పత్తికి పంటల బీమా పరేషాన్!

Cotton

 ‘గులాబీ రంగు పురుగు’ సోకితే పరిహారం ఉండదు
వాతావరణ ప్రభావంతో నష్టం వస్తేనే వర్తింపు
రెసిస్టెన్స్ కోల్పోయిన బిటి 2 రకం.. దేశీయ పత్తిపై పరిశోధనలు అంతంతే
పంటల బీమాలో మార్పులు చేయాలని రాష్ట్రం పలుమార్లు కోరినా పట్టని కేంద్రం

హైదరాబాద్ : పత్తి పంటకు గులాబీ రంగు పురుగు అంటే రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. ఈ రోగం సోకితే పంటల బీమాలో వాతావరణ ఆధారిత బీమా చేయించినప్పటికీ నష్టం వాటిల్లితే పరిహారం రాదు.. గులాబీ రంగు పురుగు సోకినా బీమా కింద పరిహారం వచ్చేలా వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఎటువంటి స్పందన లేదు. ఈసారి ప్రభుత్వం కూడా పత్తిని పంటను ప్రోత్సాహించాలని నిర్ణయించింది,. రాష్ట్రంలోని అన్నదాతలు ఈసారి కూడా పత్తి పంటను సాగు చేసేందుకే మొగ్గుచూపుతున్నారని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఈ వానాకాలం సీజన్‌లో 61 లక్షల ఎకరాల నుంచి 70 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు 1.39 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు.

నష్టదాయక బిజి- 2 విత్తనాల సాగు ద్వారా వచ్చిన గులాబీ పురుగుతో వల్ల గత నాలుగైదేళ్లుగా రైతులు ఆర్థికంగా నష్టపోతూ వస్తున్నారు. గత ఏడాదిలోనూ దాదాపు 10 లక్షల ఎకరాల్లో గులాబీ పురుగు సోకి దిగుబడులు పడిపోయినట్లు అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశీలనలో వెల్లడైంది. ఇందులో కొంతమంది రైతులు ప్రధాన మంత్రి పంటల బీమాలో వాతావరణ ఆధారిత పంటల బీమా కింద ఇన్సూరెన్సు ప్రీమియం చెల్లించారు. అయితే ఈ బీమాలో పంటలకు పురుగు రోగం సోకితే పరిహారం ఇవ్వరు. వాతావరణం ఫలితంగా నష్టం వాటిల్లితేనే నష్టం అంచనా వేసి పరిహారం చెల్లిస్తారు. వాస్తవానికి గులాబీ పురుగుతోనే పత్తి పంటకు ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. దీనిపై వ్యవసాయాధికారులను సంప్రదిస్తే ఒకవేళ పత్తిని పిఎంఎఫ్‌బివై కింద ఇన్సూరెన్సు కట్టేలా చేస్తే క్రాప్ కటింగ్ ఎక్స్‌పరమెంట్స్ చేసి దిగుబడి అంచనా వేయాలని, అలా చేస్తే పత్తి రైతులకు ఎక్కువగా ఉపయోగం ఉండదని చెబుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ముందస్తుగానే లింగార్షణ బుట్టలు వంటివి అందజేసి గులాబీ రంగు పురుగు సోకకుండా మందుస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది.

బిటి టెక్నాలజీ పని అయిపోయింది..

బిటి టెక్నాలజీ వైఫల్యం చెందినందునే గులాబీ రంగు పురుగు ఉనికిని పెంచుకుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బిజి- 2లో క్రై1ఎసి, క్రై2ఎబి అనే ట్రార్సిట్ ప్రొటీన్స్ విఫలమై ఈ పురుగు జీవనశక్తిని పెంచుకుని, ఉధృతమైందంటున్నారు. నాగ్‌పూర్‌లోని కేంద్ర పత్తి పరిశోధన సంస్థ 2015లో గులాబీ రంగు పురుగు ప్రభావాన్ని ధ్రువీకరించి, హెచ్చరించింది. అయితే రైతులు బిజి 2కి అలవాటు పడటం, ఇంకా వేరే విత్తనం అందుబాటులో లేకపోవడంతో దీనినే సాగు చేస్తున్నారు. మరోవైపు చీడ, పీడను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే దేశీయ విత్తనాల పరిశోధన అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా బిటి పత్తి విత్తన సాగు 90 శాతం పైనే ఉంటుంది. గత ఏడాది మన తెలంగాణలో 54 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. గతంలో మన రాష్ట్రంతో సహా ఎపి గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడులోనూ గులాబీ పురుగు ప్రభావం కనిపించింది. దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. గత ఏడాది బిజి -2 పత్తి విత్తనాల ప్యాకెట్ (450 గ్రా.) రూ.730 కాగా, ఎకరానికి 2 ప్యాకెట్లు అవసరమౌతాయి.

బిజి 3తో పొంచి ఉన్న మరో ముప్పు..

అనుమతి లేని అక్రమ విష బిజి -3 మార్కెట్‌లో విచ్చలవిడిగా చలామని అవుతోంది. వ్యవసాయ శాఖ టాస్క్‌ఫోర్స్ దాడులు చేస్తున్నప్పటికీ కొన్నిచోట్ల గుట్టుచప్పుడు కాకుండా బిజి-3 విత్తనాలు విక్రయిస్తున్నారు. ఈ విత్తనాలకు ఎటువంటి అనుమతి లేదు. జీవ వైవిధ్యాన్ని, భూసారాన్ని దెబ్బతీసే బిజి3 విత్తనాలను రైతులకు అక్రమంగా అంటగడుతున్నారు. 2018లో దాదాపు 8 లక్షల ఎకరాల్లో, 2019లో కూడా లక్షల ఎకరాల్లో అక్రమంగా బిజి 3 సాగైనట్లు వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పత్తికి పంటల బీమా పరేషాన్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.