దళితుల దీనజీవన కథలు

ఎవడు అంటరానివాడు, శ్రమటోడ్చి పొలాలను (చేనులను) దున్ని మనకు అన్నంపెట్టేవాడా! మన చేన్లకు నీళ్లను అందించే నీరటికాడా? అంటరాని వాడు. చరిత్ర ఎప్పుడు ఉన్నవాడి చుట్టే తిరుగుతుంది. ఉన్నవాడెప్పుడు కష్టం చేయడు, కష్టం చేసేవాడు నోటిలో “బుక్క”కు నోచుకోడు. ఇది తరతరాలుగా జరుగుతున్నది. హిందూ సమాజంలోని నిచ్చెనమెట్ల కులాలు, ఆ కులాలలోని అగ్రవర్ణాలు మాల, మాదిగలను ఎంత హీనంగా చూస్తున్నారో! వారే సమాజాన్ని నిర్మిస్తున్నారనే విషయం మరిచిపోతున్నారు. “ఎట్టి” కథా రచయిత బి. దామోదర్‌రావు తెలంగాణ ప్రాంతంలో […]

ఎవడు అంటరానివాడు, శ్రమటోడ్చి పొలాలను (చేనులను) దున్ని మనకు అన్నంపెట్టేవాడా! మన చేన్లకు నీళ్లను అందించే నీరటికాడా? అంటరాని వాడు. చరిత్ర ఎప్పుడు ఉన్నవాడి చుట్టే తిరుగుతుంది. ఉన్నవాడెప్పుడు కష్టం చేయడు, కష్టం చేసేవాడు నోటిలో “బుక్క”కు నోచుకోడు. ఇది తరతరాలుగా జరుగుతున్నది. హిందూ సమాజంలోని నిచ్చెనమెట్ల కులాలు, ఆ కులాలలోని అగ్రవర్ణాలు మాల, మాదిగలను ఎంత హీనంగా చూస్తున్నారో! వారే సమాజాన్ని నిర్మిస్తున్నారనే విషయం మరిచిపోతున్నారు. “ఎట్టి” కథా రచయిత బి. దామోదర్‌రావు తెలంగాణ ప్రాంతంలో దొరల దౌర్జన్యాలు, అణగారిన వారి పైన కాకుండా ఇంకా అట్టడుగుస్థాయిలో బ్రతుక లేని వారిపై ఎలా కొనసాగిందో చూపెట్టాడు ఎట్టి అంటే ఫలితం లేని శ్రమ, దొరలు మాల, మాదిగలనే కాకుండా వృత్తి కులాలైన వడ్ల, కమ్మరి, కుమ్మరి, గొల్ల, అవుసుల, సాలె, సబ్బండ కులాలతో ఎట్టి చేయించుకునేవారు అనేది అక్షరసత్యం. ఈ కథలో, రచయిత దొరలోని దుర్మార్గపుతత్వాన్ని కండ్లకు కట్టినట్టుగా చూపెట్టాడు.
రాజడు దొరపాలేరు , బాంచెను దొర అన్నందుకు ఏందిరా లమ్డికే నెత్తిల తిరుగుతుందా! అన్న మాట ఇది, ఆనాటి దొరలు దళితులు పాలేర్ల పట్ల చూసే తీరు. సరేగాని ఊరవతల బిచ్చగాళ్ల వద్దకు పోయి ఇంటికి ఐదు చాపలు పట్టుకురమ్మన్నాడు. మన చిన్న దొరసాని పెండ్లి కదరా! గందుకే అన్నడు. రాజని మనసు చివుక్కుమన్నది. ఎంత దిగజారిండు దొర అనుకున్నడు. దొర బుద్ది పాడు బుద్ది అందరికి తెలుసు. రాజనికి కొత్తగా పెండ్లి అయినపుడు వాని భార్యను చూపెడుతే ఎట్లనో చూచిండు పాపిష్టికండ్లు అనుకున్నడు.

