మెప్మాలో అవినీతిని నిరోదించేది ఎవరూ..!

Corruption

 

దోచుకొని దాచుకుంటున్న ఆర్పీలు
భూములు, బంగారం కొనుగోళ్ళలో ఆసక్తి
అడిట్ పేరుతో రూ. 12 లక్షలు వసూలు
తూతూ మంత్రంగా విచారణ

ఖమ్మం : ఖమ్మం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో (మెప్మా) త్రవ్వినాకొద్ది అవినీతి వ్రేళ్లానుకుని పోతుంది. ఇటీవల అదే శాఖలో అవినీతి జరుగుతుందని, నియంత్రణ కోసం ఏసీబీ దాడులు నిర్వహించినప్పటికి అ సంఘటన మరువక ముందే అదే పేరుతో మెప్మాలోని సీఓలు సల్మా, రోజా, ద్రౌపతి, ఉపేంద్రలతో పాటు ఆర్పీగా విధులు నిర్వహిస్తూ, యూనియన్ నాయకురాలుగా కొనసాగుతున్న ఉషలు సమాఖ్యల వద్ద నుంచి రూ. 12 లక్షలు ఆడిట్ పేరుతో వసూలు చేసి పంచుకున్నారు. ఈ వసూళ్లలో భాగంగా ఒక్కొక్క గ్రూపు నుంచి రూ. 10వేల చొప్పున 120 సమాఖ్యల వద్ద నుంచి రూ. 12 లక్షల రూపాయలను ముక్కు పిండి వసూలు చేశారు.

ప్రభుత్వం సీఓలకు నెలకు రూ. 9 వేలు, ఆర్పీలకు రూ.6 వేల చొప్పున జీతాలు ఇస్తున్నప్పటికి చేతివాటం ప్రదర్శిస్తూ సమాఖ్య సభ్యులను దోపిడి చేస్తున్నారు. బినామీ గ్రూపులు, ఆర్పీల నియామకం కోసం వేలాది రూపాయలను పోగు చేసి లక్షల్లో కూడ పెట్టి బినామీ పేర్లతో ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాల్లో ఆర్పీలు వ్యవసాయ భూములు, ఇంటి స్థలాలు, ఇండ్లు, బంగారాన్ని కొనుగోలు చేసుకుని తమ ముచ్చట తీర్చుకుంటున్నారు. సమాఖ్యల వద్ద వేలాది రూపాయలు దోచుకుని బినామీ పేర్లతో దాచుకోవటం దశాబ్ద కాలంగా కొనసాగిస్తున్నారు. వారిని ఇప్పటి వరకు ఎవరూ ప్రశ్నించకపోవడంతో వారి ఉద్యోగంతో పాటు ఆదాయ వనరులు కూడా మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి.

సల్మా సీఓగా పనిచేస్తూ గెజిటెడ్ అధికారికి ఎంత సంపాదన ఉంటుందో అ రెంజ్‌లో సంపాదించింది. ఆర్పీగా విధులు నిర్వహిస్తున్న సమయంలో సల్మా శ్రీనివాసనగర్‌లోని ఒక గదిలో నివాసం ఉంటూ నేడు అదే స్థలంలో బహుళ అంతస్థులతో ఇంటిని నిర్మించుకుంది. అంతే కాకుండా బల్లేపల్లిలో మెయిన్‌రోడ్డుపై 400 గజాల స్థలంతో పాటు బాలాజీ ఎస్టేట్‌లో మూడు స్థలాలు కొనుగోలు చేసింది. తనకున్న ఇద్దరు పిల్లల్లో కుమారుడు అస్ట్రేలియాలో ఎంఎస్సీ, కూతురు రష్యాలో ఎంబీబీఎస్ విద్యనభ్యసిస్తున్నారు.

సీఓలు రోజా, ద్రౌపతి, ఉపేంద్రలు కూడా పెద్ద మొత్తంలో ఆస్తులు కూడపెట్టుకున్నారు. ఉన్న 162 సమాఖ్యలలో 30 సమాఖ్యలు బినామీగా నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కొక్క ఆర్పీని నియమించేందుకు రూ. 80 వేల చొప్పున వసూలు చేయటంతో పాటు అ పోస్టుల్లో కూడా తమకు దగ్గరగా ఉన్న బందువులనే నియమించుకొని అవినీతిని బయటకు పంపకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆదివారం మెప్మాలో పనిచేస్తున్న సీఓలు, ఆర్పీలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి జరుగుతున్న అవినీతిపై మూడు గంటల పాటు సంబంధిత అధికారులను విచారించినట్లుగా తెలుస్తుంది. మెప్మాలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు క్షేత్రస్థాయిలో ప్రక్షాళనకు పూనుకున్నారు. ఇటీవల వస్తున్న వరుస కథనాలతో సంబంధిత అధికారులు స్పందించారు.

Corruption in Khammam Urban Poverty Alleviation Agency

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మెప్మాలో అవినీతిని నిరోదించేది ఎవరూ..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.