటారు.

తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత కనబరచినప్పటి నుండి నరసింహన్ పాత్ర పెరిగిపోయింది. 2013లో ఏర్పరచిన మంత్రుల సమూహం గవర్నర్ అభిప్రాయానికి విలువ నిచ్చేది. ఆయన యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీని కలిసి రాష్ట్ర విభజన వల్ల అనుకూల, ప్రతికూల పరిస్థితులను వివరించారంటే ఆయన పాత్రను పరిధిని ఊహించవచ్చు. 2013 నాటికి గవర్నర్‌గా ఆయన పదవీ కాలం అయిదేళ్లు ముగిసినా ప్రభుత్వం ఆయనను కొనసాగించింది. గవర్నర్ దుస్తుల్లో ఉన్నా కఠిన పోలీసు ఆఫీసర్‌గా ఆయనను భావించిన తెలంగాణ ప్రజలు, నాయకులు ఆయన పదవీ కాలాన్ని పెంచడం పట్ల విస్మయం ప్రకటించారు.

జూన్ 2014లో తెలంగాణ ఏర్పాటు, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాకతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా కొనసాగుతూ ఆయన ఎపి పునర్విభజన చట్టం అమలుకు మధ్యవర్తిగా వ్యవహరించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రెండు రాష్ట్రాలతో భిన్నంగా వ్యవహరించడంతో పాటు చంద్రబాబుకు అది దూరమవుతున్న కొద్దీ గవర్నర్‌లో కూడా ఆ పోకడలు కనిపించాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆరోపణ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో నరసింహన్ సఖ్యత కొనసాగింది. చంద్రబాబుతో మాదిరిగా కాకుండా వీరిరువురి మధ్య సుహృద్భావ వాతావరణం కొనసాగింది. ఇంకా చెప్పాలంటే కెసిఆర్ గవర్నర్‌ను చాలా గౌరవంగా చూసుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనే కాకుండా పండుగల్లో, జన్మదిన సందర్భాల్లో కూడా ఆయనపట్ల తనకున్న గౌరవాభిమానాలను కెసిఆర్ ప్రకటించేవారు. పలు కీలక నిర్ణయాల సందర్భంగా కెసిఆర్ స్వయంగా గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ నివాసానికి వెళ్లి చర్చించేవారు.

రెండోసారి కేంద్రంలో తిరిగి బిజెపి ప్రభుత్వం ఏర్పాటుతో కేంద్రం, రాష్ట్రం గవర్నర్‌ల మధ్య సమీకరణాల్లో కొంత మార్పు మొదలైంది. జూన్ నుండే నరసింహన్ గవర్నర్ పదవి నుంచి తొలగి పోతారనే ముచ్చట మొదలైంది. సుస్మా స్వరాజ్ ఆంధ్రప్రదేశ్‌కు, కిరణ్ బేడీ తెలంగాణకు గవర్నర్లుగా వస్తారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. కేంద్రంతో సఖ్యత కోసమేగావచ్చు నరసింహన్ తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం బిల్లును తిప్పి పంపారు. 24 జులైన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీలో ఆమోదించిన మున్సిపల్ బిల్లును పలు అంశాలపై అభ్యంతరం తెలుపుతూ గవర్నర్ వెనక్కి పంపారు. అయినా గవర్నర్ మార్పు వార్త తెలియగానే కెసిఆర్ పలకరింపుగా నరసింహన్‌తో మూడు గంటల పాటు రాజ్‌భవన్‌లో గడిపారు. ఈ సందర్భంగా కెసిఆర్ ఆయనకు గౌరవ సలహాదారు పదవిని ప్రతిపాదించినట్లు, దానికి నరసింహన్ సున్నితంగా తిరస్కరించినట్లు వార్తల్లో వచ్చింది.

నరసింహన్ సేవలను కేంద్రం వినియోగించుకునే అవకాశం మెండుగా ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. నిండుగా దైవభక్తి, చాణక్య తెలివి, పోలీసు అనుభవం ఉన్న నరసింహన్ లాంటి వాళ్ల అవసరం కేంద్రానికి ఎంతో ఉందిప్పుడు. దేశంలో పదకొండున్నర ఏళ్ల పాటు గవర్నర్‌గా కొనసాగిన తొలి వ్యక్తిగా రికార్డు సాధించిన నరసింహన్ తమ తొలి గవర్నర్‌గా తెలంగాణ ప్రజలు గుర్తుంచుకుంటారు. తెలంగాణ సాధనా క్రమంలో తీపి, చేదు అనుభవాలు గవర్నర్‌గా నరసింహన్‌కు ఉన్నట్లే సేమ్ ఫీలింగ్స్ ఇక్కడి ప్రజలకూ ఉన్నాయి.

E S L Narasimhan biography as Governor

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ముగిసిన నరసింహన్ ‘దశకం’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.