పసిడి పంట పండించే భీంపల్లి నానీలు

  మనసు స్పందిస్తే కవిత్వం, మరో మనసు చేరితేనే అసలైన కవిత్వం!అలా చేరే కవిత్వం ఏ రూపంలోనైనా ఉండొచ్చు, కానీ అందులోని భావం ముఖ్యం. మన సాహిత్యంలో ఎన్నెన్నో ప్రక్రియలు వచ్చాయి. ప్రాచీన సాహిత్యంలో పాల్కురికి సోమనాథుడు నూతన ప్రక్రియలకు శ్రీకారం చుడితే ఆధునిక సాహిత్యంలో కందుకూరి, గురజాడ లు కొత్త ప్రక్రియలను ప్రారంభించారు. వచన కవిత్వం వచ్చాక కవిత్వం ప్రజలకు మరింత దగ్గరయ్యింది. రాసేవాళ్ళు పెరిగారు, చదివేవాళ్ళు పెరిగారు. అయితే ఎందరు ఎన్ని కవితలు రాసినా […] The post పసిడి పంట పండించే భీంపల్లి నానీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మనసు స్పందిస్తే కవిత్వం, మరో మనసు చేరితేనే అసలైన కవిత్వం!అలా చేరే కవిత్వం ఏ రూపంలోనైనా ఉండొచ్చు, కానీ అందులోని భావం ముఖ్యం. మన సాహిత్యంలో ఎన్నెన్నో ప్రక్రియలు వచ్చాయి. ప్రాచీన సాహిత్యంలో పాల్కురికి సోమనాథుడు నూతన ప్రక్రియలకు శ్రీకారం చుడితే ఆధునిక సాహిత్యంలో కందుకూరి, గురజాడ లు కొత్త ప్రక్రియలను ప్రారంభించారు. వచన కవిత్వం వచ్చాక కవిత్వం ప్రజలకు మరింత దగ్గరయ్యింది. రాసేవాళ్ళు పెరిగారు, చదివేవాళ్ళు పెరిగారు. అయితే ఎందరు ఎన్ని కవితలు రాసినా నిలబడేవి మాత్రమే నిలబడతాయి. అలాంటి వచన కవిత్వంలో కూడా ఎన్నో ప్రక్రియలు పుట్టుకొచ్చాయి. అందులో గోపీ గారు సృష్టించిన నానీలు ఎక్కువగా ఆకట్టుకున్నాయి. 1997 లో నడక మొదలెట్టిన నానీలు ఇప్పటికే 350 సంపుటాలు దాటాయంటే నానీల గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది. కవిత్వం రాసే ప్రతి కవి నానీలను ముట్టకుండా ఉండలేడు. అందుకే ఆధునిక సాహిత్య ప్రక్రియల్లో తడబడకుండా నిలబడింది మాత్రం నానీలే. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ మెరువు, ఆ చరుపు అలాంటిది. ఆ సాంద్రత, గాఢత నానీల్లో నిక్షిప్తమై ఉంటుంది.

సోది, పుష్కర కృష్ణవేణి, మొగ్గలు, పుష్కర భీమరథి, బతుకమ్మ నానీలు, పాగా పుల్లారెడ్డి జీవిత చరిత్ర, మందుముల నరసింగరావు జీవిత చరిత్ర, మహబూబ్ నగర్ జిల్లా తెలుగు సాహిత్య వికాసం మొదలైన గ్రంథాలను రచించి సాహిత్యంలో, పాలమూరు ప్రాంతంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కవి శ్రీ భీంపల్లి శ్రీకాంత్ ఇప్పుడు ఈ సాహితీ క్షేత్రంలో పసిడి పంటను పండించడానికి పసిడి నానీలతో ముందుకు వచ్చారు. ఇందులో మొత్తం 160 కి పైగా నానీలు ఉన్నాయి. అందులో 50 కి పైగా నానీలు అక్షరాలపై, కవిత్వంపైన రాస్తే మరో 50 కి పైగా నానీలు మనిషి వ్యక్తిత్వం, జీవితంలో పాటించవలసిన నియమాలు, ధర్మాలు చెప్పబడ్డాయి. మిగతా నానీలు బాల్యం గురించి, స్నేహం గురించి, అనుబంధం గురించి, ప్రకృతి గురించి, వలస గురించి, బానిసత్వం పైన, జీవితసత్యాల గురించి, గురువు గురించి రాసారు.

మొదట ఒక నానీలో ఇలా చెప్తారు
నేనింకా పసిమొగ్గనే కవితావనంలో రేపటి
అక్షర సుమాన్నే! అంటూ మొదటనే తన వినయాన్ని ప్రకటిస్తూ నానీలను మొదలెడతారు భీంపల్లి గారు.
లోకంలో జ్ఞానం సంపాదించిన వాళ్లంతా గొప్పగా వెలుగుతుంటారు. అందరిచే గౌరవింపబడుతుంటారు. వాళ్ళ ద్వారా లోకమంతా వెలుగు ప్రసరిస్తూ ఉంటుంది. దానికి కారణం చదువు, అలాంటి అక్షరం గురించి ఒక నానీలో ఇలా చెబుతారు..
అక్షరానిది / పెద్ద తపస్సే, అందుకే
లోకంలో ఇంత ఉషస్సు! అంటూ అక్షరతపస్సును, అక్షరానికున్న ఉషస్సును చూపిస్తారు. తర్వాత కవి అనేవాడు ప్రజలకు ప్రతిరూపం, ప్రతిబింబం. సమస్య ఏదైనా తనదిగా భావించి కవిత్వం రాస్తాడు.
అందుకే ఇలా అంటాడు.
కవిగుండెను / తడిమిచూడు, వినబడతాయి/ మనిషి సంవేదనలు!
కవి మనసు గాయపడితే దానికి కవిత్వమే చక్కని మందు అని, కవిత్వం గాయాలను ఎలా మాన్పుతుందో వారి నానీల్లో చెబుతారు.
అలాగే కవిత్వం అంటే ఎలా ఉండాలి, దానికి లక్షణాలు ఏమిటని అడిగితే ఒక నానీలో ఇలా అంటారు
మంచి కవిత్వానికి లక్షణాలు ఉండవు, హృదయ స్పర్శే దానికి ప్రమాణం! ఇంతకంటే గొప్పలక్షణం ఇంకేమీ ఉండదు. ఒక లాక్షణికుడు చెప్పే నిర్వచనం ఇచ్చారు. అలాంటి కవిత్వంతో మనసును తేలిక పర్చుకోవడమే కాదు అవినీతిని సైతం కవితా కరవాలంతో నాశనం చేద్దాం రమ్మంటారు. కవిత్వం సమాజ ప్రతిబింబంలా ఉండాలి కానీ కేవలం ఫోటోగ్రఫీలా ఉండకూడదంటారు.
తర్వాత ఇందులో గురువుల ఎడల భక్తిభావాన్ని పెంచే నానీలున్నాయి ఉపాధ్యాయుడు, గురువు అనేవాళ్ళు ఇద్దరూ ఒక్కరే అయినా వాళ్ళ ప్రవర్తనను బట్టి రెండు విధాలుగా ఉంటారని చెప్తారు. అందులో ఒక నానీ ఇలా ఉంది
ఉపాధ్యాయుడు / చూపించే రహదారి, గురువు
వెంటనడిచే బాటసారి! అలా వెంట నడిచే గురువులు ఉన్నంత కాలం మంచి శిష్యులు తయారవుతూనే ఉంటారు, అందులో సందేహం లేదు.
మనిషన్న తర్వాత ఎన్నో సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించాలంటే ఎంతో పోరాటం చేయాలి.
జీవితం ఓ నదీ ప్రవాహం నడిచే దారిలో రాళ్లు రప్పలు ఎదురౌతూనే ఉంటాయి. అలాంటి సమయాల్లో ఒక్కోసారి దుఃఖం పొంగుకొస్తుంది. ఆ దుఃఖమే మనిషికి ధైర్యాన్నిస్తుంది, ఎవరెన్ని మాటలు చెప్పినా, ఎవరెంత కన్నీటిని తుడిచినా సరిపోదు. మనిషిని ఓదార్చేది చివరికి తన దుఃఖమే, అది సత్యం.
అందుకే ఒక నానీలో ఇలా అంటారు
సమస్యల్లో / విలవిల్లాడాను, దుఃఖమే నన్ను సాంత్వన పరిచింది! నిజమే కన్నీళ్లు బయటపడితే గానీ, అసలైన మనిషి బయట పడడు.
అలాగే, నిరాశ అంచున / నిలబడి పోకు, ఆశ
చీకట్లను చీల్చే బాకు! అంటూ ఒక నానీలో ఆశ అనే ఆయుధంతో నిరాశను గెలవాలంటారు.
నిజం నిప్పులాంటిది, ముక్కుసూటిగా వెళ్తుంది అనే విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ ఒక నానీ చెప్తారు, అదేమిటంటే
సత్యానికి / ధైర్యం ఎక్కువ, అందుకే
ఎవరికీ తలొంచదు! అంటూ ఇందులో సత్యానికున్న గర్వం, పొగరు చూపిస్తారు.
ఆలోచనాత్మకంతో కూడిన మరో నానీ చూద్దాం
అది మనకు నిత్యం కనబడే చీపురు గురించి రాసింది.
చీపురు తిరిగినంత మేర శుభ్రం చేస్తుంది, మరి మనిషి సంగతి!
అంటూ మనకే ప్రశ్నను వదిలేస్తున్నారు.
ఇంకో నానీలో
శత్రువు ఎవరైతేనేం / ప్రేమిద్దాం, వాడి బతుకులో మార్పు తెస్తూ! అంటూ శత్రువులను ద్వేషిస్తే చివరిదాకా శతృత్వమే మిగులుతుంది. అదే ప్రేమించడం మొదలుపెడితే శత్రువు కూడా మారే అవకాశం ఉందనే సత్యాన్ని తత్వాన్ని వెలిబుచ్చుతారు. తర్వాత వలసలతో పెద్దలంతా పట్నాలకు పోతుంటే ఇంటిదగ్గర పిల్లలు అనాథలుగా, పనివాళ్లుగా మిగిలిపోతున్నారు, చదువు లేక బాల కార్మికులుగా తయారవుతున్నారు. పసితనాన్ని కాపాడుకోవాలంటూ వలస గురించి ఒక నానీ రాసారు. అది
పాలమూరు జిల్లా కూలీల ఖిల్లా, ప్రతి పల్లె
వలసల్తో డొల్ల! ఇది నిజమే కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చాక పరిస్థితి మారిందా, అలాగే ఉందా అనేది తెలియాల్సి ఉంది.
అలాగే స్నేహం, ప్రేమికుల బంధం, ఆలుమగల అనుబంధం గురించి కూడా కొన్ని నానీలు ఉన్నాయి ఒక నానీలో స్త్రీని వంటింటి మహారాణిని చేస్తారు. మన కడుపు నిండాలంటే అలాంటి రాణులు తప్పకుండా ఉండాల్సిందే . అందుకే ఇలా అంటారు.
వంటింటికి ఆమే మహారాణి, అందుకే నాది కరువులేని రాజ్యం! అని చాటి చెప్తాడు. తర్వాత మన జన్మ ధన్యం ఎప్పుడౌతుందో చెప్తూ జననం సంతోష భరితం, మరణం కూడా చరితార్థమైతే! అంటారు. అదే జీవితసత్యం
చివరగా కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారు కవి గురించి రాస్తూ కొన్ని నానీలు రాసారు అందులో ఒక నానీ
సృజన / అతని నిత్యకృత్యం / అలసట అతనికి /బహుదూరం!
నిజమే ఎందెందు చూసినా అందందే కలడన్నట్లు కనిపిస్తుంటారు భీంపల్లి గారు. వారి ఓపికకు వందనం చేయాల్సిందే
అలాగే… కోట్ల గారు ఇంకో నానీలో ఇలా చెప్తారు
కవిత్వం / ఎవరిదైనా / భుజానెత్తుకుంటాడు
సౌజన్యం అతని మారుపేరు!
ఇది కూడా అక్షరసత్యం. అందరినీ ప్రోత్సహిస్తుంటారు. అదే ఆయన గొప్పదనం. భీంపల్లి గారి వ్యక్తిత్వం గురించి ఇంతకంటే స్పష్టంగా ఇంకేం చెప్పలేము. కోట్ల గారి నానీల సాక్షిగా ఇది నిజం.
ఇలా ఎన్నెన్నో భావాలను వ్యక్తపరుస్తూ నానీల పసిడి పంటను పండించారు. ఇంకా మరింత వస్తు వైవిధ్యం పాటించి, మరింత లోతైన భావాలను పలికిస్తూ తన సాహిత్య ప్రస్థానాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మరోసారి అభినందనలు, అలాగే ఈ నానీలకు భావానుగుణంగా చిత్రాలు గీసిన చిత్రకారుడు మహేష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను.

Dr Bheempally Srikanth Written by Pasidi Naneel book

The post పసిడి పంట పండించే భీంపల్లి నానీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: