ప్లాట్లు, ఇళ్ల పేరిట కుచ్చుటోపీ

Cyberabad police arrests 3 in Rs 156 cr fraud

 

స్వధాత్రి ఇన్‌ఫ్రా మల్టీలెవల్ మోసం, బాధితుల నుంచి రూ.156కోట్లు వసూళ్లు, అధిక వడ్డీ ఆశ చూపి వల
బోర్డు తిప్పేయడంతో బాధితుల లబోదిబో
ముగ్గురిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు, నిందితులు ఎపిలోని విజయవాడకు చెందిన వారిగా గుర్తింపు

మన తెలంగాణ/ సిటీబ్యూరో: వివిధ రకాల స్కీములు, అధిక వడ్డీ ఆశ చూపి మల్టీలెవల్ మార్కెటింగ్ చేస్తూ పలువురు అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ వివరాలు వెల్లడించారు. ఎపిలోని విజయవాడకు చెందిన యార్లగడ్డ రఘు స్వదాత్రి ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, స్వదాత్రి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్, స్వదాత్రి రియల్టర్స్ పేరుతో సంస్థలు ఏర్పాటు చేసి మల్టీలెవల్ మార్కెటింగ్ చేస్తున్నాడు.

ప్రధాన నిందితుడు రఘు ఎంసిఏ చేసిన తర్వాత కొంతకాలం ఐబిఎంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. కొద్ది కాలం లెక్చరర్‌గా పనిచేశాడు, తర్వాత విజయవాడలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ డెయిలీ ఫైనాన్స్ వ్యాపారం చేశాడు. ఈ సమయంలో రఘుపై పలు కేసులు నమోదయ్యాయి. కొంతకాలానికి అడ్డాను హైదరాబాద్‌కు మార్చి మొదట నగరంలోని శ్రీనగర్ కాలనీలో సంస్థను ప్రారంభించాడు. తర్వాత మాదాపూర్‌లో మరో బ్రాంచీని ప్రారంభించిన తర్వాత వ్యాపారం ఊపందుకుంది. మరో నిందితుడు శ్రీనివాస్‌బాబు, మీనాక్షి సాయంతో సంస్థను మరింత విస్తరించాడు. ఏజెంట్లను నియమించుకుని వారికి అధిక కమీషన్ ఆశచూపడంతో వారు వందలాది మందితో డిపాజిట్లు చేయించారు.

30 మంది ఏజెంట్లు, 20 మంది టెలీకాలర్లను నియమించుకుని బాధితులకు మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేశారు. ఈ విధంగా అమాయకుల నుంచి దాదాపుగా రూ.200 కోట్లు వసూలు చేశారు. ప్రారంభంలో పలువురికి డబ్బులు ఇచ్చి ఆకర్శించారు. ఇందులో చేరిన వారు వారి బంధువులను కూడా చేర్పించారు. కొంతకాలానికి బాధితులకు డబ్బులు చెల్లించడం మానివేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో మాదాపూర్ ఎడిసిపి వెంకటేశ్వర్లు, ఎసిపి శ్యాంప్రసాదరావు, ఎడిసిపి ప్రవీణ్‌కుమార్ రెడ్డి, ఇన్స్‌స్పెక్టర్ రవీంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మూడు స్కీములు…
నిందితులు ఎంఎల్‌ఎంలో మూడు స్కీములను పెట్టారు. లక్ష రూపాయలు డిపాజిట్ చేసిన వారికి నెలకు 9శాతం వడ్డీ నెలనెలా ఇస్తామని, ఏడాది తర్వాత అసలు మొత్తం ఇస్తామని చెప్పారు. ఈ స్కీంలో 950మంది నుంచి రూ.87కోట్లు వసూలు చేశారు. రెండో స్కీంలో ఓపెన్ ప్లాట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో చేరినవారికి మొత్తం డబ్బులు కట్టిన వారికి నాలుగు నుంచి పది శాతం వడ్డీ నెలకు, ఏడాది మొత్తం ఇస్తామని చెప్పారు. ఒకేసారి మొత్తం డబ్బులు కట్టిన వారికి రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత ఏడాదికి ప్లాట్‌ను అప్పగిస్తామని చెప్పారు.

ఈ స్కీంలో 300మంది నుంచి రూ.42కోట్లు వసూలు చేశారు. మూడో స్కీంలో ఇళ్లు, ఫ్లాట్లు పేరుతో వల వేశాడు. ఇందులో 70శాతం డబ్బులు ఒకేసారి కట్టిన వారికి ఫ్రీ రిజిస్ట్రేషన్, జిఎస్‌టి నుంచి మినహాయింపు ఇస్తామని ఆశ చూపారు. ఒక వేళ కస్టమర్ 50 నుంచి 60శాతం కట్టితే వారికి నెలకు రూ. 10,000 చెల్లిస్తామని ఆశచూపారు. ఈ స్కీంలో 200మంది నుంచి రూ.27కోట్లు వసూలు చేశారు.

అధిక వడ్డీకి ఆశపడవద్దు : విసి సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్
ప్రజలు అధిక వడ్డీకి ఆశపడి డబ్బులు కట్టి మోసపోవద్దని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ కోరారు. మనీ సర్కిలేషన్ స్కీములను నమ్మవద్దని, అందులో డబ్బులు కట్టి చేరవద్దని అన్నారు. వీరు ముఖ్యంగా అధిక వడ్డీ ఆశచూపుతారని, మహిళలను టార్గెట్ చేసుకుని డబ్బులు డిపాజిట్ చేయించుకుంటారని తెలిపారు. ఈ స్కీంలు ప్రజలకు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ప్లాట్లు, ఇళ్ల పేరిట కుచ్చుటోపీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.