నిద్రలోనే ఆహుతి

 Anaz Mandi

 

43 మంది దుర్మరణం
ఢిల్లీ అనాజ్ మండీలో ఘోర అగ్ని ప్రమాదం
అసంఖ్యాక చిన్న పరిశ్రమలు నడుస్తున్న 4 అంతస్థుల భవనంలో తెల్లవారుజామున చెలరేగిన మంటలు
పెక్కుమందికి గాయాలు, 63మందిని కాపాడిన అగ్నిమాపక దళం, మృతులు, క్షతగాత్రులలో ఎక్కువమంది బీహార్, జార్ఖండ్ కార్మికులే
దేశ రాజధానిలో ఉపహార్ ఘటన తర్వాత అతి పెద్ద విషాద ఘటన, భవనంలో కమ్ముకున్న కార్బన్‌మోనాక్సైడ్
సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి

న్యూఢిలీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండీలో జరిగిన ఈ ఘటనలో 43 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉం ది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉం ది. ఈ ఘటనకు సంబంధించి మరో 63 మ ందిని సురక్షితంగా కాపాడారు. ప్రమాద స మాచారం అందుకోగానే అక్కడికి అగ్నిమాపక సిబ్బంది 30 శకటాలతో చేరుకున్నారు. జాతీ య విపత్తు నిర్వహణ దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) వారు కూడా చేరుకుని భారీ స్థాయిలో సహాయ చర్యలు చేపట్టారు. అనాజ్ మండీలోని ఈ బహుళ అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలతో మరో 20 మంది వరకూ చిక్కుపడ్డట్లు అధికారులు తెలిపారు.

ఉత్తర ఢిల్లీలోని ఈ నా లుగు అంతస్తుల ఈ భవనంలో పలు అక్రమమైన, లైసెన్సులు లేని చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఉన్నా యి. వీటిలో స్కూలు బ్యాగులు, సీసాలు, మరికొన్ని రకాల వస్తువులను తయారుచేస్తున్నారని, దేశంలోని ప లు ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు ఇక్కడ పనిచే స్తూ ఈ భవనంలోనే నిద్రపోతుంటారని వెల్లడైంది. ఇక్కడనే బనియన్లు ఇతర దుస్తులు తయారుచేసే ఫ్యాక్టరీ కూడా ఉన్నట్లు గుర్తించారు. తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో కార్మికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలోనే మంటలు చెలరేగాయి. దీనితో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని మహానగర ఉప అగ్నిమాపక దళాధికారి సునీల్ చౌదరి విలేకరులకు తెలిపారు. మృతులు అంతా కూడా ఇక్కడి కుటీర పరిశ్రమలలో పనిచేస్తున్న వారే అని పోలీసులు తెలిపారు. వీరిలో చాలా మంది బీహార్, జార్ఖండ్ వారే అని తెలిసింది. అయితే మృతులు ఎవరు? వారు ఎక్కడి నుంచి వచ్చా రు? అనే వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు.

షార్ట్‌సర్కూట్ వల్లనే మంటలు చెలరేగినట్లు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. కార్మికులు నిద్రలో ఉండటం, మంట లు చుట్టూరా కమ్ముకోవడంతో వారంతా ఉక్కిరిబిక్కిరి అ య్యి, ఊపిరి ఆడక మృతి చెందినట్లు ఓ అధికారి తెలిపా రు. గాయపడ్డ పలువురిలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది వారు కూడా ఉన్నారు. ఢిల్లీలో జరిగిన అతి పెద్ద అగ్ని ప్రమాదాలలో ఇది రెండవ ప్రమాదంగా వెల్లడైంది. 1997 జూన్ 13వ తేదీన నగరంలోని విలాసవంతమైన గ్రీన్‌పార్క్ ప్రాంతంలోని ఉపహార్ థియేటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 59 మంది ప్రేక్షకులు వినోదానికి వచ్చి విషాదాంతం చెందారు. గాయపడ్డ వంద మందికి పైగా ఇప్పటికీ క్షతగాత్రులుగా ఉన్నారు. ఆ తరువాత మంటల్లో అత్యధికులు బలి అయిన ఘటన ఇదే. ఘటనకు సంబంధించి వెనువెంటనే భవనం యజమానిని, కార్యాలయ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు.

రద్దీ ప్రాంతం ..అక్రమ యూనిట్లు
ఇక్కడ నెలకొన్న కుటీర పరిశ్రమలకు ఎటువంటి అనుమతి లేదని, ఎవరూ అధికారుల నుంచి సంబంధిత నో ఆబెజక్షన్ సర్టిఫికెట్లు (ఎన్‌ఒసి) తీసుకోలేదని అధికారులు ఇప్పుడు చెపుతున్నారు. అంతేకాకుండా గంజ్ ప్రాంతం కావడం, ఇరుకైన రాదార్లు, తెల్లవారుజామున కూడా రద్దీ ఉండటంతో సహాయకచర్యలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కిటికీల ఊచలను తొలిగించి అగ్నిమాపక సిబ్బంది వారు భవనంలోపలికి చేరుకోవల్సి వచ్చింది.

భవనం చీకటి కుహరం
రోజువారీ కూలీలు, పనిచేసుకుని బతికే వారు ఉండే ఈ భవనంలో సరైన గాలివెలుతురు లేని దీన స్థితి ఉంది. మంటలు చెలరేగి పొగలు కమ్ముకోవడంతో చాలా మంది శ్వాస తీసుకోలేక కుప్పకూలినట్లు వెల్లడైంది. మృతులను,గాయపడ్డ వారిని స్థానిక రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి (ఆర్‌ఎంఎల్), లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ (ఎల్‌ఎన్‌జెపి), హిందూ రోవా ఆసుపత్రులకు తరలించారు. ఘటన గురించి తెలియగానే ఈ ఆసుపత్రులకు తరలివచ్చిన వందలాది వారి బంధువుల రోదనలతో ఈ ఆసుపత్రుల ఆవరణల్లో హృదయవిదారక దృశ్యాలు చోటుచేసుకున్నాయి.

ఈ భవనంలో అక్రమంగా ఏర్పాటు చేసిన చిన్నచిన్న ఫ్యాక్టరీల యూనిట్లలో దాదాపు 12 నుంచి 15 వరకూ యంత్రాలు ఉన్న ట్లు, ఈ ఫ్యాక్టరీల యాజమాని గురించి వివరాలేమీ తనకు తెలియవని గుర్తు తెలియని ఓ పెద్ద వయస్సు వ్యక్తి ఒకరు అక్కడి విలేకరులకు తెలిపారు. ఈ వ్యక్తి ముగ్గురు మేనల్లుళ్లు ఈ యూనిట్లో పనిచేస్తున్నారు. ప్రమాదం జరిగిందని తెలియగానే ఆయన ఆసుపత్రికి వచ్చారు. ఇద్దరు మేనల్లుళ్లు మెహమ్మద్ ఇమ్రాన్, ఇక్రముద్దిన్ ఈ ఘటన సమయంలో లోపల ఉన్నారని తెలిపారు. వారి పరిస్థితి ఏమిటనేది తనకు తెలియకుండా పోయిందన్నారు.

ఘటనాస్థలిలోనే 34 మంది దుర్మరణం
స్థానిక ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రికి తరలించిన వారిలో 34 మంది అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. దీనితో సంఘటనాస్థలిలోనే వారు అగ్నికి ఆహుతి అయినట్లు వె ల్లడైంది. చాలా మంది ఊపిరాడకనే మృతి చెందినట్లుగా గుర్తించామని, కొందరి శరీరాలు పూర్తిగా కాలిపోయి ఉన్నాయని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్ సింగ్ తెలిపారు. ఇక ఆసుపత్రికి గాయాల స్థితిలో తీసుకువచ్చిన 15 మందిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారికి పాక్షికంగా ఒళ్లు కాలినట్లు గుర్తించారు.

భవనంలోని అంతర్గత లోపంతోనే మంటలు
భవనంలోని విద్యుత్ ఏర్పాట్లలోని లోపాలతోనే మం టలు చెలరేగినట్లు ఢిల్లీ విద్యుత్ సంస్థ బివైపిఎల్ వర్గాలు తెలిపాయి. మంటల గురించి తెలియగానే ఈ ప్రాంతానికి విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు వివరించారు.

దోస్తుల కోసం తల్లడిల్ల్లుతున్న ఇతర కూలీలు
ఇక్కడ కూలీలలో ఎక్కువ మంది యువతరమే అని తెలిసింది. ప్రమాదం గురించి తెలియగానే భవనం వద్దకు, ఆసుపత్రుల వద్దకు పెద్ద ఎత్తున యువకులు చేరుకున్నారు. పనిలేనప్పుడు తాము కలిసి తిరిగేవారమని, మంటలలో తమ స్నేహితులు చనిపోయ్యారని తెలియగానే తల్లడిల్లిపోతున్నామని తమ వారిని తల్చుకుంటూ యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ జరిగేది అక్రమ ఉత్పత్తి అవునో కాదో తెలియదని, అయితే తమకు నాలుగు డబ్బులు వస్తూ ఉండటంతో ఇక్కడనే పనిచేయాల్సి వస్తోందని, పైగా వసతి కూడా ఉండటంతో తమ వారు చాలా మంది పని తరువాత ఇక్కడనే ఉంటారని ఇద్దరు ముగ్గురు యువకులు తెలిపారు.

బిల్డింగ్‌లో హానికరమైన విషవాయువు
మంటలు చెలరేగిన తరువాత చాలా సేపటివరకూ ఈ భవనంలో అత్యంత ప్రమాదకరమైన విషపూరిత కార్బన్ మోనాక్సైడ్ కమ్ముకుని ఉంది. ఈ విషయాన్ని ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం తమ పరిశీలనలో కనుగొంది. ఈ విషవాయువును తాము గుర్తించినట్లు దీనితోనే పలువురు ఊపిరాడక మృతి చెందారని అనుమానిస్తున్నట్లు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద భవనం వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చిన తరువాత ఎన్‌డిఆర్‌ఎఫ్ వారు ఈ భవంతిలో సోదాలు జరిపారు. ఈ క్రమంలో ఈ విషవాయువు కమ్ముకుని ఉన్నట్లు వెల్లడైందని ఎన్‌డిఆర్‌ఎఫ్ ఉప దళాధిపతి ఆదిత్య ప్రతాప్ సింగ్ తెలిపారు. గ్యాస్, చమురు, బొగ్గు, చెక్కలు పూర్తి స్థాయిలో కాలకుండా ఉండే స్థితిలో ఈ విషవాయువులు వ్యాపిస్తాయి. అంతేకాకుండా భవనంలోని కొన్ని కిటికీలను సీల్ చేసి ఉంచినట్లుగా గుర్తించామని చెప్పారు. కార్మికులు నిద్రిస్తున్న ఒక గదిలో గాలికోసం ఒకే ఒక్క ఏర్పాటు ఉందని, భవనంలో ఉన్న సరుకు అంటుకుని విషవాయువులు ఈ గదిలో నిండుకోవడంతో పలువురు మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు.

11మందిని కాపాడి గాయపడ్డ ఫైర్‌మెన్
ప్రమాదం గురించి తెలియగానే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బందిలో ముందుగా నాలుగో అంతస్తుకు చేరుకున్న ఫైర్‌మెన్ రాజేష్ శుక్లా 11 మందిని మంటల నుంచి రక్షించాడు. ఈ క్రమంలో ఆయన కాళ్లకు గాయాలు అయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శుక్లాను ఢిల్లీ హోం మంత్రి సత్యేంద్ర జైన్ పరామర్శించారు. జైన్ రియల్ హీరో అని కొనియాడారు. ఎముకలు దెబ్బతిన్నా ఆయన చివరి వరకూ విధి నిర్వహణలోనే ఉన్నారని తెలిపారు.

మామ కోసం, బావమరిది కోసం
తన మామ 56 ఏండ్ల జసీముద్దిన్ , పాతికేళ్ల బావమరిది ఫైసాఖ్ ఖాన్ బట్టల ఫ్యాక్టరీలో పనిచేస్తారని, మంటలు అంటుకున్నాయని తెలిసి వారి గురించి ఆసుపత్రికి వచ్చామని 40 ఏండ్ల తాజ్ అహ్మద్ చెప్పారు. వారి పరిస్థితి ఏమిటనేది తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ దూరపు సోదరులు ఇమ్రాన్, ఇక్రమ్‌లు చేతి సంచుల తయారీలో ఉన్నారని, వారి పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదని అసిఫ్ అనే యువకుడు తెలిపారు. తెల్లవారుజామునే తనకు ఫోన్ వచ్చిందని ప్రమాదం గురించి తెలియగానే భవనం వద్దకు తరువాత ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నానని చెప్పారు. ఇక 23 ఏండ్ల మనోజ్ అనే యువకుడు తన తమ్ముడు నవీన్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడని, గాయపడ్డట్లు తెలిసిందని, అయితే ఇంతవరకూ ఆయన జాడ తెలియలేదని ఏడుస్తూ చెప్పారు.

ప్రధాని సంతాపం.. రూ 2 లక్షల పరిహారం
ఢిల్లీలో జరిగిన ప్రమాదం తనకు దిగ్భ్రాంతి కల్గించిందని ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఇదో భయానక ఘటనగా ప్రధాని పేర్కొన్నారని పిఎంఒ ఒక ప్రకటన వెలువరించింది. మృతుల సమీపబంధువులకు రెండు లక్షల రూపాయల పరిహారం, గాయపడ్డ వారికి రూ 50వేల చొప్పున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి తరఫున ప్రకటించినట్లు తెలిపారు.

ఘటనపై దర్యాప్తు ః ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలు
ఈ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు వెలువరించింది. ఘటనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బాధితుల కుటంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఏడు రోజులలో నివేదిక అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. ఘటనపై కాంగ్రెస్ నాయకులు సోనియా , రాహుల్, ప్రియాంక గాంధీలు సంతాపం వ్యక్తం చేశారు. పంజాబ్ సిఎం అమరీందర్ సింగ్ స్పందిస్తూ ఈ ఘటన తనను కదిలించివేసిందన్నారు. ఇది అత్యంత విషాదకర ఘటన అని , బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నానని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.

రాజకీయ హడావిడి, ఆప్ బిజెపి ఎదురుదాడులు
ఢిల్లీ ఘటన జరిగిన వెంటనే తెల్లవారుజాము నుంచే ఆసుపత్రి వద్దకు, మండి ప్రాంతానికి ఉరుకులు పరుగుల మీద పలు పార్టీల రాజకీయ నేతలు చేరుకున్నారు. బాధితులను పరామర్శించేందుకు వారంతా రావడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడింది. పోటాపోటీగా బిజెపి, ఆప్ నేతలు ఒక కేంద్రమంత్రి, ఢిల్లీ రాష్ట్రమంత్రులు పలువురు అక్కడికి చేరారు. దీనితో చాలా సేపు అక్కడ గందరగోళం నెలకొంది. అయితే పోలీసులు చాలా మందిని నిలిపివేశారు. సహాయక చర్యలు వేగవంతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని బిజెపి నేతలు ఆరోపించారు. అయితే తమ అధికారాలను తరచూ అడ్డుకుంటున్నందు వల్లనే తామేమీ చేయలేకపోతున్నట్లు బిజెపిపై ఆప్ నేతలు మండిపడ్డారు.

Deadly fire in Delhi’s Anaz Mandi

The post నిద్రలోనే ఆహుతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.