దొర గింత దిగజారుతడనుకోలేదు అనుకున్నాడు. రాజడు, బిచ్చగాళ్ల గుడిసెలకు పోయి ఐదు చొప్పున చాపలు తీసుకున్నాడు చివరగా పోచయ్య గుడిసె దగ్గరకు పోయి చాపలు అడిగాడు. పోచయ్య రాజనితో నా కొడుకు ఇస్తారి గారికి నాలుగైదు రోజులాయె జరం వస్తుంది. ఈ మూడు చాపలు అమ్మితె వచ్చే పైకంతోని దవఖానల చూపిస్తనంటుండు. రాజని మనసు బాధ పడ్డది గాని ఏం లాభం దొర గుణం పాడుది అనుకున్నాడు. సరే నీయిష్టం దొర మంచోడు కాదన్నాడు . అక్కడి నుండి పోయి దొరకు చెప్పిండు పోచన్ని తీసుకురాపో “లంజకొడుక్కు” మదమెక్కింది అన్నడు. సుంకరోల్లు ,రాజయ్య కలిసి పోచిగాన్ని దొర వద్దకు తీసుకు వచ్చారు. దొర కోపంతో ఎంత బలుపురా, దొర అడుగితే కాదంటావా! తెల్లారె సరికి ఊరిడిచి పోవాలె అని హుకుం జారీ చేశాడు. పోచయ్య ఆని పెండ్లం రాజి గుడిసెనంత ఇప్పి కట్టిండు, ఒక్కగానొక్క కొడుకు ఇస్తారి పానం ఇడిసిండు. వాని శవాన్ని భుజంపై వేసుకున్నాడు. వాళ్ళు పోచయ్య, రాజి ఊరిడిసిండ్రు. దొర “బరాత్‌” మొదలైంది. పరిసిన చాపలు తీస్తున్నారు. పోచయ్యకు దొర పాదాలు ఛాతిలో తాకినట్లుగా ఉంది. గిది పాడులోకం అనుకున్నాడు.

కడుపుతీరా ఏడ్చిండు పోచయ్య, రాజి ఏడ్చింది. ఏడికిపోదామే ! ఎట్టిలేని ఏట్లోకి “ థూ ” లోకం పాడుగాను అనుకుంటు లేచిండు. ఈ కథలో రచయిత ఆనాటి సమాజంలో ఎట్టి పేరుతో ఎలా సామాన్యులను పీల్చి పిప్పిచేసేవారు, చివరికి బిచ్చగాడైన పోచయ్యను కూడ వదలని దొరల వక్రబుద్దిని చక్కగా చూపెట్టాడు. వెట్టి మాదిగ (కథ) అజ్ఞాతవాసి భాగ్యరెడ్డి వర్మ 1932లో రచించినట్లుగా తెలుస్తున్నది. ఈ కథ అంటరాని మాదిగల స్థితిగతులను తెలియజేస్తుంది. రామిరెడ్డి భూస్వామి గ్రామంలో అతనికి ఎదురు లేదు. రెడ్డి కులమున జన్మించిన పోలీసు పటేల్ అతడు నిరంకుశానికి నిదర్శనం. ఆనాటి సమాజంలో గ్రామంలో పోలీసుపటేల్, మాలీపటేల్, పట్వారీ, దొరలు కలిసి పరిపాలించేవారు. వీరి చెప్పు చేతుల్లోనే గ్రామపాలన సాగేది. ఈ కథా రచనలో రచయిత తను ఆనాటి విషయాలను చెప్పుతూనే ముగించాడు. పాత్రోచితంగా కాకుండా, పాత్ర గుణస్వభావాలను ఆనాటి పటేండ్ల దుర్మార్గాలను, తెచ్చిపెట్టుకున్న అధికారాలను ఎత్తి చూపాడు.

రామిరెడ్డి పాత్ర క్రూర స్వభావము కలిగినది. ఇతడు గ్రామములో ఒకరికి మరొకరికి కలువనీయడు, కలహములు పెట్టి పోట్లాటలు రగిలిస్తాడు. అతడంటే గ్రామములో అందరూ భయపడతారు. రామిరెడ్డికి ఒకరోజు అతని బంధువుతో పని బడి ఉత్తరము పంపవలెననేది అతని కోరిక ఇందులకై తలారిని పంపి మాదిగ వానిని పిలుచుక రమ్మంటాడు. మాదిగవాడు తక్షణం రావడానికి నిరాకరిస్తాడు. రామిరెడ్డికి ఈ విషయం తలారి చెప్పగానే క్రోధుడై మాదిగ వానిని పట్టుకరాలేకపోయావా అంటూ చితకబాదుతాడు. తలారి దారి పట్టెను పటేలులో కోపము ఆవహించినది. మాదిగలకు కండ్లు నెత్తికెక్కుతున్నవి. కాలము మారుతుంది. ఈసారి వీరి మాన్యము జప్తు చేయిస్తానంటాడు. మాదిగ మల్లడిలో బతుకు ఆలోచన కలిగినది. గింజలు చేతికి వచ్చిన సమయం. ఈ సమయంలో పటేలింటికి వెట్టికి పోతే బ్రతికేదెట్లా ననుకొని పటేలును బ్రతిమాలుకుందామనుకుంటాడు. ఈ సమయంలోనే తలారి వస్తాడు. తలారి వెంట వెల్తాడు పటేలు మాదిగ మల్లన్ని విపరీతంగా కొడతాడు. వాడు దెబ్బలు తాళలేక పోతాడు. స్పృహతప్పి పోతాడు. వాడిని సేవకులతో యింటికి పంపిస్తాడు. వాడు దెబ్బలకు అనారోగ్యానికి గురౌతాడు. రామిరెడ్డి పటేలు వాడిని మందలించలేదు. ఈ కథలో రామిరెడ్డి ఎంతటి పాపాత్ముడో చూపెట్టాడు. ఆ కాలంలో పటేండ్ల దౌర్జన్యాన్ని కన్నులకు కట్టినట్లుగా చిత్రించినాడు. ఈ కథలో పాత్రలున్నా రచయితనే చెప్పడం కన్పిస్తుంది.

“ మావూరి ముచ్చట్లు ” కథ నల్లాల లక్ష్మీరాజం రచించాడు. ఈయన కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతానికి చెందినవాడు. ప్రస్తుతం పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ కథలో రచయిత గ్రామములోని మాదిగలు, దొరలకు పాలేర్లుండటం వంటి విషయాలను ప్రస్తావించాడు. పాలేరుపెండ్లాం మంచిగుంటే పాపమేనాయే. పటేండ్ల కండ్లు పడ్తె వదిలిపెడ్తారా? అనే విషయాన్ని పాత్రోచితంగా చిత్రించినారు. “బగ్గ” బలిసిన పటేండ్లు పాలేరు పెండ్లాంతో అక్రమ సంబంధం పెట్టుకుంటే, పటేలు పెండ్లాం పాలేరుతో పెట్టుకునే అక్రమ సంబంధం గూర్చి చర్చించాడు. చరిత్రంతా కామంతోనే ఆడ, మగ సంబంధాలతోనే కలుషితం కావడం లేదా? పటేలుకు పుట్టినవాడు పాలేరు, పాలేరుకు పుట్టినవాడు పటేలు, ఈ కలుషిత విషయాలు చరిత్రంతా నిండిపోయినవి. ఈ అక్రమసంబంధ విషయాలను ఎంతో చక్కగా చిత్రించినారు. మా వూరిలో జరిగిన ముచ్చట అన్నాడు రచయిత. ఆయనది జగిత్యాల దగ్గరి అంతర్గాం. ఆ వూళ్లోని కథనే కన్నులకు కట్టినట్లుగా చూపించినాడు.
చెప్పులు ‘ కథ ’ విశ్వాసానికి, మనిషితనానికి ప్రతీకగా రచయిత కవటూరు వెంకట నారాయణ రావు 1967లో రచించినారు. దళితుల పట్ల వివక్ష చూపుతాం, వారిని చీదరించుకుంటాం కాని? వారిలోని పనితనమే కదా మన “గరిసెలు” నింపేది. మనకు కుట్టేది అంతా వారై పనిచేస్తుంటే డబ్బున్న బడవాలు సుఖంగా బ్రతకడం లేదా? ఈ ప్రశ్న అనంతమైనది. దీనికి అర్థం దొరకదు.
చెప్పులు కుట్టే రంగయ్య, అతని కొడుకు రవణ బల్లోని పంతులు ఈ కథలోని పాత్రలు, రంగయ్య కొడుకు పట్ల పంతులు దయకనబర్చడం, వాడికి చదువు చెప్పించాలని, వాడిని పైకి తేవాలనే ఆరాటం కన్పిస్తుంది. పంతులు పాత చెప్పులు తీసుకొని వచ్చిన కొడుకు రవణను చూసి ఆ చెప్పులు ఎవరియిరా అంటాడు. అవి పంతులువని చెప్తాడు. ఆ చెప్పులను రంగయ్య ఎగాదిగా చూస్తాడు. అవి చీకిపోయి పనికిరాకుండా నున్నవి. వీటికన్నా కొత్త చెప్పులు చేయడం నయమనుకుంటాడు. ఈ విషయం పంతులు వొప్పుకోడు, పాతచెప్పులే కుట్టుమంటాడు. ఈ పాత చెప్పులు పంతులుకెందుకు ముద్దో తెలువది.

రంగయ్య పాఠశాలకు వెళ్లి కొడుకు రవణను చూస్తాడు, ముచ్చట పడ్తాడు. తను పంతులు వద్ద దాచిన రొండువందల రూపాయలుకు మరో నాలుగు రూపాయలు ఇస్తాడు. వీటిని ఏం చేయాలో అని పంతులు అనుకుంటాడు. తనకు కూడా చదువుకోవాలని ఉందని అదే పాఠశాలలోని మరో పంతులుతో అంటాడు. ఏదైనా తన కొడుకు చదువుకొని ఉన్నతుడు కావాలనేది రంగయ్య కోరిక. ఓ రోజు అర్ధరాత్రి రంగయ్య ఉండే ప్రాంతంలోని గుడిసెలకు నిప్పు అంటుకుంటుంది. రంగయ్య మనసు చివుక్కుమంటుంది. పంతులు చెప్పులు ఎట్లానని తెగించి గుడిసెలోకి వెళ్తాడు. కాని తిరిగి రాడు. ఫైర్‌స్టేషన్ వాళ్ళు వచ్చి నీళ్లు చల్లుతారు. కాలినదేహంతో వంగి ఉన్న రంగయ్య అతని పొట్టలో పదిలంగా పంతులు చెప్పులు ఈ కథ కన్నీరు తెప్పించక తప్పదు తన కొడుక్కు చదువు చెప్పి వాడి బాధ్యత తీసుకున్న పంతులు పట్ల ఎంత విశ్వాసమో? అర్థమవుతుంది.
ఇప్పుడు రంగయ్య లేడు, వాని కొడుకు పంతులు చేతుల్లో పెట్టాడు. పంతులు చెప్పులను రంగయ్య ఎంతలా కాపాడాడు. దళితులు విశ్వాసపరులు అనేది తెలుస్తుంది. కులాలకుంపట్లు నశించాలి. మనమంతా వొక్కటే ననే భావం బలపడాలి. ఈ లోకంలో హింసా ప్రవృత్తి నశించాలి, మానవులంతా ఒక్కటే, అనే ప్రశ్న మనలో ఉదయించాలి. ఈ ప్రశ్నకు జవాబు మనం కనుగొనాలి. ఈ ప్రయత్నమే మనది కావాలి. ఈనాడు అణగారిన వారు తిరుగుబాటు చేస్తున్నారు. చదువుకుంటున్నారు తెలివికి వస్తున్నారు. అయినను ఇంకా? అంటరాని కులాలల్లో దౌర్జన్యాలకు గురవుతున్నవారున్నారు. ఇప్పటికి కూడా అనేక సంఘటనలు జరుగుతున్నవి. ఈ దౌర్జన్యాలను త్రిప్పికొట్టాలనే ప్రయత్నమే వారు చేయాలని రచయితలు చైతన్యం కలిగిస్తున్నారు.

Dalit living life Stories in Telugu

-డాక్టర్ సందినేని రవీందర్, 9491078515

Related Stories: