పురాణాల్లోని సైన్సు ఏమిటో?

science

 

వేద సారాన్ని ‘శృతి’ అని ఆధునిక విజ్ఞానాన్ని ‘స్మృతి’ అని హిందూ మత విశ్వాసకులు నిర్వచిస్తున్నారు. ‘శృతి’ అనుగుణంగానే ‘స్మృతి’ రూపుదిద్దుకుంటూ ఉంటుందని వారి భావన! అంటే వేద సారానికి అనుగుణంగానే సైన్సు అభివృద్ధి చెందుతూ ఉందని వారి సిద్ధాంతం! భారతీయుల కర్మ సిద్ధాంతానికి డార్వన్ ఒక భౌతిక రూపమిచ్చాడని వీరు భావిస్తారు. తమకు అర్థమయ్యీ, అర్థం కాని విషయాలు చెపుతూ తమ చర్చ మహోన్నతమైన స్థాయిలో సాగుతోందని వారికి వారే భ్రమించుకుంటూ ఉంటారు. వేద సారాన్నంతా ఉపయోగించి, తమ ఆధ్యాత్మిక శక్తి నంతా ఉపయోగించి ఒక గుండు సూదిని కదిలించిన వాడు ఇంత వరకు లేడు. అలాంటప్పుడు ఉట్టి మాటలకు విలువేం ఉంటుంది? మానవాళికి ఉపయోగపడుతున్న నూతన ఆవిష్కరణల గూర్చి మాట్లాడే అర్హత వీరికి ఎలా ఉంటుంది? ఆలోచించండి!

వేదకాలంలోనే విమానాలుంటే విష్ణుమూర్తి గద్దను, శివుడు ఎద్దును, వినాయకుడు ఎలుకను దేవతలంతా అలా వేరువేరు వాహనాల మీద ఎందుకు తిరిగారూ? హాయిగా విమానాల్లో తిరగాలి కదా? వారు అలా తిరిగినట్టు ఆయా కావ్యాలు రాసిన రచయితలు ఎందుకు రాయలేదూ? ఇకపోతే గోవా నుండి మరో విచిత్రమైన వాదన వినిపిస్తూ ఉంది. పంట పొలాల్లో వేద పఠనం వల్ల విశ్వంలోని శక్తి భూమిలోకి వచ్చి పంటల దిగుబడి, నాణ్యత పెరుగుతుందని, అందరూ ‘కాస్మిక్ ఫార్మింగ్’ చేయాలని గోవా సర్కారు సూచించింది. ఇది ఇలా ఉంటే కన్నడ సాహితీ వేత్త భగవాన్ మైసూరు దసరా ఉత్సవాల్లో మాట్లాడుతూ విలువలకు సంబంధించి ఒక విలువైన ప్రశ్నను లేవనెత్తారు. ‘నిండు గర్భణీ అని ఆలోచించకుండా సీతను అడవికి పంపి మానవత్వాన్ని మంట గలిపిన రాముడికి అయోధ్యలో భవ్య మందిరం ఎందుకూ?’ అని ! దీనికి మతతత్వ వాదులంతా ఎందుకో మరి తేలు కుట్టిన దొంగలైపోయారు.

“కన్యత్వాన్ని కూల్‌డ్రింక్ సీసాకు ఉండే సీల్‌తో పోల్చి అవమానకరంగా మాట్లాడిన జాదవ్‌పూర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ కనక్ సర్కార్‌ను తక్షణం సస్పెండ్ చేయాలి. పైగా ఆయన తన మాటల్ని సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారు కూడా! వెలుగులీనుతున్న భారత్‌కు ఇలాంటి స్త్రీ ద్వేషులు, భయంకర మనస్తత్వమున్న వారు అవసరం లేదు” అని తీవ్రంగా మండిపడ్డారు మహిళల, బాలల హక్కుల కార్యకర్త బృందా అదిగె. భారతీయ పురాణ కావ్యాల్లో సైన్సు ఉందనుకుంటే సైన్సు, ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మాసూటికల్, అగ్రికల్చరల్ వంటి కోర్సులన్నీ రద్దు చేసి అమోఘంగా అబద్ధాలు చెప్పగల రాజకీయ నాయకుల్ని, ప్రవచన కారుల్ని, గురువుల్ని, జగద్గురువుల్ని, మూడు మూడు శ్రీలని, ముక్కు స్వాముల్ని పీఠాధిపతుల్ని, బాబాల్ని నియమించి వారి బోధనల ద్వారా యువతరాన్ని సన్నాసులుగా, రుషులుగా తీర్చిదిద్దాలి. ఆధునిక వేషధారణలో సన్నాసులంతా ఎలాగూ పరిపాలన సాగిస్తున్నారు, గనక వారంతా ముందు గోచీల్లోకి, నారబట్టల్లోకి మారాలి. జనానికి ఆదర్శప్రాయంగా నిలవాలి. జీవన శైలి మార్చుకోవాలి. ఇతర దేశాల సైన్సు అందించిన ఆధునిక జీవన విధానాన్ని త్యజించాలి. సాంకేతికంగా అందిన కార్లు, విమానాలు, ఫోన్లూ, కంప్యూటర్ల వాడడం మానెయ్యాలి. జనానికి బోధించే ముందు మరి వారు ఆదర్శప్రాయంగా ఉండాలి కదా? తాము అనుసరించలేనిది జనం నెత్తిన రుద్దడం ఏం సబబూ?

వేదాల్లో, రామాయణ, మహాభారతాల్లో బోలెడంత టెక్నాలజీ ఉందనే వారు, పంచామృతం, గోమూత్రం సర్వరోగ నివారిణి అని, ఆవు పేడలో అనేక ఔషధ గుణాలున్నాయని ప్రచారం చేసే భక్త దేశభక్త పార్టీ అధ్యక్షుల వారు తనకు స్వైన్ ఫ్లూ వస్తే నెహ్రూ జీ రూపకల్పన చేసిన ‘ఎయిమ్స్’ లో ఎందుకు చేరాడూ? వీరికి భారత తొలి ప్రధాని అంటే గిట్టదు కదా? ఆయన సాధించిన వైజ్ఞానిక కృషి వీరి కళ్లకు కనపడదు కదా? అలాగే నేటి ఆర్థిక మంత్రి చికిత్స కోసం అమెరికా ఎందుకు వెళ్లినట్టూ? వీరిద్దరూ పతంజలి బాబా దగ్గర స్వదేశీ చికిత్స చేయించుకోవాల్సింది.

ఇంతకీ స్వదేశీ చికిత్స అంటూ గాలి కబుర్లు చెప్పే పతంజలి బాబానే రోగం వస్తే విదేశీ వైద్యం చేయించుకున్న విషయం ఈ దేశ ప్రజలకు తెలుసు. అందువల్ల ధర్మం, సంప్రదాయం, ఆచారం వంటి మాటలు వల్లె వేయడం మాని, నేటి ప్రభుత్వాలు, ప్రజల వైజ్ఞానిక అవగాహన, నీతిమంతమైన ప్రవర్తన, పారదర్శకత, మానవీయ విలువల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాల్సి ఉంది. మన పురాణ ఇతిహాసాలన్నీ అద్భుతమైన సృజనాత్మక రచనలని ఒప్పుకుని తీరాలి. అవి వైజ్ఞానిక పరిశీలన గ్రంథాలు కావు. పరిశోధన గ్రంథాలు అంతకన్నా కావు. మీ పేస్టులో ఉప్పు ఉందా? అని అడిగిన విధంగా, మీ పురాణాల్లో సైన్సు ఉందా అని అన్వేషించడం ఒక పనికి మాలిన చర్య! అవివేక శిఖామణులకే అలాంటి పనులు సాధ్యమవుతాయి.

కౌరవులు టెస్టు ట్యూబ్ బేబీలని, స్టెమ్ సెల్స్ (మూల కణాల) పరిశోధన ఈ దేశంలో వేల వేల ఏళ్ల క్రితం జరిగిందని, రామాయణంలో రావణుడి దగ్గర చాలా రకాల విమానాలు ఉండేవని, లక్షాన్ని ఛేదించి వెనక్కి తిరిగి రాగల క్షిపణులు రావణుడి దగ్గర ఉండేవని, లంకలో ఎయిర్ పోర్టు కూడా ఉండేదని స్వ యాన శాస్త్రవేత్త అయిన ఆంధ్రా యూనివర్శిటీ వైస్ చాన్సులర్ సెలవిచ్చారు. అదీ పిల్లల సైన్స్ కాంగ్రెస్‌లో ఆ మహానుభావుడు భావి భారత పౌరులపై తన ప్రతాపం చూపించాడు. పులి చర్మం మీద కూర్చుని యోగా చేస్తే వార్ధక్యం రాదని మరో సైంటిస్టు మరో సైన్సు కాంగ్రెస్‌లో ప్రతిపాదించాడు. గో మూత్రంలో ఉండే బాక్టీరియా ఆహారాన్ని బంగారం చేస్తుందని మరో పరిశోధకుడు ప్రకటించాడు. అతని కన్న మిన్న ఆచంట మల్లన్న అన్నట్లు తమిళనాడుకు చెందిన కె.జె. కృష్ణన్ తను ఐన్‌స్టీన్ కన్నా గొప్ప శాస్త్రవేత్తనని ప్రకటించుకున్నాడు. ఐన్‌స్టీన్ చేసిన ప్రయోగాలు సరైనవే కాని, సిద్ధాంతాలు సరిగా లేవని ఆయన వాదన. అంతటితో ఆగాడా అంటే లేదు. న్యూటన్, స్టీఫెన్ హాకింగ్ అసలు శాస్త్రవేత్తలే కారని ఆయన తీర్మానించాడు. ఇక త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేబ్ అయితే, భారత కాలంలోనే ఇంటర్నెట్, వైఫే అందుబాటులో కొచ్చాయని తేల్చాడు.

‘తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు’ అని కవి అతిశయోక్తులతో అన్నాడే గాని, వాస్తవానికి తివిరి ఇసుమున తైలం తీయలేం. అలాగే పురాణేతిహాసాల నుండి సైన్సునూ తీయలేం. పరిపాలనలో మతతత్వం పేట్రేగిపోయి జన జీవనం అస్తవ్యస్త మవుతూ ఉంటే దేశం ముందుకు ఎలా వెళుతుందీ? ఇక్కడ మరో విషయం ఆలోచిద్దాం. మన పూర్వీకులు/ ముందు తరాల పెద్దలు చెప్పింది ప్రశ్నించకుండా ఆచరిస్తూనే ఉండాలని, అదే మన సంస్కృతి, నాస్తికులు కూడా భారతీయ సంస్కృతిలో ఒక భాగమే నన్నది ఎందుకు గుర్తుకు రాదూ? మీరంటున్న ముందు తరం పెద్దల కన్నా వీరు చాలా చాలా యేళ్ల క్రితమే కొన్ని విషయాలు చెప్పారు కదా? వాటిని ఎందుకు ఆచరించరూ? బుద్ధుడు ‘దేవుడే లేడ’ని ప్రకటిస్తే, మీరంటున్న మీ ముందు తరం పెద్దలు ఆయన్నే దేవుణ్ణి చేశారు. వారి ప్రయోజనాలు నెరవేరడానికి వారు చేపట్టిన కుట్ర అది. లేకపోతే హిందువుల దశావతారాల్లో ఆయనను ఎందుకు చేర్చుకున్నట్టూ? ఇలాంటి ధోరణులను ఖండిస్తూ దేశంలోని పలు చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఎన్నో పత్రికలు సంపాదకీయాలు రాశాయి. రచయితలు తమ ఆవేదన వెలిబుచ్చారు. అయినా ఎలక్ట్రానిక్ మీడియా మాత్రం వీటికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వలేదనే చెప్పాలి. హాస్య ప్రధానమైన విదూషక కార్యక్రమాలు జనాన్ని రంజింప జేసినట్లు నిరసనలూ పోరాటాలు రంజింప జేయలేవని అనుకుంది కాబోలు!

Development of science over time

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పురాణాల్లోని సైన్సు ఏమిటో? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.