జైలు, డిటెన్షన్ ఒకటేనా?

  నేరస్థులు వేరు అక్రమ వలసదారులు వేరు, ఇతర దేశాల నుంచి అనుమతి లేకుండా వచ్చి మన దేశంలో ఉన్నవారిని అక్రమ వలసదారులుగా గుర్తించి శిక్ష విధిస్తుంటారు. శిక్షా కాలం పూర్తయిన తరువాత వారిని బహిష్కరించి విదేశాలకు పంపిస్తుంటారు. శిక్షా కాలం పూర్తయిన వారిని స్వదేశాలకు వెళ్లగొట్టే ప్రక్రియలో కొన్నేళ్లు జాప్యం జరుగుతోంది. అంతవరకు వారు ఆయా రాష్ట్రాల్లో డిటెన్షన్ సెంటర్లు ( నిర్బంధ శిబిరాలు)లో ఉండవలసి వస్తుంది. అయితే ఈ డిటెన్షన్ సెంటర్ల నిర్వహణ సరిగ్గా […] The post జైలు, డిటెన్షన్ ఒకటేనా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నేరస్థులు వేరు అక్రమ వలసదారులు వేరు, ఇతర దేశాల నుంచి అనుమతి లేకుండా వచ్చి మన దేశంలో ఉన్నవారిని అక్రమ వలసదారులుగా గుర్తించి శిక్ష విధిస్తుంటారు. శిక్షా కాలం పూర్తయిన తరువాత వారిని బహిష్కరించి విదేశాలకు పంపిస్తుంటారు. శిక్షా కాలం పూర్తయిన వారిని స్వదేశాలకు వెళ్లగొట్టే ప్రక్రియలో కొన్నేళ్లు జాప్యం జరుగుతోంది. అంతవరకు వారు ఆయా రాష్ట్రాల్లో డిటెన్షన్ సెంటర్లు ( నిర్బంధ శిబిరాలు)లో ఉండవలసి వస్తుంది. అయితే ఈ డిటెన్షన్ సెంటర్ల నిర్వహణ సరిగ్గా లేదని హర్షమండెర్ అనే ఉద్యమ నేత అధ్యయనంలో వెల్లడయింది.

జాతీయ మానవ హక్కుల మైనారిటీల మోనిటర్‌గా 2018 జనవరి 2224 తేదీల మధ్య అసోంలోని ఆరు డిటెన్షన్ సెంటర్లను అధ్యయనం చేసి అక్కడి డిటైనీల బాధలను వెలుగులోకి తెచ్చారు. ఆయన ఈ మేరకు నివేదిక రూపొందించి ఆ నివేదిక ఆధారంగానే సుప్రీంకోర్టులో 2018 సెప్టెంబర్ 20న పిటిషన్ దాఖలు చేశారు. దీంతో డిటెన్షన్ సెంటర్ల అధ్వాన్న స్థితి బయటి ప్రపంచానికి తెలిసింది. దీనిపై సుప్రీంకోర్టు కేంద్రానికి, అసోం రాష్ట్రానికి తమ స్పందన ఏమిటో తెలియజేయాలని నోటీసులు జారీ చేసింది. ఇక్కడి డిటెన్షన్ సెంటర్ల పరిస్థితిని, అమెరికాలో డిటెన్షన్ సెంటర్ల నిర్వహణతో పోల్చి అక్కడ విదేశీ కుటుంబాల వేర్పాటు విధానం ఎలా ఉందో అధ్యయన నివేదిక ఉదహరించింది.

డిటెన్షన్ సెంటర్లకు, జైళ్లకు తేడా అన్నది లేకుండా పోయిందని వెల్లడించింది. ఇది చర్చనీయాంశం కావడంతో లోక్‌సభలో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు రాష్ట్రాలూ ఈ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరించాలని ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నట్టు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఇటీవలనే లోక్‌సభకు తెలియజేశారు. ఈ మేరకు 2009, 2012, 2014, 2018 సంవత్సరాల్లో ఆదేశాలు జారీ అయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాదు డిటెన్షన్ సెంటర్ల క్రమబద్ధీకరణకు, నిబంధనలతో కూడిన మేన్యువల్ రూపొందించడానికి దారి తీసింది. ఈ మేన్యువల్ సర్కులర్ జనవరి 9న కేంద్ర పాలిత ప్రాంతాలకు, రాష్ట్రాలకు పంపడమయిందని జులై 2న లోక్‌సభకు నిత్యానంద్ రాయ్ వెల్లడించారు.

కేంద్రం జారీ చేసిన మేన్యువల్‌ను పరిశీలిస్తే అక్రమ వలసదారులు ఎవరినైనా నిర్బంధించే అధికారం 1946 విదేశీయుల చట్టం సెక్షన్ 3(2)(సి) ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 258(1) ప్రకారం రాష్ట్రాలకు, ఆర్టికల్ 239 ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ అధికారం వర్తిస్తుంది. అయితే ఈ సెంటర్ల పరిస్థితిపై హర్షమండెర్ సాగించిన అధ్యయనంలో ఎన్నో వాస్తవాలు బయటపడ్డాయి. అధ్యయనంలో మొదట ప్రధానంగా గమనించింది జైలుకు, డిటెన్షన్ సెంటర్‌కు మధ్య ఏ మాత్రం తేడా లేకపోవడం, అలాగే డిటైనీలను, ఖైదీలను ఒకేలా చూడడం, డిటైనీల చట్టబద్ధమైన హక్కులు కాని వెసులు బాటుకానీ అమలు చేయకపోవడం నిబంధనల అమలులో స్పష్టత లేక జైలు మేన్యువల్‌నే డిటైనీలకు అమలు చేస్తున్నారు తప్ప డిటైనీలకు పాటించవలసిన నిబంధనలు వేరుగా ఉన్నాయని అసోంతో సహా రాష్ట్రాలన్నీ తెలుసుకోవడం లేదు.

పెరోలు కానీ, వేతనంతో కూడిన పని వంటి ప్రయోజనాలు కాని డిటైనీలకు వర్తింపచేయడం లేదు. ఈ నేపథ్యంలో హోం మంత్రిత్వ శాఖ దేశం మొత్తం మీద డిటెన్షన్ సెంటర్లకు వర్తింప చేసే మేన్యువల్‌ను కొత్తగా రూపొందించడం గమనార్హం. అయితే ఈ సంగతి రాష్ట్రాలకు ఎందుకు తెలియడం లేదో అర్థం కావడం లేదు. జైలులో ఉన్న వారి కోసం 2016లో మేన్యువల్ రూపొందింది. ఈ మేన్యువల్‌నే యథా ప్రకారం డిటైనీలకు అసోం ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్‌ను పురస్కరించుకుని 2018 నవంబర్ 5న దేశం మొత్తం మీద డిటెన్షన్ సెంటర్లలో నిరీక్షిస్తున్న విదేశీయులను ఏ విధంగా చూడాలో వివరిస్తూ కొత్త నిబంధనలను తయారు చేసినట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేసింది.

ఆ మార్గదర్శకాలు ఏమిటి?
ఈ మేన్యువల్‌లో 39 సూచనలు (పాయింట్లు) ఉన్నాయి. డిటెన్షన్ సెంటర్ల ఏర్పాటు కోసం ప్రత్యేకించి కేంద్ర హోం శాఖ నుంచి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎలాంటి అనుమతి పొందవలసిన అవసరం లే దు. వీటిని జైలులో కాకుండా జైలు బయటనే ఏర్పాటు చేయాలి. డిటైనీలు ఎంత మంది ఉన్నారో ఆ సంఖ్యను బట్టి, డిటైనీలు విదేశీయులా మరెవరా అన్నది పరిశీలించి ఎంత పరిధిలో సెంటర్ ఏర్పాటు చేయాలో నిర్ణయించే అధికారం రాష్ట్రాలదే. అలాగే వారిని వారి దేశాలకు బహిష్కరించే ప్రక్రియ ఎప్పటికప్పుడు జరగాలి. ఈ ప్రక్రియలో పురోగతి ఉండాలి. డిటైనీ శిక్షా కాలం పూర్తి కాగానే సంబంధిత అధికార యంత్రాంగానికి లేదా డిటెన్షన్ సెంటర్ ఇన్‌చార్జికి తెలియజేసి వారిని అప్పగించాలి. డిటైనీలు తమ నిరీక్షణ కాలం వీలైతే మెట్రో నగరాల పరిధిలో అధికారులకు అందుబాటులో కూడా ఉండే వెసులుబాటు కల్పించాలి. బహిష్కరణకు సంబంధించి రాయబార కార్యాలయంలో సంప్రదింపుల దగ్గర నుంచి వారికి ట్రావెల్ జారీ చేసే వరకు నిరీక్షణ కాలంలో వారికి సౌకర్యాలు సరిగా సమకూర్చే బాధ్యత అధికారులదే. అందుకు అనుగుణంగానే డిటైన్ సెంటర్లలో సౌకర్యాలు ఉండాలి.

గదుల్లో గాలి వెలుతురు ధారాళంగా ఉండడంతోపాటు పరిశుభ్రత, విద్యుత్, మంచి నీరు, కమ్యూనికేషన్ సౌకర్యాలు సెంటర్లలో కల్పంచాలి. అంతేకాదు సిసిటివి, భద్రత, నిరంతర గస్తీ, సహాయ సిబ్బంది, పర్యవేక్షించే అధికార యంత్రాంగం ఉండాలి. కనీసం పది అడుగుల ఎత్తయిన ప్రహరీ, చుట్టూ కట్టుదిట్టమైన కంచె ఏర్పాటు చేయాలి. డిటైన్ సెంటర్ బయట ఆరు బయట స్థలం ఉండాలి. పురుషులను, మహిళలను వేర్వేరుగా అదే సెంటర్‌లో ఉంచాలి. అలాగే డిటైనీలు ఒకే కుటుంబం వారైతే అదే సెంటర్‌లో ఉంచాలి తప్ప వేర్వేరు సెంటర్లలో ఉంచరాదు. అయితే అసోం డిటెన్షన్ సెంటర్లలో ఇలాంటి పరిస్థితి లేదు.

ఒకే కుటుంబం వారిని ఆరేళ్లకు పైగా ఉన్న పిల్లలతో సహా వేర్వేరు సెంటర్లలో నిర్బంధించి ఉంచారు. ఒకరిని మరొకరు కలుసుకోనివ్వకుండా ఆంక్షలు కొనసాగిస్తున్నారని హర్షమండెర్ నివేదిక వెల్లడించింది. ఎన్నేళ్లయినా భార్యను భర్త, భర్తను భార్య పిల్లలను కలుసుకోనీయడం లేదు. కనీసం వారికి పెరోలు కూడా అనుమతించడం లేదు. ఇలాంటి ఆంక్షలు విధించవద్దని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలను ఆదేశించింది. నర్సింగ్ మదర్స్, పిల్లల పెంపక కేంద్రాలను, సంరక్షణ కేంద్రాలను, సెంటర్లలో ఏర్పాటు చేయాలని, పిల్లల చదువులను చెప్పించడానికి స్కూళ్లలో చేర్చాలని సూచించింది.

అసోంలో 63,959 మంది విదేశీయులు
అసోంలో ఆరు డిటెన్షన్ సెంటర్లు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల కన్నా ఇక్కడే ఎక్కువ. జాతీయ పౌరుల గుర్తింపు జాబితా తయారీ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆగస్టు 31 నాటికి పూర్తయ్యే లోగా మరో 10 సెంటర్లు ఇక్కడ ఏర్పాటవుతాయి. 1971 మార్చి 25 తరువాత ఎవరైతే అక్రమంగా రాష్ట్రంలో ఉంటున్నారో ఆయా విదేశీయులను హిందువుల నుంచి వేరు చేసి బహిష్కరిస్తారు. ఇటువంటి వారు దాదాపు 41 లక్షల మందిని తుది జాబితా నుంచి వేరు చేశారు. వీరిలో 36 లక్షల మంది తమ బహిష్కరణకు వ్యతిరేకంగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. అసోంలో విదేశీయుల ట్రిబ్యునల్ (ఎఫ్‌టి) 1985లో ఏర్పాటయింది. అప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు 63,959 మంది విదేశీయులు ఉన్నట్లు ప్రకటించారు. అయితే రాష్ట్రం మొత్తం మీద ఈ ఏడాది జులై 9 వరకు 1145 మంది విదేశీయులు ఉన్నట్టు విదేశీ ట్రిబ్యునల్ (ఎఫ్‌టి) ప్రకటించిందని రాష్ట్ర అసెంబ్లీకి ప్రభుత్వం వెల్లడించింది.

వీరిలో 338 మంది మూడేళ్లకు మించి ఎక్కువ కాలం డిటెన్షన్ సెంటర్లలో నిరీక్షిస్తున్నట్టు వివరించింది. వీరంతా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విడుదల కావలసి ఉంది. అసోంలో వేలాది మంది విదేశీయులు అక్రమంగా ఉంటున్నారని విదేశీ ట్రిబ్యునల్ వెల్లడించినట్టు కేంద్రం సుప్రీంకోర్టుకు ఫిబ్రవరిలో వివరించింది. వీరిలో 162 మందిని మాత్రమే బంగ్లాదేశ్‌కు తిరిగి పంపించినట్టు తెలియజేసింది. 2016, 2017 లో 39 మంది మాత్రమే బంగ్లాదేశ్ జాతీయులను అసోం డిటెన్షన్ సెంటర్ల నుంచి బంగ్లాదేశ్‌కు పంపడమయిందని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2018 జనవరిలో పార్లమెంటుకు చెప్పడం గమనించదగిన విషయం. అయితే గత 28 నెలల కాలంలో దాదాపు 500 మంది బంగ్లాదేశ్ వలసదారులను రాజధాని నుంచి వెళ్లగొట్టినట్టు ఢిల్లీ పోలీస్ యంత్రాంగం ఇటీవల సుప్రీంకోర్టుకు తెలియచేసింది. అయితే అసోం తప్ప మిగతా రాష్ట్రాల్లో డిటెన్షన్ సెంటర్లు ఎన్ని ఏర్పాటయ్యాయి? ప్రభుత్వం మేన్యువల్ ప్రకారం వాటని ఎలా నిర్వహిస్తున్నారు? అన్నది బయట పడడం లేదు. అసోం మాదిరిగానే మిగతా రాష్ట్రాల డిటెన్షన్ సెంటర్ల పై కూడా అధ్యయనం జరిగితే కాని వాస్తవాలు వెలుగులోకి రావు.

Difference between Detention Center and Prison

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జైలు, డిటెన్షన్ ఒకటేనా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: