శివసేనదంతా అసత్య ప్రచారం

Devendra-Fadnavis

నా సమక్షంలో అధికార మార్పిడి మాటేరాలేదు
అమిత్ షాతో జరిగితే నాకు తెలియదు
ఫోన్ చేసినా ఉద్ధవ్ థాక్రే పలకలేదు
చర్చలంటూనే ఎన్‌సిపి, కాంగ్రెస్‌తో రహస్య మంతనాలు
మోడీపై సేన విమర్శలు బాధించాయి
సిఎం పదవికి రాజీనామా అనంతరం మీడియాతో ఫడ్నవీస్
దేవేంద్రకు అండగా నిలిచిన గడ్కరీ

ముంబయి : మహారాష్ట్రలో కొద్ది రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి శుక్రవారం మరో మలుపు మలుపుతిరిగింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి పదవికి శుక్రవారం సాయంత్రం రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారిని కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. వెంటనే ఫడ్నవీస్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. అర్ధరాత్రికి అసెంబ్లీ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఫడ్నవీస్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తదుపరి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటీవల విడుదలైన ఎన్నికల ఫలితాల్లో అతి పెద్ద పార్టీగా అతవరించిన బిజెపికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తారా? లేక రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రాజీనామా లేఖను సమర్పించిన అనంతరం ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు.

తన రాజీనామా లేఖ గవర్నర్‌కు అందజేశానని, ఆయన దానిని ఆమోదించారన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ సూచించారని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి సిద్ధంగా ఉందని, శివసేన తమతో కలిసి రావడంలేదని అన్నారు. తమతో చర్చలకు స్పందించిన ఉద్దవ్ ఠాక్రే మరోవైపు ఎన్‌సిపి, కాంగ్రెస్‌లతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారని విమర్శించారు. సిఎం పదవిపై ఆశలతో శివసేన నేతలు అసత్య ప్రచారాలకు దిగుతున్నారన్నారు. తన సమక్షంలో ఎన్నడూ అధికార మార్పిడి, ముఖ్యమంత్రి పోస్టుపై చర్చలు జరగలేదని, ఒకవేళ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేల నడుమ అలాంటిదేమన్నా జరిగితే తనకు తెలియదని ఫడ్నవీస్ చెప్పుకొచ్చారు.

తాను ఉద్ధవ్‌తో చర్చలకు చొరవ తీసుకున్నానని, కానీ ఆయన తన ఫోన్ కాల్స్‌ను రిసీవ్ కూడా చేసుకోకుండా అవమానించారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై శివసేన వ్యా ఖ్యలు సరైనవి కావని, అవి ఇలాగే కొనసాగితే వారితో స్నేహంపై పునరాలోచన చేస్తామని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ప్రజలు తీర్పునిచ్చినా తాము ఇప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయామని, ఇది తనను తీవ్రంగా బాధించిందని అన్నారు. కాంగ్రెస్, శివసేన ఎంఎల్‌ఎలను ప్రలోభపెట్టాలని చూసున్నట్టు ఆ రెండు పార్టీలు చేసిన ఆరోపణలు నిరాధారామని ఫడ్నవీస్ కొట్టిపారేశారు. ముంబయి వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఫడ్నవీస్ వైఖరినే చాటారు. ముఖ్యమంత్రి పదవి సహా సరిసమానంగా మంత్రి పదవుల పంపకానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం జరగలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనలో తాను ఎలాంటి జోక్యం చేసుకోబోవడం లేదన్నారు.

అలా అనుకుంటే చేసి తీరుతాం : రౌత్

ఒకవైపు ఫడ్నవీస్ రాజీనామా చేస్తుండగానే మరోవైపు శివసేన నేత సంజయ్ రౌత్ ఎన్‌సిపి అధినేత పవార్ నివాసానికి వెళ్లి మంతనాలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పదవీకాలం ముగిసిన తరాత ముఖ్యమంత్రి రాజీనామా చేయడం మామూలేనని అన్నారు. మేం కచ్చితంగా కోరుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని, శివసేన వ్యక్తిని సిఎం పీఠంపై కూర్చోబెట్టాలని అనుకుంటే చేసి తీరుతామని రౌత్ అన్నారు. అధికార పంపిణీపై ఉద్ధవ్ విశ్వాసంతో ఉన్నారని, ఆ హామీ బిజెపి నుంచి వచ్చిందని అన్నారు. ఇక మోడీ, అమిత్ షాలను తామెప్పుడూ నిందించలేదని ఫడ్నవీస్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. అంతకుముందు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కూడా పవార్‌తో భేటీ అయ్యారు. బిజెపి ఎన్నాళ్లు ఆపద్ధర్మ ప్రభుతాన్ని నడిపిస్తుందని, తెరవెనక ఉందిం ఏం చేస్తారని ప్రశ్నించారు.

బిజెపి, శివసేన నడుమ మూడో వ్యక్తి ప్రమేయం అవసరం లేదని అన్నారు. తమ ఎంఎల్‌ఎలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, వారికి భద్రత కల్పించాలని శివసేన డిమాండ్ చేసింది. తమ ఎంఎల్‌ఎలను తమవైపునకు తిప్పుకోవడానికి రూ.25 నుంచి 50కోట్ల వరకు బిజెపి ఎర వేస్తోందని కాంగ్రెస్ నేత విజయ్ వడ్డెత్తివార్ ఆరోపించారు. ఇలాంటి ఆఫర్లతో తమ శాసనసభ్యులు పలువురికి ఫోన్‌లు చేస్తున్నారని అన్నారు. అయితే శివసేన, కాంగ్రెస్ ఆరోపణలను బిజెపి తోసిపుచ్చింది. అలాంటి సంస్కృతి తమ పార్టీకి లేదని, తమకు ఆ అగత్యం లేదని బిజెపి అధికార ప్రనినిధి కేశవ్ ఉపాధ్యాయ అన్నారు.
బిజెపిని గవర్నర్ ఎందుకు

ఆహ్వానించట్లేదు : పవార్

ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ భగత్‌సింగ్ కొశ్యారి ఎందుకు ఆహ్వానించడం లేదని ఎన్‌సిపి అధినేత పవార్ ప్రశ్నించారు. కేంద్రమంత్రి అథవాలేతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుపై అథవాలే తనను సలహా కోరారని, ఆయనతో చర్చలు అక్కడికే పరిమితమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరినీ ఆహ్వానించకుండా గవర్నర్ ఎన్నాళ్లు వేచి చూస్తారో చూద్దామని, త్వరలోనే ఏదో ఒక నిర్ణయం వస్తుందని భావిస్తున్నట్లు పవార్ అభిప్రాయపడ్డారు.

Devendra Fadnavis resigns as Maharashtra CM

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శివసేనదంతా అసత్య ప్రచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.