అత్యంత హేయం!

ధర్మయుద్ధంలో గెలిచే సత్తా లోపించిన వారే అధర్మ పద్ధతులను పాటిస్తారు. హేతుబద్ధ వాదన అడుగంటిన వారే బురద చల్లుడు నిర్వాకానికి తలపడతారు. 17వ లోక్‌సభకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధ ప్రచారం పాలు దారుణంగా తగ్గిపోయి అప్రజాస్వామిక ధోరణులదే పైచేయి అయిపోయింది. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారానికి తాము చేయబోతున్నదేమిటో వివరించడం ద్వారా ఓటును అర్థించే పద్ధతికి స్వస్తి చెప్పారు. అందుకు బదులుగా ప్రత్యర్థులపై నీచ నిందారోపణలకు, తప్పుడు ప్రచారానికి ఒడిగడుతున్నారు. ఈ […] The post అత్యంత హేయం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ధర్మయుద్ధంలో గెలిచే సత్తా లోపించిన వారే అధర్మ పద్ధతులను పాటిస్తారు. హేతుబద్ధ వాదన అడుగంటిన వారే బురద చల్లుడు నిర్వాకానికి తలపడతారు. 17వ లోక్‌సభకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధ ప్రచారం పాలు దారుణంగా తగ్గిపోయి అప్రజాస్వామిక ధోరణులదే పైచేయి అయిపోయింది. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారానికి తాము చేయబోతున్నదేమిటో వివరించడం ద్వారా ఓటును అర్థించే పద్ధతికి స్వస్తి చెప్పారు. అందుకు బదులుగా ప్రత్యర్థులపై నీచ నిందారోపణలకు, తప్పుడు ప్రచారానికి ఒడిగడుతున్నారు. ఈ క్రమంలో అత్యంత హేయమైనదిగా పరిగణించి తీరవలసిన అమానుష, అనైతిక ప్రచారం తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆప్ తరపున పోటీలో గల మహిళా అభ్యర్థి అతిషిపై జరిగింది. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరపున మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పోటీ చేస్తున్నారు. తన మీద నీచాతినీచమైన వ్యక్తిగత ఆరోపణలున్న లక్షలాది కరపత్రాలను నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలలో పంచిపెట్టారని అతిషి గురువారం నాడు ఏర్పాటు చేసిన మీడియా గోష్ఠిలో మొరపెట్టుకున్నారు.

వాటిని చదివి వినిపిస్తూ ఆమె రెండుసార్లు కన్నీటి పర్యంతమయ్యారు. తాను వ్యభిచారినని, గొడ్డు మాంసం తింటానని, తనది సంకర పుట్టుక అని వగైరా ఆరోపణలు ఆ కరపత్రంలో ఉన్నాయని ఆమె చెప్పుకున్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ శిశోడియాతో తనకు లైంగిక సంబంధాలున్నాయని కూడా కరపత్రంలో బురద చల్లారని ఆమె వెల్లడించారు. ఆప్, కాంగ్రెస్ కలిసినా ఢిల్లీలో ఒక్క సీటు కూడా గెలుచుకోబోవని కరపత్రం చివర రాసినట్టు పేర్కొన్నారు. బిజెపి ప్రత్యర్థి గంభీర్ సృష్టించినదే ఈ కరపత్రమని ఆమె నేరుగా ఆరోపించారు. గంభీర్ దీనిని త్రోసిపుచ్చారు. రుజువు చేస్తే అభ్యర్థిత్వం నుంచి తక్షణం తప్పుకుంటానని లేకపోతే అతిషి రాజకీయాలనుంచి వైదొలుగుతారా అని సవాలు విసిరారు. ఊరు, పేరు, సంతకం, చిరునామా లేకుండా, ఒకవేళ ఉన్నా అవి నకిలీవయ్యే అవకాశాలే ఎక్కువగా ఉండే ఇటువంటి కరపత్రాల బాధ్యత నుంచి తప్పుకోడం సుళువే. అందుచేత ఈ నీతి మాలిన కరపత్రాన్ని ప్రచురించింది, పంపిణీ చేయించింది ఫలానా వ్యక్తి లేదా సంస్థ అని చెప్పడం సులభసాధ్యం కాదు. లోతైన దర్యాప్తులోగాని అవి నిర్ధారణ కావు. ఆ దర్యాప్తు గౌతమ్ గంభీర్ వద్దనే ఆగుతుందని చెప్పలేము.

ఏ అనామకుల చేతనో ఈ కరపత్రాన్ని తయారు చేయించి పంచిపెట్టి ఉండవచ్చు. అయితే అతిషిని నైతికంగా దెబ్బతీసి, ఓటర్లలో చులకనపరిచి, ఓడించాలని ఆశించే వారే ఈ నీచ కరపత్రాన్ని సృష్టించి ఉండవచ్చని భావించడానికి వెనుకాడవలసిన పని లేదు. అతిషి ఎన్నిక తథ్యమనే అభిప్రాయం కలిగి ఓడించడానికి వేరే మార్గం లేక ఈ కరపత్రాన్ని ప్రత్యర్థులు సృష్టించి ఉండవచ్చు. ఈ దృష్టితో చూసినప్పుడు అనుమానపు ముల్లు నేరుగా బిజెపి పార్టీపై కేంద్రీకృతం కావడం సహజం. ఇందులో గంభీర్ ప్రత్యక్ష పాత్ర లేకపోయినా ఆశ్చర్యపడవలసిన పని లేదు. మహిళలపై లైంగికాది వ్యక్తిగత ఆరోపణలతో కూడిన దాడులు జరిగినప్పుడు అవ్యవధిగా, తక్షణమే తగు చర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రజాస్వామిక ప్రభుత్వాల యంత్రాంగాల మీద, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ మీద ఉంటుంది. అతిషిపై కరపత్రాల విషయంలో ఢిల్లీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఉండవలసింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేశారో లేదో తెలియజేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ పోలీసులకు నోటీసు ఇచ్చింది.

కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రేగాని, అక్కడున్నది ఆప్ ప్రభుత్వమేగాని వారి అదుపాజ్ఞల్లో అక్కడి పోలీసులుండరు. లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో ఉంటారు. గవర్నర్ కేంద్రంలోని బిజెపి పాలకుల చెప్పు చేతల్లో ఉండి వారు చెప్పినట్టే నడుచుకుంటారని గతంలో పలు సందర్భాల్లో రుజువైంది. అందుచేత ఈ కేసులో పోలీసు దర్యాప్తు సవ్యంగా జరుగుతుందనే భరోసాకు ఆస్కారం లేదు. ప్రజాస్వామ్యంలో స్త్రీ పురుష సమానత్వాన్ని సుస్థాపితం చేసి కాపాడవలసి ఉంది. హైందవ మత ఉదోధలు సైతం స్త్రీని గౌరవప్రదంగా పేర్కొంటాయి. శక్తి స్వరూపిణిగా, పూజనీయురాలుగా పరిగణిస్తాయి. వాస్తవంలో భారత దేశంలో ఆమె పరిస్థితి అతి దయనీయం. ఇంటా బయటా ఆమెది పురుషుడి తర్వాతి స్థానమే, అతడు శాసించేటట్టు నడుచుకొని తీరవలసిన స్థితే. చదువుకోసమో, ఉద్యోగానికో, రాజకీయాల్లో పోటీపడేందుకో ఇల్లు విడిచి బయట అడుగుపెట్టే మహిళను అతి హేయమైన ఆరోపణలతో, గుసగుసలతో భయపెట్టి కుంగదీసి తిరిగి నాలుగ్గోడల మధ్యకు నెట్టివేసే దుర్మార్గం ఎదురులేకుండా సాగిపోతున్న సమాజం మనది. ఇటువంటి దాడులను మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలేగాని కంట తడి పెట్టకూడదు.

DCW Issues Notice to Delhi Police Over Pamphlets

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అత్యంత హేయం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: