కొత్త జిల్లాలకు కోర్టులు

Courts

తెలంగాణ వారికే అవకాశాలు – ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాలలో కొత్తకోర్టులు ఏర్పడనున్నాయని ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ప్రకటించారు. జిల్లాల వారీగా నూతన న్యాయస్థానాల ఏర్పాటుతో న్యా యవాదులకు విస్తృతమైన అవకాశాలు రానున్నాయని ఆయన చెప్పారు. శుక్రవారం టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ న్యాయవాదులు వినోద్ కుమార్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రముఖ్యమంత్రి కెసిఆర్‌తో సమావేశమై న్యాయవాదుతో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రయత్నించనున్నట్లు హామీ ఇచ్చారు. కొత్తజిల్లాకోర్టుల్లో జరిగే నియామకాల్లో మనవాళ్లకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవిధంగా కృషి చేయనున్నట్లు వనోద్‌కుమార్ హామీ ఇచ్చారు. తాను న్యాయవాద వృత్తిలో ఉండటంతోనే రాజకీయాల్లో అవకాశాలు వచ్చాయనీ, పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతలునిర్వహించే అవకాశం గతంలో వచ్చిందన్నారు. ప్రస్తుతం కూడా న్యాయవాదిగా ఉండటంతోనే ఈ అవకాశం వచ్చినట్లు భావిస్తున్నానన్నారు. తెలంగాణ హైకోర్టులో జడ్జీల నియామకాల్లో కొన్ని సామాజిక వర్గాలకే ప్రాధాన్యత లభించిందని న్యాయవాదులు చేస్తున్న ఆరోపణలను పరిశీలించి అన్నివర్గాలకు న్యాయం జరిగే విధంగా సిఎం కెసిఆర్‌తో చర్చించనున్నట్లు తెలిపారు.

అలాగే హైకోర్టు నియామకాల్లో తెలంగాణేతరులకు ప్రాధాన్యత, అవకాశాలు లభిస్తున్నాయని తనదృష్టి వచ్చిందన్నారు. ఈ అంశాన్ని పరిష్కరించేందుకు ప్రత్నిస్తానని న్యాయవాదులకు హామీ ఇచ్చారు. తెలంగాణ పోరాడి సాధించుకున్నా హైకోర్టు ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం ముందుకు రాకపోతే పార్లమెంట్‌లో పోరాడి సాధించామన్నారు. అయితే హైకోర్టు ఏర్పాటు చేసేవిషయంలో కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లు కాలాయాపన చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. గట్టిగా పార్లమెంట్‌లో పట్టుబట్టడంతోనే తెలంగాణ హైకోర్టు సాధించుకోగలిగామని చెప్పారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ శాసన సభ్యుడు కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎవరూ చేయలేని సాహసం న్యాయవాదులు చేశారని గుర్తు చేశారు. ఇంకా కొంతమంది న్యాయవాదులపై కేసులు ఉన్నాయని తెలిపారు. అయితే తెలంగాణ ఏర్పడిన అనంతరం కూడా న్యాయవాదులకు కోర్టుల్లో సరైన అవకాశాలు రావడంలేదని విచారం వ్యక్తం చేశారు. శాసన మండల సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వినోద్ నుంచి నేర్చుకోవల్సిన విషయాలు అనేకం ఉన్నాయన్నారు.

ఎంతపని ఒత్తిడి ఉన్నా ఓపికగా పనులను చక్కదిద్దుకుపోయే నేర్పరి వినోద్ అని ప్రశంసించారు. ప్రణాళికాసంఘం ఉపాధ్యయక్షుడు వినోద్ కుమర్‌ను టిఆర్‌ఎస్ న్యాయవాదులు గండ్రమోహన్ రావు అధ్యక్షతన న్యాయవాది కళ్యాణ్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రంమంలో సీనియర్ న్యాయవాది శ్రీరంగారావు,ఎన్.లలితారెడ్డి, భానుప్రియ, కృష్ణ యాదవ్, రజిత రెడ్డి,రాజేశ్వర్ రావు, గోవర్థన్‌రెడ్డి,ఉపేందర్, చంద్రశేఖర్ రావు, ముత్యాల మురళీధర్ రావు, ఎం. అజయ్‌కుమార్ తదితరులు పాల్గొని వినోద్‌ను సన్మానించారు.

Courts for new districts in Telangana

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కొత్త జిల్లాలకు కోర్టులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.