మురిపిస్తున్నవర్షం…

 kharif season

 

ఖరీఫ్‌లో చుక్క చినుకు పడదాయే
మొలిచిన పత్తి ఎండిపాయే
దీన స్థితిలో రైతన్నలు
వెంటాడుతున్న కరువు పరిస్థితులు

ఖమ్మం : ఖరీఫ్‌కాలం నడి నెత్తిమీదకు వచ్చిన ప్రకృతి సహకరించకపోవడంతో పాటు తుఫాన్ తోడ్పాటు ఇవ్వకపోవడంతో జూన్, జూలైలో వచ్చిన కొద్దిపాటి వర్షాలకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అడపాదడపాగా పత్తి, మొక్కజొన్న, పెసర తదితర పంటలను రైతన్నలు సాగు చేపట్టారు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో అడపాదడపా వచ్చే వర్షాలకు ఆయా పంటలు మొలిచినప్పటికి తర్వాత చుక్క చినుకు రాలకపోవడంతో మొలిచిన మొక్కలు ఉబ్బకు తట్టుకోలేక చనిపోతున్నాయని రైతన్నలు లబోదిబోమంటున్నారు. ఖరీఫ్ ప్రారంభమై ఇరవై రోజులు దాటుతున్న సరైన మోతాదులో వర్షం రాకపోవడంతో రైతులు ఆకాశం వైపు ఎంతో ఆశతో చూసిన చినుక రాలకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.

ఆకాశం వైపు రోజు వర్షం కోసం ఎంతో ఆశతో చూస్తున్న వాతావరణం చల్లబడటంతో పాటు చల్లటి గాలి మబ్బులతో కూడిన వాతావరణం ఏర్పడగానే ఏరోజుకు ఆరోజు వర్షం వస్తుందిలే అనే ఆశతో చూసినా అరోజు నిరాశే ఎదురవుతుంది. గత దశాబ్ద కాలంగా వాతావరణాన్ని పరిశీలిస్తే కరువు పరిస్థితులు వెంటాడుతున్నాయి. ప్రకృతి పరంగా ఖరీఫ్, రబీలో పలు సమయాల్లో వర్షాలు రావాల్సి ఉన్నప్పటికీ రాకపోవటంతో కేవలం తుఫానుల సందర్భంలో మాత్రమే వర్షం కురుస్తుందని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. తుఫాన్‌తోనే వర్షాలు వస్తే తప్ప వాతావరణం అనుకూలించి పంటలు పండుతాయనే ఆశ రైతుల్లో ఏ కోశాన లేకపోవటంతో వ్యవసాయం ఎలా సాగు చేయాలని రైతులు కంటతడి పెడుతున్నారు.

ఖరీఫ్‌లో తొలి పంటలను సాగు చేసేందుకు ఇప్పటికే ఎకరాకు రూ. 30 నుంచి రూ. 50 వేల వరకు ఖర్చు చేసిన ఫలితం మాత్రం శూన్యంగా మారుతుందనేది స్పష్టమవుతుంది. అనేక ప్రాంతాల్లో మొలిచిన పత్తి మొక్కలను బ్రతికించుకునేందుకు రైతులు ఆయా మొక్కలకు బిందెల ద్వారా నీటితో తడిపి పంటలు కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ప్రకృతి కనికరించకపోతుందా అనే భావనతో ఆకాశం వైపు ఎదురుచూస్తూ వాన దేవునిపై భారం వేసి ఎదురుచూస్తున్నారు.

ప్రకృతి కనికరించి పుష్కలంగా వర్షాలు పడి పంటలు పండాలని కోరుతూ ఇప్పటికే అనేక గ్రామాల్లో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవటంతో బోర్లు, బావుల్లో నీరు లేక కనీసం తమ ఇంటి కోసం పంటలు పండించుకోవటానికి కూడా సాగు నీరు లేకపాయే అనే భావన రైతుల్లో ఉంది. ఏదేమైనప్పటికీ ప్రకృతి కనికరిస్తే తప్ప వ్యవసాయ పంటలు పండే పరిస్థితులు లేదనేది స్పష్టమవుంతుంది.

Drought conditions in kharif season

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మురిపిస్తున్నవర్షం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.