పోషక శనగలు

Chickpea Recipes

 

శ్రావణ మాసంలో నిర్వహించుకునే వ్రతాల్లో ముత్తయిదువులకు వాయినాలను ఇచ్చుకోవడం ఆనవాయితీ. అయితే ఎక్కవగా వచ్చిన సెనగలను ఏం చేయాలో తెలియక కొంతమంది తికమక పడుతుంటారు. వాటితో రకరకాల పలహారాలను చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం…

ఉడికించుకుని తీసుకున్నా, కూర్మాలో వేసుకున్నా, ఫ్రై రూపంలో తీసుకున్నా, సలాడ్ రూపంలో లాగించినా, శనగల రుచే వేరు. మొలకెత్తిన శనగలతో గారెలు వేసుకున్నా భలే రుచికరంగా ఉంటాయి. ఇవి రుచినే కాదు ఎన్నో పోషక విలువలను కలిగి ఉన్నాయి.

1. శనగల్లో మెగ్నీషియం, థయామిన్, మాంగనీస్, ఫాస్పరస్ వంటివి అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించటంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటితో పాటు పీచు, ఫైథో నూట్రియంట్స్ కలిగి ఉన్నాయి. బెంగాల్‌గ్రామ్‌గా పిలవబడే ఈ శనగలు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన మాంసకృత్తులు పుష్కలంగా అందుతాయి.

2. వంద గ్రాముల శనగల్లో 61.2 శాతం పిండిపదార్ధాలు, 5.3 శాతం కొవ్వు, 17.1 శాతం మాంసకృత్తులు, 190 మిల్లీగ్రాముల కాల్షియం, 168 గ్రాముల మెగ్నీషియం, 9.8 శాతం ఇనుము, 71 మిల్లీగ్రాముల సోడియం, 322 మి.గ్రా.పొటాషియం, 3.9 మి.గ్రా పీచుపదార్ధం, 361 కేలరీలు ఉంటాయి.

3. శనగల్లో రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉంది. ఇందులో ఉండే మాంగనీస్, మెగ్నీషియం శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందించడానికి సహాయపడతాయి.

4. మధుమేహం ఉన్నవారికి శనగలు ఎంతో మేలు చేస్తాయి. రక్తంలో తగినంత గ్లూకోజ్, చక్కర స్థాయిలని అదుపులో ఉంచటంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. పీచు చక్కెరను నియంత్రిస్తుంది.

5. శనగల్లో ఉండే పైథో న్యూట్రియంట్స్, ఆస్టియో ఫ్లోరోసిస్ తో పోరాడతాయి. క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి.

6. శనగలు స్త్రీలకు చాలా అవసరం. ఇందులో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఇనుము అందుతుంది. దీనివల్ల రక్త హీనతకు దూరంగా ఉండవచ్చు.

7. రక్తపోటుతో బాధపడే వాళ్లు రెగ్యులర్ డైట్‌లో శనగలు చేర్చుకోవడం మంచిది. ఇవి రక్త పోటును నియంత్రించడంలో సహాయపడతాయి.

8. నానబెట్టి మొలకలు వచ్చిన శనగలలో పీచుపదార్ధం అధిక మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఏ వయస్సు వారు శనగలు తీసుకున్నా.. త్వరగా అరుగుతాయి. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

9. శనగల్లో గుండెకు అధిక బలం చేకూర్చే గుణం ఉంది. అంతేకాదు ఇవి గుండెకు రక్తం సక్రమంగా సరఫరా అవటానికి కూడా తోడ్పడతాయి.

10. శనగల్లో ఫ్యాట్ కరిగించే గుణం కూడా మెండుగా ఉంది. వీటిల్లో ఉండే ఫోలేట్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

11. శనగలను నానబెట్టి ఉడకబెట్టి తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల మంచి ప్రొటీన్లుగా ఉపయోగపడతాయి.

12. శనగలు చర్మ సంరక్షణలో పవర్ ఫుల్ గా పనిచేస్తాయి. ఇవి యాక్నే, పింపుల్స్, ఎగ్జిమా, డెమ్మటైటిస్ వంటి రకరకాల సమస్యలను మాయం చేస్తాయి. శనగ పిండికి పాలు కలిపి ముఖానికి అప్లై చేస్తే ఎలాంటి చర్మ సమస్య అయినా దూరమవుతుంది.

13. శరీరం మొత్తానికి బలాన్ని ఇవ్వడానికి శనగలు సహాయపడతాయి. ఇందులో పుష్కలంగా ప్రొటీన్స్ ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తాయి. శనగల్లో ఉండే ఎమినో యాసిడ్స్ బ్లడ్ సెల్స్ పనితీరుకి సహాయపడతాయి.

Chickpea curd soup

శనగల పెరుగు పులుసు
కావాల్సినవి: శనగలు: అరకప్పు, పెరుగు: ఒకటిన్నర కప్పులు, పచ్చిమిర్చి: రెండు, శనగపిండి: టేబుల్‌స్పూను, పసుపు: అర టీస్పూను, ధనియాల పొడి: ఒకటిన్నర టీస్పూను, కారం: టీస్పూను, గరం మసాలా: అరటీస్పూను, జీలకర్ర: అరటీస్పూను, ఇంగువ: చిటికెడు, నూనె: టేబుల్ స్పూను, ఉప్పు: తగినంత.
తయారీ: శనగల్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే నీళ్లు వంపేసి, కుక్కర్‌లో వేసి రెండు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. నీళ్లను వంచి పక్కన ఉంచాలి. శనగల్ని కొద్దిగా మెదిపి పక్కన ఉంచాలి. ఓ గిన్నెలో పెరుగు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, శనగపిండి వేసి ఉండలు కట్టకుండా మృదువుగా కలపాలి. బాణలిలో నూనె పోసి జీలకర్ర, ఇంగువ వేసి వేగాక, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించి మెదిపిన సెనగలు వేసి ఓ నిమిషం వేయించాలి. పెరుగు మిశ్రమంతో పాటు సెనగల్ని ఉడికించిన నీళ్లను పోసి కదుపుతూ కాస్త చిక్క బడే వరకూ ఉడికించాలి. ఉప్పు సరిచూసి దించి వడ్డించాలి.

Peanut Fritters

 

శనగల వడలు
కావాల్సినవి: శనగలు ఒక కప్పు, మినుములు పావు కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, రెండు పచ్చిమిర్చి, కరివేపాకు, తరిగిన చిన్న అల్లం ముక్క, ఉప్పు తగినంత, నూనె డీ ఫ్రైకి సరిపడ, నీళ్లు కొద్దిగ.
తయారీ: ముందుగా శనగలు, మినుములు 5 గంటలపాటు నానబెట్టి పెట్టుకోవాలి. నానబెట్టి తీసిన శనగలు, మినుములు, పచ్చిమిర్చి, అల్లం, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టాక కొన్ని నీళ్లు పోసి పల్చగ కాకుండా ముద్దగా పట్టుకోవాలి. పట్టుకున్న దాంట్లో ఉల్లిపాయలు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ప్యాన్‌లో నూనె పోసి వేడి అయిన తర్వాత, కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వడల్లాగ వత్తుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.

Fry Chickpeas

 

తాలింపు శనగలు
కావాల్సినవి : 100 గ్రా పచ్చి శనగలు, శనగపప్పు, టీ స్పూన్ మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర, ఎండు మిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి.
తయారీ : శనగల్లో ఒక గ్లాసు నీళ్లు పోసి రెండు గంటలు నానబెట్టుకోవాలి. కుక్కర్‌లో నానబెట్టుకున్న శనగలు వేసి తగినంత ఉప్పు వేసి ఒక రెండు, మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ప్యాన్ తీసుకుని 1/2 టేబుల్ స్పూన్ నూనె పోసి, నూనె వేడి అయిన తరాత రెండు, మూడు వెల్లుల్లి రెబ్బల్ని వేయాలి. టీ స్పూన్ పచ్చి శనగపప్పు, టీ స్పూన్ మినపప్పు, టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయని వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గేంతవరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగల్ని వేసి 2 నిమిషాలు మగ్గించి చివరగ ఇంగువ తాలింపు వేయడమే.

Chickpea Barfi

 

శనగల బర్ఫీ
కావాల్సినవి: నానబెట్టిన శనగలు: పావుకిలో, నెయ్యి, పంచదార: 100 గ్రా, కోవా: 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి: టీస్పూను
తయారీ : నానబెట్టిన శనగల్ని మెత్తగా రుబ్బాలి. బాణలిలో నెయ్యి వేసి అందులో రుబ్బిన మిశ్రమాన్ని వేసి నెయ్యి పైకి తేలేవరకూ వేయించాలి. ఇప్పుడు పంచదార వేసి మరికాసేపు ఉడికించాలి. తరవాత కోవా, యాలకుల పొడి వేసి రెండు మూడు నిమిషాలు ఉడికించి దించి నెయ్యి రాసిన ప్లేటులో వేసి ఆరాక, ముక్కలుగా కోయాలి.

Different Recipes with Chickpea in Sravana Masam

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పోషక శనగలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.