ప్రజాస్వామ్యవాది బసవేశ్వరుడు

  శతమానాల నుండి సమసమాజము శోషణకు గురై సామాజిక వ్యవస్థ బూజు పట్టి అస్పృశ్యత, జాతి వర్ణ, వర్గ విభేదాలు, యజ్ఞయాగాలు, హోమాలు, నరబలి, స్త్రీ శిశుహత్యలు, బాల్య వివాహాలు, సతీసహగమనం మొదలగు మూఢాచారాలు తాండవిస్తున్న తరుణం లో బసవణ్ణ అనే క్రాంతి పురుషుడు క్రీ.శ. 1134లో ఆనందనామ సంవత్సర వైశాఖ మాస అక్షయ తృతీయ రోజున ఇప్పటి కర్ణాటక రాష్ట్ర బీజాపూర్ జిల్లా బాగేవాడి అనే గ్రామంలో మదాంబికా మాదిరాజు దంపతులకు జన్మించాడు. లింగాయత ధర్మ […] The post ప్రజాస్వామ్యవాది బసవేశ్వరుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

శతమానాల నుండి సమసమాజము శోషణకు గురై సామాజిక వ్యవస్థ బూజు పట్టి అస్పృశ్యత, జాతి వర్ణ, వర్గ విభేదాలు, యజ్ఞయాగాలు, హోమాలు, నరబలి, స్త్రీ శిశుహత్యలు, బాల్య వివాహాలు, సతీసహగమనం మొదలగు మూఢాచారాలు తాండవిస్తున్న తరుణం లో బసవణ్ణ అనే క్రాంతి పురుషుడు క్రీ.శ. 1134లో ఆనందనామ సంవత్సర వైశాఖ మాస అక్షయ తృతీయ రోజున ఇప్పటి కర్ణాటక రాష్ట్ర బీజాపూర్ జిల్లా బాగేవాడి అనే గ్రామంలో మదాంబికా మాదిరాజు దంపతులకు జన్మించాడు.

లింగాయత ధర్మ సృష్టికర్త మహాత్మా బసవేశ్వరుడు విశ్వ గురువు, మహా మానవతావాది, సంఘ సంస్కర్త, కుల, మత, వర్గ, వర్ణ వ్యవస్థను రూపుమాపడానికి క్రీ.శ. 12వ శతాబ్దంలోనే పూనుకున్న సాంఘిక విప్లవకారుడు. స్త్రీ పురుష అసమానతలను తొలగించడానికి కృషి చేసిన అభ్యుదయవాది. బూజుపట్టిన మూఢాచారాలకు సంప్రదాయాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుట ఎగురవేసిన మొదటి సంఘ సేవకుడు బసవేశ్వరుడు. బాల్య వివాహాలు, సతీసహగమణం వంటి దురాచారాలను అరికట్టుటకు ఆ మహాత్ముడు ఆనాడే కృషి చేసాడు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని ఘోషించిన అపూర్వ ప్రగతిశీలి, మొట్టమొదటి కులాంతర వివాహం చేసిన గొప్ప సంఘసంస్కర్త. తన కాలపు సమాజ జీవితంలో వెలుగులు నింపిన చింతకుడు బసవణ్ణ, జగమెరిగిన శ్రేష్ఠ దార్శనికుడు, ముక్త సమాజపు వైతాళికుడు, సామాజిక వ్యవస్థలో సమానత్వం వుండాలని ఆయన ఆకాంక్షించారు. మనుషులు శాంతి సామరస్యాలతో సహజీవనం జరపాలని బోధించారు. సుఖసంతోషాలకు కష్టపడి పని చేయాలని నిరాడంబర జీవితం గడపాలని ఉపదేశించారు. వ్యక్తుల జీవితాలను సమాజ గమనాన్ని ప్రభావితం చేసే విధంగా బసవన్న తన స్వంత ఒరవడిలో కొత్త ధర్మాన్ని సృష్టించారు. అదే లింగాయత ధర్మం.

అనాదిగా వస్తున్న మూఢ నమ్మకాలను, ఆచారాలను బసవణ్ణ తీవ్రంగా ఖండిచారు. ఆయనకు పూర్వం స్త్రీలకు పంచములకు ధార్మిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులు ఉండేవి కావు. బసవణ్ణ ఆగమణంతో అందరు అన్ని బంధాల నుండి విముక్తి పొందారు. వర్గ, వర్ణ, లింగ భేదాలను తెంచి ఒక నూతన సమ సమాజాన్ని స్థాపించారు. సమాజ నిర్మాణంలో ఆయన దార్శనికత నాయకత్వం ఇన్ని శతాబ్దాల తర్వాత కూడ స్ఫూర్తి నిస్తూనే ఉన్నాయి. బసవణ్ణ పూర్వపు యుగంలో పంచములకు, వెనుకబడిన కులాల వారికి దేవాలయంలోకి ప్రవేశం లేకుండెను, వారిని పశువులతో సమానంగా చూసే కాలంలో మహాత్మ బసవేశ్వరుడు సమ సమాజ స్థాపనకై దేవుడినే భక్తుడి వద్దకు తీసుకు రావడానికి ఇష్టలింగమును కనిపెట్టెను. పరమ శివునికి ప్రతిరూపమైన ఇష్ట లింగాన్ని చేతికిచ్చి గుడి సంస్కృతిని కుల వ్యవస్థను అంతమొందించారు. ఆచార పారాయణులు పంచములను గుడిలోనికి రానివ్వనపుడు ఆ గుడిలోని లింగా న్ని తెచ్చి వారి ఒడిలోన ఉంచిన మహనీయుడు బసవణ్ణ. నేడు మనం ఆచరించే యోగాని ఆనాడే ఆయన తన ఇష్టలింగ పూజలో జత చేశారు. మాంసాహారాన్ని త్యజించి శాకాహారాన్ని స్వీకరించడం ఇష్టలింగాదరణ, ఇష్టలింగ పూజ. ఇదే బసవణ్ణ సూచించిన భక్తి మార్గం. నరబలి, పశుబలి, యజ్ఞయాగాలు అర్ధములేని పూజలను నిరోధించి అనంతమైన, అతీతమైన సహజ శివ యోగమును బసవణ్ణ ప్రసరింపచేసినారు.

జ్ఞానమే గురువు. ఆచరమే లింగం, దేహమే దేవాలయం, స్త్రీ పురుష భేదం లేదు, శ్రమకు మించిన సౌందర్యం లేదు, పనిని మించిన దైవం లేదు. కష్టాన్ని మించిన భక్తి లేదు, భక్తి కన్న సత్ప్రవర్తనే ముఖ్యమని చేసే పనిలో దేవుడిని చూసే మార్గాన్ని చూపించి ‘కాయకమే కైలాసము’ అనే కొత్త ఒరవడికి నాంది పలికారు మహాత్మ బసవేశ్వరులు. లింగాయత ధర్మం ఓ విప్లవాత్మకమైన మత రూపం, అప్పటి దాకా ఉన్న చాందసవాదాన్ని తుడిచిపెట్టెందుకు శివుడి మూడోకంటి నిప్పురవ్వల దూసుకొచ్చిన ఓ శతాఘ్ని బసవణ్ణ, మనుషులంత ఒక్కటే కులాలు, ఉపకులాలు లేవు. సమాజంలో ధర్మం పేరిట దురాచారాలను చూసి ఇవన్ని స్వార్థపరుల సృష్టి అంటూ అప్పటి సమాజంలోని లోపలపై సమరభేరి మ్రోగించిన సాంఘిక విప్లవకారుడు బసవణ్ణ, సర్వసమానత్వమే శాంతికి మూలమని మానవ కళ్యాణం కోసం ప్రతిభా సంపన్నమైన స్వతంత్ర సమాలోచనలు చేసిన మొదటి వ్యక్తి బసవణ్ణ, పుట్టకతో అందరు సమానం. జాతి వర్గ భేదం లేకుండా ఆసక్తి కలవారందరు దీక్షా సంస్కారము పొందవచ్చునని చెప్పునదే లింగాయత ధర్మం.

