ఉరే పరిష్కారమా?

వరంగల్‌లో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన కామోన్మాది ప్రవీణ్‌కు ఉరిశిక్ష పడింది. ఘటన జరిగి 60 రోజులైంది. అత్యంత వేగంగా కేసుపై తీర్పు వచ్చింది. రాత్రి తల్లి పక్కన నిద్రపోతున్న 9నెలల చిన్నారిని ఎత్త్తుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చిన ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. ప్రవీణ్‌ని దోషిగా నిర్ధారించి వరంగల్ జిల్లా అదనపు కోర్టు ఉరిశిక్ష విధించింది. కేసు విచారణ సమయంలో మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ముద్దాయి అంగీకరించాడని న్యాయవాదులు చెప్తున్నారు. […] The post ఉరే పరిష్కారమా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వరంగల్‌లో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన కామోన్మాది ప్రవీణ్‌కు ఉరిశిక్ష పడింది. ఘటన జరిగి 60 రోజులైంది. అత్యంత వేగంగా కేసుపై తీర్పు వచ్చింది. రాత్రి తల్లి పక్కన నిద్రపోతున్న 9నెలల చిన్నారిని ఎత్త్తుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చిన ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. ప్రవీణ్‌ని దోషిగా నిర్ధారించి వరంగల్ జిల్లా అదనపు కోర్టు ఉరిశిక్ష విధించింది. కేసు విచారణ సమయంలో మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ముద్దాయి అంగీకరించాడని న్యాయవాదులు చెప్తున్నారు. ఉరిశిక్షపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. సామాన్యులు ఉరిశిక్ష సరైనదనగా, సామాజిక వేత్తలు, న్యాయవాదులు, మహిళానేతలు, రచయితలు, మేధావులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మార్పు సామాజికంగా రావాలి, ఉరిశిక్షలతో రాదని చాలామంది అభిప్రాయ పడుతున్నారు.

స్త్రీ పురుష సమానత్వంపై చైతన్యం రావాలి

ఇంత త్వరితగతిన కేసు వెల్లడించి శిక్ష విధించడం అనేది ఆహ్వానించదగిందే. సమాజంలో నేరం, శిక్ష రెండింటి గురించే మాట్లాడుతున్నారు. కానీ ఏ భావజాలం వల్ల పసికందుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. వాళ్లు నిస్సహాయంగా, ఒంటరిగా ఉన్నారన్న భావనతో జరుగుతున్న దాడులివి. లైంగిక సంబంధం అనేది ఇద్దరి వ్యక్తుల ఇష్టంతోనే జరగాలి. ఒక వైపు నుంచి వాంఛ పుట్టగానే, జరిగేది కాదు అని సమాజంలో అవగాహన కలిగించాలి. దీని వల్ల చాలా ఎక్కువ మందిని రక్షించగలుగుతాం. నేరానికి శిక్షకి మధ్య ఒక చైతన్యం అనేది చాలా అవసరం. స్త్రీ పురుష సమానత్వాన్ని తెలియజేయాలి.
– ‘పివోడబ్లు’ సంధ్య

ఈ ఉరిశిక్షతో నేరాలు ఆగిపోతాయా?
ఈ కేసు విషయంలో పోలీసులే మొదటిరోజు అతనొక సైకో అని ప్రకటించారు. ఆ వ్యక్తికి కోర్టు విచారణ ఎదుర్కొనే మానసిక స్థితి ఉందా? అనే విషయం మీద మానసిక నిపుణులతో చర్చించి, ఆ పరీక్షలకు గురి చేసి కోర్టుకు తీసుకెళ్లారా లేదా అనేది నా మొదటి ప్రశ్న. కానీ, అదేం జరగలేదు అక్కడ. అతను రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు అందులో డౌటే లేదు. సైకలాజికల్ ట్రీట్‌మెంట్ చేయకుండా ఎలా విచారిస్తారు. ఏ రకమైన చట్టం అవుతుంది. ఈ ఉరి శిక్ష వల్ల సమాజంలో నేరాలు జరగవా? అది సామాజికమైన భద్రత కల్పిస్తేనే ఆగు తుంది. పిల్లలకి సురక్షితమైన భద్రత కల్పించినప్పుడే లైంగిక దాడులు ఆగుతాయి. ఒక్క బిడ్డకి న్యాయం చేస్తే సరిపోతుందా? వరంగల్‌లో ఎన్నో కేసులున్నాయి.
– దేవి, సామాజికవేత్త

భయంతో నేరాన్ని నివారించలేం

అసాధారణమైన పరిస్థితుల్లో అసాధారణమైన తీర్పులు కూడా ఉండాలి. నేరాలను ఆపగలగడానికి ప్రతి ఒక్కరం ప్రయత్నించాలి. అవి ఫెయిల్ అయినప్పుడే ఇలాంటి నేరగాళ్లు పుట్టుకొస్తారు. అలాంటప్పుడు మరి అలాంటి విధంగానే శిక్షలు కూడా ఉండాలి. భయంతో పూర్తిగా నేరాలను నివారించలేం. అదే భయం ఉంటే ఇలాంటివేం జరగవు కదా. ఉరి శిక్షతోనైతే ఇలాంటి సమస్యలు పూర్తిగా ఆగిపోతాయనుకుంటే పొరపాటు. అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నందున పోర్నోగ్రఫీ సులభంగా అందుబాటులో ఉంది. దాన్ని ఆపగలిగితే ఇటువంటి అఘాయిత్యాలను కొంతైనా అరికట్టవచ్చు. ‘అంకురం’ సుమిత్ర

                                                                                                          – అంకురం సుమిత్ర

మిగతా కేసుల మాటేంటి?
తొమ్మిది నెలల పాపకి జరిగింది చాలా దారుణం, అన్యాయం. అతనికి శిక్ష పడాలి ఒప్పుకుంటున్నాను. కానీ, అదే వరంగల్‌లో చాలా హత్య కేసులు నమోదయ్యాయి. వాళ్లందరి మీద ఇదే వైఖరి ఎందుకు తీసుకోవట్లేదు. అంటే తొమ్మిదినెలల పాప మీద జరిగింది మాత్రమే రేప్, మిగిలినవి కేసులు కాదా? అక్కడ వాటి గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు. బార్ అసోసియేషన్ తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండటం లేదు. నిందితుడికి అనుకూలంగా వాదించాలని, వాదించకూడదని వాళ్లే డిసైడ్ చేస్తున్నారు. బార్ అసోసియేషన్లు ఇలాంటి వాటిల్లోకి దిగకూడదు. పోలీసులు కేవలం 53 రోజుల్లో ఒక కేసుని శిక్ష వరకు తీసుకెళ్లగలిగారంటే ఏ కేసునైనా తీసుకెళ్లగలరు కదా!
                                                                                              – వనజ, జర్నలిస్ట్

తప్పు చేయాలంటేనే భయం కలగాలి
ఒక తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం ఉండాలి. అది ఏ శిక్ష అయినా కానీయండి. అలా ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. మన వ్యవస్థ ఎంత పతనమైందో తెలుస్తుంది. తాగడం అనేది ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఎంజాయ్ అనేది ఒక కల్చర్ అనే యాటిట్యూడ్‌లు వచ్చిన తర్వాత వాటన్నిటి ప్రభావమే ప్రవీణ్ చేసింది. ప్రవీణ్ ఒక్కడే కాదు నేరస్తుడు, అతన్ని అలా తయారు చేసిన సమాజం మొత్తం నేరస్థితిలోనే ఉంది. ఇలాంటి వాళ్లు పుట్టడంలో ఏ తప్పు చేయరు. పెరగడంలో, తిరిగే సమాజంలో ఉంటుంది. పిల్లలు పెరిగేది సొసైటీలో తల్లిదండ్రుల చేతిలో కాదు. చేసిన తప్పుకి శిక్ష మాత్రం వెంటనే వేయాలి. రియాక్షన్ వెంటనే ఉండాలి. ప్రాణం తీయడం కాదు భయాన్ని సృష్టించడం ముఖ్యం. అప్పుడే నేరస్తుల సంఖ్య తగ్గుతుంది.
– శిలాలోలిత, కవి

జీవితఖైదు వేయాల్సింది…
ఉరిశిక్షకు వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు జరిగాయి. నిందితుడికి ఉరిశిక్ష వేయడం వల్ల సమస్య తీరిపోదు. శిక్షల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. వాళ్లలో చైతన్యం తీసుకురావడమనేది చాలా ముఖ్యం. మరో సమస్యకు పరిష్కారం ఉరిశిక్ష కాకూడదు. ప్రవీణ్‌కి కఠినమైన శిక్ష విధించాల్సింది. ఈ రోజుల్లో కొంతమంది అఘాయిత్యాలు, అత్యాచారాలకు ఎందుకు పాల్పడుతున్నారు? దీని వెనకాల ఉన్న పరిస్థితులు, కారణాలేంటి? ఈ విషయాలను ఆలోచించగలగాలి. ఇంటర్‌నెట్‌లో రకరకాల వీడియోస్, పోర్నోగ్రఫీ..లాంటివాటికి అడ్డుకట్ట వేయాలి. ఉరిశిక్ష న్యాయపరంగా కరెక్ట్ కావొచ్చు కానీ సామాజికంగా సరైందికాదు. నేరస్తుడు ప్రవీణ్ తాగడం వల్లనే నేరం చేశానంటున్నాడు. దానికి మూల కారణం ఎవరు? మళ్లీ ఈ వైన్ షాపుల వల్లే కదా. ఇలాంటి వాటి వెనకాల ఉన్న సామాజిక కారణాలు చూడకుండా ఉరిశిక్ష వేసి చేతులు దులిపేసుకోవడం దారుణం. అతడికి జీవిత ఖైదీ వేయాల్సింది. అలా చేస్తే జీవితాంతం నరకయాతన అనుభవించేవాడు.

                                                                                          – హేమలత, హైకోర్టు న్యాయవాది

– మల్లీశ్వరి వారణాసి

Death sentence to praveen in 9months old baby rape case

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఉరే పరిష్కారమా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: