ఆదర్శనీయంగా అంగన్‌వాడీలు

AnganWadi

బంగారు తెలంగాణ సాకారం కావడంలో వేస్తున్న అడుగులు వడివడిగా ముందుకు సాగుతున్నాయి. మాతా శిశు సంరక్షణ మొదలుకొని, కేజి టు పీజి విద్య దాకా తొలి అడుగులు బలంగా పడ్డాయి. ఐదో తరగతి నుండి గురుకుల పాఠశాలల్లో ప్రవేశం లభిస్తున్నది. అనగా తొమ్మిదేళ్ళ దాకా పిల్లలు తల్లిదండ్రుల వద్దే ఉండాలని ఉన్నత న్యాయస్థానం భావించడం వల్ల గురుకుల పాఠశాలల్లో ఒకటో తరగతి నుండి తీసుకోవడం వీలు కావడం లేదు. గతంలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు కొన్ని నడిచాయి. ఉన్నత న్యాయస్థానం తీర్పు ఒక కారణం కావచ్చు. అందువల్ల కేజి టు పీజి విద్య అందించడానికి ఐదవ తరగతి దాకా కొన్ని నూతన మార్గాలను అధ్యయనం చేయాల్సి ఉన్నది. ఇతర దేశాల అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నది. అలాగే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటో తరగతి నుండి పిల్లల్ని చేర్చుకుంటున్న విధానాన్ని ప్రైవేటు ప్రినర్సరీ, నర్సరీ, ఎల్‌కేజీ, యుకేజీ, ఒకటో తరగతి విధానాలను పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటినీ ఒక సమగ్రతలో పరిశీలించి నూతన ప్రణాళికను రూపొందించుకోవడం కోసం అనేక అనుభవాలను కలబోసుకోవాల్సిన అవసరం ఉంది.
మన దేశంలో వలెనే అమెరికాలో డేకేర్ సెంటర్లు ఉంటాయి. నర్సరీ స్కూళ్ళు ఉంటాయి. ఇవి ఎక్కడికక్కడ ప్రయివేటుగా నడుస్తుంటాయి. ఇవి నడపడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన వారికే అనుమతులిస్తారు. పదవ తరగతి తర్వాత లేదా పన్నెండవ తరగతి తర్వాత రెండేళ్ళ పాటు ప్రత్యేక శిక్షణ కోర్సు ఉంటుంది. ఆ కోర్సు ఒక తల్లికి, ఒక పిల్లల డాక్టరుకు, ఒక ఆయాకు, ఒక టీచర్‌కు అవసరమైన సిలబస్ కలిసి ఉంటుంది. అక్కడ డేకేర్ సెంటర్లలో పూటకు ఇంత, వారానికి ఇంత అని ఫీజు ఉంటుంది. నాలుగు గంటలకు తీసుకువెళ్దామని, తీసుకువెళ్ళకపోతే ఆ తర్వాత గంట గంటకు పెనాల్టీ ఉంటుంది. పిల్లలు కలిసి ఉండడంలో సంక్రమించే బాలారిష్టాలు, వ్యాధులు, కొట్లాటలు, ఒకే వస్తువు కోసం పోట్లాడుకోవడం వంటి వాటిని ఎలా ప్రేమపూరితంగా సర్దుబాటు చేయాలో చూసి తీరవలసిందే. అమెరికాలో ఎవరిని గట్టిగా మాట అనకూడదు. అసలు గట్టిగా తేరిపార చూడ్డానికి కూడా వీలు లేదు. తేరిపార చూస్తే కేసు పెట్టవచ్చు. పిల్లల్ని ముట్టుకోకూడదు. మనం ఇండియాలో పిల్లల్ని ఎత్తుకోవడం, ముద్దు చేయడం చేస్తుంటాము. అక్కడ ఇవి నిషిద్ధం. దూరం నుంచే పలకరింపులు.
అమెరికాలోని డేకేర్ సెంటర్లను, నర్సరీలను చూసిన తర్వాత మన దగ్గర నడిచే అంగన్‌వాడీలపై దృష్టి పెరిగింది. నగరాల్లో, పట్టణాల్లో డేకేర్ సెంటర్లో నర్సరీలు కొంత మెరుగ్గానే ఉంటాయి. ప్రభుత్వం ద్వారా నడిపిస్తున్న అంగన్‌వాడీలు ఇటీవలి కాలం దాకా తక్కువ జీతాలతో నైపుణ్యం తాలూకు శిక్షణలు లేకుండానే కొనసాగుతూ వచ్చాయి. ఇటీవల అంగన్‌వాడి టీచర్ల జీత భత్యాలు పెరిగాయి. వారి విద్యార్హతలు పెరగలేదు. ఉన్నవారిని తొలగించడం సాధ్యం కాకపోవచ్చు. ఉన్నవారికే మంచి శిక్షణ, నైపుణ్యాలు నేర్పడం అవసరం. సదువు రాని తల్లులు ఎందరో పిల్లలను మహనీయులుగా తీర్చిదిద్దారు. ఎందరో మహనీయుల తల్లిదండ్రులు పెద్దగా చదువుకున్నవారేమీ కాదు. అందువల్ల పెద్దగా చదువు రాకపోయినా అంగన్‌వాడీ టీచర్లను చక్కని టీచర్లుగా శిక్షణ ఇచ్చి ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడం సాధ్యమే.
చిన్నారుల ఉజ్జ్వల భవిష్యత్‌కు బాటలు వేయడంలో కొన్ని డేకేర్ సెంటర్లు ఏమాత్రం తీసిపోవడం లేదు. ఇంగ్లీషు విద్యా విధానంలో బోధిస్తూ, పౌష్ఠిక ఆహారం అందిస్తూ డేకేర్ సెంటర్లుగా అంగన్‌వాడీ కేంద్రాలు వెలుగొందుతున్నాయి. ఇంటి దగ్గర సరియైన పౌష్టిక ఆహారం అందక బలహీనంగా ఉంటున్న పిల్లలకు ఈ డేకేర్ సెంటర్లు ఎంతో ఉపకరిస్తున్నాయి. అంగన్‌వాడీ సెంటర్లను ఇంకా మంచి డేకేర్ సెంటర్, నర్సరీలుగా తీర్చిదిద్దడం అవసరం. చక్కని పౌష్టికాహారం కూడా పిల్లలకు అందేట్టు చూడడం అవసరం. గర్భస్థ శిశువు నుండి కాబోయే తల్లి నుండి, మాతా శిశు సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కేసీఆర్ కిట్ తదితర ప్రోత్సాహకాలను అందిస్తున్నది. అదే క్రమంలో ఒకటో తరగతి వెళ్ళేదాకా ఐదేళ్ళపాటు పిల్లలను అంగన్‌వాడీలో నర్సరీ, ఎల్‌కేజీ, యుకేజీ స్కూల్ల చక్కని క్రమశిక్షణ పోషకాహారం, ఆటలు, పాటలు నేర్పడం ఎంతో అవసరం.
అమెరికాలో 12వ తరగతి దాకా ఉచిత విద్య. అన్ని ప్రభుత్వ పాఠశాలలే. పిల్లలను జాతి సంపదగా చూస్తారు. ఏ ఏరియాలో నివసిస్తున్నారో ఆ ఏరియాలోని పాఠశాలలో మాత్రమే చదువుకోవాల్సి ఉంటుంది. సిడి, డివిడి, వీడియో, కంప్యూటర్లతోపాటు వేలాది గ్రంథాలతో కూడిన గ్రంథాలయాలు ప్రతిచోటా ఉంటా యి. మూడేళ్ళ పిల్లలనుండి తొంభైయేళ్ల వృద్ధుల దాకా లైబ్రరీలకు వస్తుంటారు. సినిమాల వీడియో క్యాసెట్లు కూడా లైబ్రరీలో పుస్తకాల్లాగా ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. ప్రతి నెలా విడుదలయ్యే కొత్త పుస్తకాలు అదే నెలలో లైబ్రరీలకు తెప్పిస్తుంటారు. మన దగ్గర కొత్త పుస్తకం లైబ్రరీకి రావడానికి ఏడాది, రెండు నెలలు పడుతుంది.
అమెరికాలో పిల్లల అలవాట్ల, సంస్కృతి నేర్పడానికి, నేర్చుకోవడానికి ప్రత్యేకంగా వీడియోలు, టీవీ ఛానళ్ళు ఉన్నాయి. చెప్పులు ఎక్కడ విడవాలి. ఎలా విడవాలి. బట్టలు ఎలా వేసుకోవాలి. స్నానం ఎలా చేయాలి. ఎలా టాయిలెట్‌కి పోవాలి. ఇతర పిల్లలతో ఎలా ఉండాలి. ఆట వస్తువులతో ఎలా ఉండాలి. పెద్దలతో ఎలా ఉండాలి. కుక్కలు, పిల్లులతో ఎలా ఉండాలి. ఆట పాటలు ఎలా ఆడుకోవాలి. మొదలైనవన్నీ రేడియోల్లో, టివి ఛానల్లో చూపిస్తుంటారు. మన దగ్గర కూడా ఇంటర్నెట్ వచ్చేసింది. సిటి కేబుల్స్ వచ్చేశాయి. అమెరికాతో సమానంగా సమాచారం, ప్రసార సాధనాలు, ఛానళ్ళు విస్తరిస్తూనే ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో అమెరికా తరహాలో కొన్ని అమలు జరుపుతున్నారు. అలాంటి స్కూళ్ళల్లో చదివించడానికి లక్షలు ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. అలా కాకుండా, పేదల పిల్లలు కూడా అలా చక్కగా ఎదగడానికి ఆరోగ్యంగా పౌష్టిక ఆహారంతో ఎదగడానికి అనుగుణంగా అంగన్‌వాడీలను తీర్చిదిద్దడం అవసరం.
అలాగే పిల్లలకు, పెద్దలకు ఆయా సీజన్లలో వచ్చే వ్యాధులు, నీళ్ళ ద్వారా, గాలి ద్వారా, ఈగలు, దోమల ద్వారా, అంటువ్యాధులు సంక్రమిస్తుంటాయి. వీటిపట్ల పిల్లలకు, తల్లులకు, తండ్రులకు జాగ్రత్తలు చెప్పే ప్రత్యేక సాయంకాల శిక్షణా తరగతులు అవసరం. పరిశుభ్రత విషయంలో ఐక్యరాజ్యసమితి రూపొందించిన ప్రణాళికలను పూర్తి స్థాయిలో అమలు జరిపితే ఆరోగ్యాలు బాగుంటాయి. వైద్యానికి పెట్టే ఖర్చు బాగా తగ్గిపోతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
మిషన్ భగీరథకు ఇప్పుడు ఇంటింటికి రక్షిత మంచి నీరు అందుతున్నది. అందనున్నది. రూపాయికి కిలో బియ్యం అందుతున్నాయి. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు రెండు వేల పదహారు రూపాయలు అందుతున్నాయి. వికలాంగులకు, బోధకాల వారికి, ఎయిడ్స్ బాధితులకు మూడు వేల పదహారు రూపాయలు అందుతున్నాయి. మాతా శిశు సంరక్షణకు కెసిఆర్ కిట్ అందించబడుతున్నది. బతుకమ్మ చీరలు వగైరా ఇన్‌సెంటివ్స్ ద్వారా ప్రభుత్వం మేమున్నామని నైతికంగా మద్దతు ఇస్తున్నది.
సాగు నీరు, తాగు నీరు అందిస్తున్నది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మురుగు నీటి వ్యవస్థను ప్రక్షాళన చేసుకొని ఈగలు, దోమలు లేకుండా, అంటువ్యాధులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. ఇంటివలెనే వీధులను, పెంట కుప్పలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఖచ్చితంగా మరుగుదొడ్లలోనే కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఆ సంస్కృతిని అలవాటు కానంతవరకు సీజనల్ వ్యాధులు వస్తూనే ఉంటాయని అర్థం చేయించాలి. అవి మూఢ నమ్మకాలతో కారణభూతమవుతున్నాయి.
గ్రామీణ ఆరోగ్యం, మురికివాడల ఆరోగ్యం, మాతాశిశు సంరక్షణ, అంగన్‌వాడీ, నర్సరీ పరిసరాల పరిశుభ్రత మొదలైన వాటి గురించి ఒక సమగ్రమైన సింగిల్ విండో విధానం, సింగిల్ విండో ప్రభుత్వ శాఖ ఎంతో ఉపయోగకరం. మహిళా శిశు సంక్షేమ శాఖ, డ్వాక్రా పొదుపు సంఘాలు స్వయం ఉపాధి కల్పన, గ్రామీణ కుటీర పరిశ్రమలు, చేతి వృత్తులు, కులవృత్తులు వంటి ఆధునీకరణ, ఉపాధి కల్పన, మొదలైనవన్నీ కలిపి ఒకే శాఖగా రూపొందించి సింగిల్ విండో విధానం ప్రవేశపెడితే ఎలా ఉంటుందో గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి దాకా చర్చలు, సెమినార్లు, అనుభవాల కలబోత ఎంతైనా అవసరం. వరంగల్ జిల్లాలోని ఆదర్శగ్రామమైన గంగదేవిపల్లెను ఒక నమూనాగా తీసుకొని అన్ని గ్రామాల్లో అనుసరించే ప్రయత్నం గురించి కూడా పరిశీలించడం అవసరం.

daycare centers in telangana

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆదర్శనీయంగా అంగన్‌వాడీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.