సావర్కర్ క్షమాపణ అడిగారా!

Did Veer Savarkar apologize?

 

స్వాతంత్య్ర పోరాటంలో మరెవ్వరితో సాటిలేని వీరోచిత పోరాటం, త్యాగం చేయడమే కాకుండా అసమానమైన రీతిలో చిత్రవధలకు, కఠినమైన నిర్బంధాలకు ఎదుర్కొన్న వీర్ సావర్కార్ మృతి చెందిన 54 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మరోమారు రాజకీయ సంచలనం సృష్టిస్తున్నారు. సావర్కర్‌ను ఈ దేశ ప్రజలు మరచిపోయేటట్లు దేశంలో తిరుగులేని రాజకీయ శక్తిగా అధికారం చెలాయించినంతకాలం కాంగ్రెస్, వారికి ఈ విషయంలో వంతపాడుతున్న వామపక్షాలు ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ సావర్కర్ ప్రాతినిధ్యం వహిస్తున్న భావజాలం, జాతీయవాదం నేడు మొత్తం భారత దేశం ప్రజలను ఉత్తేజితుల్ని కావిస్తున్నది. అంతేకాదు మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నది. సావర్కర్‌ను బ్రిటిష్ వారి ఏజెంట్‌గా, స్వతంత్ర పోరాటాన్ని ‘వెన్నుపోటు’ పొడిచిన ద్రోహిగా …. ఈ దేశంలో మరే మహాపురుషుడిపై వ్యాపింపచేయలేనని ఘోరమైన అసత్యాలను ప్రచారం చేస్తూ వచ్చారు. అయినప్పటికీ ఆయన పేరు చెబితేనే ఎందుకు కొన్ని వర్గాలలో వణుకు పుడుతున్నది?

ఎనిమిదేళ్ల వయస్సులోనే తమ కులదైవం దుర్గామాత విగ్రహం ముందు ఈ దేశాన్ని బానిస సంకెళ్ళ నుండి విముక్తి చేస్తానని ప్రతిజ్ఞ చేసిన నిష్కళంక దేశభక్తుడు. నిఖార్సయిన జాతీయవాది. అంతేకాదు స్పష్టమైన హేతువాది. ఒక అంతర్జాతీయవాది కూడా. చరిత్రపై సాధికారికతతో కూడిన అవగాహనగల నేత కావడంతో పాటు చరిత్రలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ప్రత్యామ్నాయ పరిష్కారాలను సూచించిన గొప్ప అధ్యాయనశీలి కూడా. ప్రాథమికంగా స్వాతంత్య్ర పోరాట యోధుడు. దశాబ్ద కాలంకు పైగా అత్యంత కఠోరమైన నిర్బంధాన్ని, చిత్ర హింసలను అనుభవించారు.ఆ తర్వాత కూడా షరతులతోనే స్వేచ్ఛ పొందారు. ఆయన స్నేహితులు ఆయనను ‘మృతుంజయ’గా అభివర్ణిస్తుంటారు. అయితే రాజకీయ ప్రత్యర్ధులు మాత్రం వాస్తవాలను కప్పిపుచ్చి ఆయన తనను జైలు నుండి విడుదల చేయమని బ్రిటిష్ వారికి క్షమాపణ లేఖలు వాశారని దుష్ప్రచారం దీర్ఘకాలంగాచేస్తూ వచ్చా రు. ఈ మధ్యనే ఆయన జీవితంపై ఇద్దరు ప్రముఖులు – విక్రమ్ సంపత్, వైభవ్ పురంధరే రెండు గ్రంథాలు రాశారు. ఈ గ్రంథాలు రెండు కూడా సుమారు శతాబ్ద కాలంగా ఆయనపై సాగిస్తున్న దుష్ప్రచారాలు పచ్చి అబద్ధాలని స్పష్టం చేస్తున్నాయి. ఆయన దేశభక్తిగల ఒక వ్యూహాత్మక నేతగా ఈ గ్రంథాలు వెల్లడి చేస్తున్నాయి.

1913లో క్షమాపణ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారనే అంశంపై లోతయిన పరిశోధన చేసిన సంపత్ అండమాన్ జైలు పత్రాలను పరిశీలిస్తే కనీసం రెండు సార్లు మాట విననందుకు కఠిన శిక్షకు గురయ్యారని తెలుసుకున్నారు. 1913 డిసెంబర్ 16న చెప్పిన పని చేయనందుకు నెల రోజుల పాటు ఏకాంతవాస జైలు శిక్షకు గురయ్యారు. అట్లాగే, తిరిగి 1914 జూన్ 8న వారం రోజులపాటు చేతికి బేడీలతో నిలబడి ఉండే విధంగా శిక్షగా గురయ్యారు. బ్రిటిష్ వారితో కుమ్మక్కయిన వారికి ఇటువంటి కఠిన శిక్షలు పడతాయా? పైగా, 1917లో వ్రాసుకున్న ‘క్షమాపణ’ దరఖాస్తులో జైలులో ఉన్న ఖైదీలు అందరిని విడుదల చేయమని కోరారు. విడుదల చేసే స్వాతంత్య్ర యోధులలో తన పేరు లేకపోయినా దేశ స్వాతంత్య్రం కోసం తానే మాత్రం బాధపడనని కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న విప్లవకారుల పట్ల సావర్కర్ ఎల్లప్పుడూ సానుకూల ధోరణి ప్రదర్శించారని పురంధరే తన గ్రంథంలో పేర్కొన్నారు. షరతులతో తనను జైలు నుండి బ్రిటిష్ వారు విడుదల చేయడంతో ఎప్పుడైనా తిరిగి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ వంటి విప్లవకారుల గురించి స్ఫూర్తిదాయక వ్యాసాలు రాశారు. జైలులో ఉండిపోవడంకన్నా బైట ఉంది విశాలమైన, మరింత ప్రయోజనకరమైన సామాజిక కార్యం చేయడం కోసం బైటకు రావలసి వచ్చినదని ఆ తర్వాత చెప్పారు.

‘జైలు నుండి బైటకు రావడం కోసం నేను అవమానకర, విద్రోహకర, అనైతిక చర్యలకు పాల్పడలేదు’ అంటూ స్పష్టం చేశారు. ఛత్రపతి శివాజీ ఆగ్రా జైలులో ఉన్నప్పుడు ఆఫ్జాల్ ఖాన్‌ను చంపే ముందు ఏ విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారో అదే విధంగా చేశారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో భారత్‌కు కార్యదర్శి మొంటాగుకు రాసిన లేఖలో భారత్‌కు స్వయం పాలన అందిస్తే విప్లవకారులు అందరూ తమ వ్యతిరేకతను మానుకొని యుద్ధంలో బ్రిటిష్ వారికి సహకరించగలరని రాశారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో అది అసాధ్యం అంటూ జవాబు వచ్చింది.

తనకు రాజకీయ ప్రవేశం చేస్తానని భయంతో బ్రిటిష్‌వారు తన విడుదలకు ఒప్పుకోరని తెలిసే 2019లో జైలు కమిషన్ ముందు హాజరైనప్పుడు ‘మీరు నన్ను రాజకీయాలలో ప్రవేశింపకుండా నిరోధిస్తే సామాజిక, సాహిత్య కార్యక్రమాలు చేస్తుంటాను. మరి అనేక విధాలుగా మానవాళికి సేవ చేస్తుంటాను. నేను మీ షరతులను ఉల్లంఘిస్తే మీరు నన్ను తిరిగి జైలుకు పంపుకోవచ్చు’ అంటూ స్పష్టం చేశారు. గవర్నర్‌తో జరిగిన చర్చలలో కూడా అదే అంశాన్ని స్పష్టం చేశారు. ‘క్షమాపణ’ కోరుతూ సావర్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి రాసిన లేఖలు చూడడం కోసం ఎవ్వరు ఢిల్లీలోని జాతీయ పురావస్తుశాలకు వెళ్లనవసరం లేదు. ‘అండమాన్ నుండి లేఖలు’ పేరుతో జైలు నుండి తన సోదరుడు డా. నారాయణ్ సావర్కర్‌కు రాసిన లేఖలతో కలిపి సావర్కర్ స్వయంగా ప్రచురించారు. ఆయన ఎప్పుడు తాను చేసిన పనులకు క్షమాపణ చెప్పనే లేదని ఈ సందర్భంగా గమనించాలి. దేశ వ్యాప్తంగా వస్తున్న వత్తిడుల కారణంగా ద్వీపాలలో ఉన్న జైళ్లను మూసివేయాలని బ్రిటిష్ అధికారులు నిర్ణయించారు.

ద్వీపాలలో స్థిర నివాసం ఏర్పరుచుకోవాలి అనుకొనే ఖైదీలకు మినహాయింపులు ఇచ్చారు. కానీ సావర్కర్‌కు అటువంటి అవకాశం నిరాకరించారు. బలవంతంగా భారత్‌లోని ప్రధాన భాగాలకు పంపి, వివిధ జైళ్లలో మూడేళ్ల పాటు ఉంచారు. అండమాన్‌లోనే ఆయన ఆరోగ్యం క్షీణించింది. మార్క్సిస్ట్ అనుకూల ఆలోచనా ధోరణిలో భగత్ సింగ్ స్థాపించిన రెవల్యూషనరీ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ ఉన్నప్పటికీ నాడు దేశంలో విప్లవకారులు అందరికీ ఇతర అంతర్జాతీయ విప్లవకారుల సాహిత్యంతో పాటు సావర్కర్ గ్రంధం ‘హిందూ పాద్ పాదుషాహి’ గ్రంథం ప్రధానమైన పఠనాంశంగా స్ఫూర్తి కలిగిస్తూ ఉండెడిది. ఆ ప్రభావంతోనే భగత్ సింగ్ తన జైలు నోట్ బుక్ లో ‘బలవంతపు మత మార్పిడులకు ప్రతిఘటన’ గురించి ప్రస్తావించారు. పైగా, ఉరి కంబం వద్దకు లౌకిక మార్కిస్టుగా కాకుండా ‘గర్వపడే సిఖ్’ గా నడిచారు. సావర్కర్ ప్రభావంతోనే జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టే మార్కిస్టు అంతర్జాతీయ వాదానికి కొట్టుకు పోకుండా మాతృభూమితో భగత్ సింగ్ ప్రభావితం అయ్యారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన భారత జాతీయ సైన్యం (ఎన్‌ఐఎ)పై సహితం విశేషమైన ప్రభావం చూపారు. అయితే ఆయన వహించిన పాత్ర గురించి ఇప్పటికి స్పష్టంగా తెలియదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రాస్ బిహారి బోస్‌తో సావర్కర్ సంబంధాలు కలిగి ఉన్నారని, జాతీయ సైన్యంలో పెద్ద సంఖ్యలో చేరమని యువకులను ప్రోత్సహించారని మాత్రం ఆధారాలు ఉన్నాయి. వివిధ వనరుల నుండి, చివరకు బ్రిటిష్ వారి రికార్డుల నుండి కూడా సేకరించిన ఆధారాలతో బ్రిటిష్ వారు ‘సిపాయిల తిరుగుబాటు’ అని చులకనచేసి కొట్టిపార వేసిన యుద్ధాన్ని ‘మొదటి స్వతంత్ర పోరాటం’ అంటూ సిద్ధాంతీకరించి సాధికారికంగా ఒక చారిత్రక గ్రంధం వ్రాశారు. అద్భుతమైన హిందూ, ముస్లిం సంఘీభావాన్ని ఈ గ్రంధంలో ప్రస్తావించిన తీరు గమనిస్తే ఆయన ముస్లిం వ్యతిరేకి అంటూ జరిగిన ప్రచారం అసత్యమని స్పష్టం అవుతుంది. అయితే ముస్లింలు తాము విదేశీ పాలకుల వలే ముస్లింలు ఇక్కడ నివసిస్తూ ఉంటె ముస్లింలు వారిని తమ సోదరులుగా పరిగణించలేరని స్పష్టం చేశారు.

భారత స్వతంత్ర పోరాటంలో మహర్షి అరవింద్ తర్వాత గాంధీజీ మినహాయించి నేతలు అందరు పాశ్యాత దేశాల నుండి అరువు తెచ్చుకున్న మార్క్సిజం, సోషలిజం దృష్టి కోణంలో చారిత్రక సంఘటనలను అర్ధం చేసుకొనే ప్రయత్నం చేయగా, సావర్కర్ మాత్రం భారతీయ ఆధ్యాత్మిక విలువల దృష్టి కోణంలో విశ్లేషించారు. గాంధీజీవలే సావర్కర్ సహితం మతాన్ని హేతువాద, శాస్త్రీయ ధోరణిని జోడించి చూశారు. హిందువులు మానవాళికి ప్రయోగాలతోకూడిన మతాన్ని అందించిన గొప్ప వరం అంటూ చెప్పుకొచ్చారు. అత్యున్నత ఆనందం అందించే హిందూ జాతి కనుగొన్న ఈ సైన్స్ మొత్తం మానవాళికి ప్రయోజనం చేకూర్చడం కోసమేగాని, హిందువులకు, ముస్లింలకో, క్రైస్తవులకు పరిమితం కాదని స్పష్టం చేశారు.

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సావర్కర్ క్షమాపణ అడిగారా! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.