నక్క స్నేహం

  అనగనగా ఒక అడవిలో ఓ కుందేలు, ఓ జింక ప్రాణ స్నేహితులు. కుందేలు అందానికి ముగ్ధులై ఎంతోమంది దానికి స్నేహితులైనా కుందేలుకు జింక అంటే ప్రాణం. ఒక రోజు ఓ నక్క అలా వెళ్తుండగా దానికి ఈ కుందేలు ఎదురైంది. నక్క కుందేలు అందానికి ఆశ్చర్యపోయి, తనను తాను పరిచయం చేసుకుని కుందేలు స్నేహం కోరింది. అలా కుందేలు, నక్క మంచి మిత్రులైనారు. ఓ రోజు కుందేలు జింకను నక్కకు పరిచయం చేసి అది తన […] The post నక్క స్నేహం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అనగనగా ఒక అడవిలో ఓ కుందేలు, ఓ జింక ప్రాణ స్నేహితులు. కుందేలు అందానికి ముగ్ధులై ఎంతోమంది దానికి స్నేహితులైనా కుందేలుకు జింక అంటే ప్రాణం. ఒక రోజు ఓ నక్క అలా వెళ్తుండగా దానికి ఈ కుందేలు ఎదురైంది. నక్క కుందేలు అందానికి ఆశ్చర్యపోయి, తనను తాను పరిచయం చేసుకుని కుందేలు స్నేహం కోరింది. అలా కుందేలు, నక్క మంచి మిత్రులైనారు. ఓ రోజు కుందేలు జింకను నక్కకు పరిచయం చేసి అది తన ప్రాణ స్నేహితుడని చెప్పింది. నక్క జింకను ఓర్వలేకపోయింది. కుందేలు జింకతో స్నేహం చేయడం నక్కకు ఇష్టంలేదు. కుందేలు ముందు నక్క జింకతో ఆప్యాయత నటించింది. కుందేలు లేని సమయంలో జింకతో నక్క మాట్లాడడం లేదు. పైగా నక్క జింకను కోపంగా చూడసాగింది. కుందేలుతో స్నేహం చేస్తే మర్యాదగుండదని నక్క జింకను హెచ్చరించింది.

ఒక రోజు నక్క కుందేలును మాటల సందర్భంలో హేళన చేస్తూ మాట్లాడింది. కుందేలు అది సహించలేకపోయింది. నక్కతో గొడవపెట్టుకుని మాట్లాడడం మానేసింది. హఠాత్తుగా నక్క జింకతో ఆప్యాయంగా మాట్లాడటం ఆరంభించింది. జింక అందాన్ని, గుణాన్ని అదేపనిగా పొగడసాగింది. జింకను వదిలిపెట్టకుండా దానితోనే తిరగసాగింది. కుందేలు రూపంలోని లోపాలను వర్ణించసాగింది. దాని ప్రవర్తన మంచిదికాదని దుష్ప్రచారం చేసింది. జింక కుందేలును కలవకుండా శతవిధాలా ప్రయత్నం చేసింది నక్క. నాలుగైదు రోజుల తర్వాత ఏనుగు చొరవతో కుందేలు, నక్కల మధ్య మళ్లీ స్నేహం కుదిరింది. మళ్లీ నక్క జింకతో దురుసుగా ప్రవర్తించసాగింది. నక్క జింకతో తరచూ గొడవ పడసాగింది.

కొన్ని రోజుల తర్వాత నక్క వంకర బుద్ధి వల్ల మళ్లీ కుందేలుకు నక్కకు గొడవ జరిగింది. మళ్లీ నక్క జింక వద్దకు చేరి ఆప్యాయతను నటిస్తూ జింక అందాన్ని పొగుడుతూ, కుందేలు గురించి చెడుగా చెప్పబోయింది. అప్పుడు జింక ఇలా అంది “ఓ వక్ర బుద్ధీ నీ స్నేహంతో అవసరమే తప్ప నిజాయితీ లేదు. నీ స్నేహం చేయడం కుక్క తోకను పట్టుకొని గోదావరి ఈదడం లాంటిది. కుందేలు నీతో మంచిగా ఉంటే నన్ను చిన్నచూపు చూస్తావు. కుందేలుకు నీకూ గొడవైతే ఆ కుందేలుతో నన్ను కూడా కలవకుండా ఉండడానికి లేని ప్రేమను నటిస్తూ నన్ను విడిచిపెట్టావు. నీలాంటి నీచుడిని నమ్మి నా ప్రాణస్నేహితుడిని వదులుకోను. శ్రేయోభిలాషుల స్నేహాన్ని జీవితాంతం కాపాడుకోవాలి. అవసరానికి ప్రేమను నటించే వాళ్లను శాశ్వతంగా వదులుకోవాలనే గుణపాఠాన్ని నేర్చుకున్నాను” అంటూ అక్కడనుంచి వెళ్లిపోయింది. వెనుక నుండి ఇదంతా గమనిస్తున్న ఏనుగు, కుందేలు జింకను అభినందించాయి.

సరికొండ శ్రీనివాసరాజు
81858 90400

 

Cunning Fox Story in Telugu

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నక్క స్నేహం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.