నేటి మన పార్లమెంటరీ వ్యవస్థతో సమానమైన అనుభవ మంటపాన్ని బసవేశ్వరులు ఆనాడే స్థాపించి అందులో జాతి, కుల, వర్గ, వర్ణ భేదాలు లేకుండ అందరికి సమాన అవకాశం కల్పించారు అపూర్వ ప్రజాస్వామ్యవాది బసవణ్ణ. నేడు మనం స్త్రీలకు ఇచ్చే రిజర్వేషన్ అవకాశాన్ని ఆనాడే తన అనుభవ మండపంలో కల్పించారు. బుద్ధ భగవానుడు, జైన మహవీరుని తరువాత కుల., మత విభేదాలు పురోహిత పద్ధతి యజ్ఞ, యాగాదులను మనస్ఫూర్తిగా నిరసించిన బసవేశ్వరులు విశ్వబంధుత్వవాది, బసవేవ్వరుని వచనాలు ఉపదేశాలు ఇప్పటి వరకు నేటి సమాజం చెంతకు చేరకపోవడం ఎంతో దురదృష్టకరం. ఏనాడైతే బసవేశ్వరుడు చేసిన పనులు, సందేశాలు నేటి సమాజం గ్రహిస్తుందో ఆనాడు బసవేశ్వరునికి బుద్ధ భగవానుడి, జైన మహవీరుని వరుసలో సముచిత స్థానం ఇవ్వవలసి ఉంటుంది. బసవణ్ణ పరిపూర్ణ బుద్ధుడు, బుద్ధుడికి బసవేశ్వరుడికి మధ్య పోలికలు ఉన్నాయి. ఆలోచన విధానంలోను, ధర్మనిర్వహణలోను వీరిరువురు సర్వసమానంగా ఉందురు. బుద్ధుడు వర్గాలకు వ్యతిరేకంగా పోరాడారు, ఆ కాలంలోనే స్త్రీలకు సమానమైన ధార్మిక హక్కులు కల్పించారు. అలాగే బసవణ్ణ కూడా తన అక్క నాగమ్మకు ధార్మిక సంస్కారం ఇవ్వలేనప్పుడు ఆగ్రహంతో తన జనివారమును (జంజము) తెంచి లింగ భేదం, మఠాలు, ఆశ్రమాలకు వ్యతిరేకంగా పోరాడారు, దానికి బదులుగా తన దేహమే దేవాలయమని, చేసేపనే దైవమని ప్రబోధించారు.

కర్ణాటకలోని కూడల సంగమములో క్రీ.శ. 1196లో తన 62వ యేట ఆ పరమాత్ముని సన్నిధికి చేరుకున్నారు. నేడు ఆ కూడల సంగమం లింగాయతుల పవిత్ర క్షేత్రంగా భాసిల్లుతుంది. నిరాకరుడైన శివుడే సర్వేశ్వరుడు శివుడిని మించిన దైవం లేదన్న విశ్వాసంతో శివతత్వ ప్రచారానికి పూనుకొని ఇష్టలింగాధారణ చేసి లింగాయత ధర్మానికి బీజాలు వేశారు. నాడు బసవేశ్వరుడు అంకుర్పారణ చేసిన లింగాయత ధర్మానికి నేడు కర్ణాటక ప్రభుత్వం మైనార్టీ హోదా ఇచ్చి ప్రత్యేక మతంగా పరిగణించాలని కేంద్రానికి సిఫారసు చేసింది. బసవణ్ణ తన ఉపదేశాలను ప్రజలకు అందుబాటులో ఉండే రీతిగా వచనాలు రాసిన గొప్ప తత్త్వవేత్త, ఆ వచనాలలోని సూక్ష్మమైన తత్త్వం సులువుగా బోధపడుతుంది. సాహిత్యపరంగా కూడ బసవేశ్వరుని వచనాలకు చక్కని గౌరవం లభించింది బసవణ్ణ 64 లక్షల వచనాలు వ్రాసినట్టు ప్రతీతి. నేడు కొన్ని వేలు మాత్రమే మనకు లభ్యమవుతున్నాయి, బసవేశ్వరులు సమాజంలో పేరుకుపోయిన వైదిక సనాతన మూఢాచారాలను తన వచనాల ద్వారా ఎదురు తిరిగే సందేశాన్ని ఇచ్చారు. బసవణ్ణ వచనాలు నేటి మానవాళికి మార్గదర్శకం, విశాల హృదయం, మానవతా వాదానికి మకుటమైన వచనాలను అన్ని భాషలలో అనువదించి ఆయన చరిత్రను నేటి తరానికి తెలియజేస్తే సమాజానికి ఒక మంచి సందేశమిచ్చిన వారమవుతాము.

పాల్కూరి సోమనాధుడు తన ఆరాధ్య దైవమైన బసవేశ్వరునిపై బసవ పురాణం వ్రాసాడు. మహాత్మ బసవేశ్వరుల గొప్పతనాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం పార్లమెంటు ప్రాంగణంలో బసవేశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ వాసి డా॥ నీరజ్ పాటిల్ ఎంతో కృషి చేసి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా లండన్‌లో మహాత్మ బసవేశ్వరుని విగ్రహాన్ని ఆవిష్కరింప చేశారు, భారత ప్రభుత్వం 2006 సం॥లో 5 రూపాయలు, 100 రూపాయల బసవణ్ణ నాణాలను విడుదల చేసి ఆ మహాత్ముని స్మరించుకుంది. తెలంగాణ ప్రభుత్వం బసవేశ్వరుడి జయంతిని ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహిస్తున్నది. ట్యాంక్‌బండ్‌పై బసవేశ్వరుడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. బసవేశ్వరుడిని చరిత్రను పాఠ్యాంశంలో చేర్పించి నేటి పౌరులకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. కర్ణాటక ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలలో బసవేశ్వరుడి చిత్రపటాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులిచ్చి బసవణ్ణను స్మరించుకుంది.

నడిచే దైవం సిద్ధ గంగ మఠాధిపతి లింగైక్య శ్రీ డా॥ శివకుమార స్వామిజీ, లింగైక్య ప్రథమ మహిళా జగద్గురు డా॥ మాతే మహాదేవి , అహ్మద్‌పూర్ మహారాజ్ డా॥ శివలింగ శివాచార్య బసవతత్వాన్ని బసవ వచనాలను ఎంతోగానో ప్రబోధించి నేటి సమాజాన్ని ప్రభావితం చేశారు. ఆ బసవేశ్వరుని ప్రతినిధులుగా పేరు గాంచారు. మనం నేడు ఎట్టి సాంఘిక, ధార్మిక సంస్కరణలు ఊహిస్తున్నామో, వాటిలో చాలా వాటిని ఆనాడు బసవణ్ణ అమల్లోకి తెచ్చారు. నాటి ప్రజల్లో విప్లవం తీసుకు వచ్చిన బసవేశ్వరుని సామాజిక సమానత్వ భావన, కుల మతాలకు అతీతంగా కుల రహిత సమాజం ఏర్పడే దాక దేశానికి స్ఫూరినిస్తూనే ఉంటుంది. సమాజంలోని అసమానతలపై ఆయన చేసిన పెను గర్జనలు ఇప్పటికి ఎదో ఒక రూపంలో ఘంటానాదాలై మారుమ్రోగుతున్నాయి.

Democrat Basaveshwara life story

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రజాస్వామ్యవాది బసవేశ్వరుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: