మహమ్మారికి మతం రంగు

Coronavirus

వాస్తవాలు అతిక్రమించడానికి వీలు లేనివి. వ్యాఖ్యానం మన సొంతం. కానీ వాస్తవాల ఆధారంగా చేసే వ్యాఖ్యానం అన్నింటికన్నా విలువైంది అన్నాడు బ్రిటిష్ శాస్త్రవేత్త, ప్రసిద్ధ నవలా రచయిత సి.పి.స్నో. అయితే వ్యాఖ్యానాల దగ్గరకొచ్చే సరికి చాలా మంది వాస్తవాలను వాటంగా విస్మరిస్తారు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ మూలాలు అన్వేషించడంలో, దాని వ్యాప్తి ఎలా జరుగుతోంది అని విశ్లేషించడంలో చాలా మంది వాస్తవాలకు తిలోదకాలిస్తున్నారు. సామాజిక మాధ్యమాలు విస్తృతమైన ప్రస్తుత తరుణంలో ఎవరు దేనిమీదైనా వ్యాఖ్యానించవచ్చు. అడుగు లేని ముంత లాంటి ఈ వ్యాఖ్యానాలను సామాజిక మాధ్యమాల ద్వారా కరోనా కన్నా వేగంగా ప్రచారంలో పెట్టవచ్చు. కరోనాకు మూలం చైనా అని నిందించారు. చైనా కరోనాను కట్టడి చేస్తే దాని మీదా విమర్శలు వెల్లువెత్తాయి.

మన దేశంలో కరోనా వ్యాప్తికి కారణం అనడానికి తబ్లీగీ జమాత్ ఈ వ్యాఖ్యాతలకు సునాయాసంగా అందివచ్చింది. దిల్లీలోని నిజాముద్దీన్ లో ఉన్న తబ్లీగీ జమాత్ కేంద్రంలో మార్చి 13 నుంచి 15 వరకు జరిగిన మతపరమైన సమావేశానికి హాజరైన కొందరు విదేశీ ముస్లింలతో సహా ముస్లింలే ఈ దేశంలో కరోనా వ్యాప్తికి కారకులని అలవాటైన రీతిలో అసత్య ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీనికి కరోనా జిహాద్ అన్న పేరు కూడా పెట్టారు. ఇది ముస్లింల కుట్ర అని దుయ్యబట్టారు. ఘోరమైన ప్రకృతి విపత్తుకు మతం రంగు పులిమారు.

22న జనతా కర్ఫ్యూ అమలులో ఉండగానే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిల్లీలో లాక్ డౌన్ ప్రకటించారు. దేశమంతటా లాక్ డౌన్ ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తట్టనే లేదు. మార్చి 25 నుంచి మూడు వారాలపాటు దేశమంతటా లాక్ డౌన్ విధిస్తున్నట్టు మోదీ ప్రకటించారు. కొన్ని అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు కనక, మరో మార్గం లేనందువల్ల ఎవరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. లాక్ డౌన్ విధించడానికి ముందు ప్రధాన మంత్రి మోదీకి రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించాలన్న ఆలోచనే తట్టలేదు. అసంఘటిత రంగంలో పని చేస్తున్న వారికి ఎదురయ్యే ఇబ్బందులనుంచి గట్టెక్కించడానికి, పేదలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక కార్యక్రమాన్ని ప్రకటించడానికి ఎక్కువ సమయమే తీసుకున్నారు. అత్యవసర పనులు తప్ప మిగతా కార్యకలాపాలన్నీ స్తంభించిపోయినందువల్ల వేతనాలు రానందువల్ల కడుపారబెట్టుకున్న పేదలు కాలి నడకన సొంతూళ్లకు పయనమయ్యారు.

ఏ రవాణా మార్గమూ అందుబాటులో లేనందువల్ల వారు నానా యాతనా పడాల్సి వచ్చింది. కరోనా వ్యాధికి మందు లేదు కనక ఎవరికి తోచిన మార్గం వారు సూచించారు. ఆ మార్గాల సాధ్యాసాధ్యాలను, శాస్త్రీయత గురించి ఆలోచించినా ఫలితం లేదు. అయితే ఇలాంటి మహమ్మారి సోకినప్పుడూ మత విశ్వాసాలున్న వారు ఎలాంటి మార్గాలు సూచిస్తారో కూడా గమనించడం ముఖ్యం. మార్చి 14వ తేదీన అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు చక్రపాణి స్వామి గోమూత్ర పార్టీ నిర్వహించారు. వేలాది మంది ప్రాణభయంతో గోమూత్రం సేవించి ప్రాణాలు కాపాడుకుందామని ప్రయత్నించారు. ఈ గోమూత్ర పానం రోగ నిరోధకంగా పని చేస్తుందో, చికిత్సకు ఉపకరిస్తుందో తెలియదు. కానీ జనం మాంసాహారం తింటున్నందువల్లే నరసిం హ స్వామి మాంసాహారులను శిక్షించడానికి కరోనా అవతారంలో వచ్చారని చక్రపాణి స్వామి సెలవిచ్చారు. క్రిమి సం హారానికి వేదమంత్రాలు ఉపయోగపడతాయని ఆ మంత్రాలను పఠించిన సందర్భాలూ ఉన్నాయి.

మార్చి 13న 1897నాటి తాత్కాలిక సాంక్రమిక వ్యాధి చట్టానికి అనుగుణంగా 2020 నాటి దిల్లీ సాంక్రమిక వ్యాధి కోవిద్-19 నిబంధనల ప్రకారం ఐ.పి.ఎల్.తో సహా అన్ని క్రీడోత్సవాలను, సభలు, సమావేశాలను, సదస్సులను నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం 200 కన్నా ఎక్కువ మంది ఒక చోట చేరడానికి వీలు లేదు. అయితే మతపరమైన సమావేశాల మీద నిషేధం విధించ లేదు. అందుకే మార్చి 13 నుంచి 15 దాకా తబ్లీగీ జమాత్ సమావేశాలు నిర్వహించగలిగింది. అంటే తబ్లీగీ జమాత్ చట్టాన్ని అతిక్రమించలేదనే. కరోనా ఒక ప్రాంతానికి పరిమితమైన సాంక్రమిక వ్యాధి కాదని, ఇది విశ్వ మహమ్మారి అని తర్వాత జ్ఞానోదయమైంది. అప్పుడైనా సత్వర చర్యలు తీసుకోలేదు. అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని మూసేయలేదు. సాధారణంగా గంటకు నాలుగు వేల మంది సందర్శించే దాకా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయమూ మార్చి 16 దాకా మూయనేలేదు.

ముంబైలోని సిద్ధి వినాయక దేవాలయాన్ని, ఉజ్జయిని మహా కాళెశ్వర దేవాలయాన్ని కూడా మార్చి 16వ తేదీ దాకా మూసేయలేదు. వైష్ణో దేవి ఆలయం మార్చి 18 దాకా తెరిచే ఉంది. వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం మార్చి 20న గాని మూత పడలేదు. షిర్డీ సాయిబాబా ఆలయం మార్చి 17 దాకా తెరిచే ఉంది. మనిషికి, మనిషికి మధ్య కనీసం ఒక మీటర్ దూరం పాటించాలని మోదీ సలహా ఇచ్చింది మార్చి 19వ తేదీన మాత్రమే. కరోనా బాధితులకు వైద్యం అందజేస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియ జేయడానికి చప్పట్లు కొట్టాలని, కంచాల మీద గరిటెలతో చరచాలనీ మోదీ కోరారు. 22వ తేదీ సాయంత్రం అయిదు గంటలకు అనేక చోట్ల జనం తండోపతండాలుగా వీధుల్లోకి వచ్చి చప్పట్లు చరిచారు. కంచాలను గరిటెలతో చరిచి వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. పాటలు పాడారు. నృత్యాలు చేశారు. పార్లమెంటు సమావేశాలు యథావిధిగా కొనసాగాయి. రాష్ట్రపతి పార్లమెంటు సభ్యులకు విందు కూడా ఇచ్చారు. దీనితో మనిషికి, మనిషికి మధ్య కనీసం ఒక మీటరు దూరం పాటించాలన్న మోదీ సలహా గాలిలో కలిసి పోయింది. 24వ తేదీ దాకా అన్ని చోట్లా మతపరమైన కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగాయి.

తబ్లీగీ జమాత్ సమావేశాలకు హాజరవుతున్న వారిలో కొంత మంది 15వ తేదీకల్లా వెళ్లి పోయి ఉండవచ్చు. రైళ్లు, ఇతర ప్రయాణ సదుపాయాలు నిలిపివేసినందువల్ల కొంతమంది అక్కడం దిగబడి పోవలసి వచ్చింది. మిగతా వారినీ పంపించడానికి తబ్లీగీ జమాత్ బస్సులు మొదలైన వాటిని సమకూర్చి పోలీసుల అనుమతి కోరింది. కానీ పోలీసులు అనుమతించలేదు. తబ్లీగీ పెద్దలు పోలీసు కమిషనర్ ను కలిసి విన్నవించినా ఫలితం లేకపోవడంతో కొంత మంది అక్కడే ఉండి పోవలసి వచ్చింది. జాతీయ స్థాయిలో లాక్ డౌన్ ప్రకటించినప్పుడు ప్రధానమంత్రి ఎక్కడున్న వాళ్లు అక్కడే ఉండిపోవాలన్నారు. తబ్లీగీ జమాత్ కేంద్ర కార్యాలయంలో ఉండిపోయిన వారు మోదీ ఆదేశాన్ని పాటించారు. పైగా అది విశాలమైన భవనం. 8 నుంచి 10 వేల మంది ఉండడానికి అనువైనంత విశాలమైంది. పైగా వీరంతా అక్కడ దిగబడి పోయిన తరవాత వారు తబ్లీగీ జమాత్ సాంప్రదాయిక ఇస్లాం మతాన్నే ప్రచారం చేస్తుంది. మహమ్మద్ ప్రవక్త చెప్పిన రీతిలో మెలగితే మంచి ముస్లింలుగా ఉండొచ్చునని చెప్తుంది. ముస్లిం లు నమాజ్ ఎలా చేయాలి, నిష్ఠా గరిష్ఠులైన ముస్లింలుగా ఎలా ఉండాలో చెప్తుంది. దైవ నామం ఎలా జపించాలో తెలియజేస్తుంది. ఈ సంస్థ మత మార్పిడులను ప్రోత్సహించిన దాఖలాలు లేవు.

తబ్లీగీ అధినేత మౌలానా సాద్ కంధాల్వీ మాత్రం వివాదాస్పద ప్రకటనలు చేసి ఆ తరవాత నాలుక కరుచుకోవడానికి అలవాటు పడ్డారు. ముస్లింలకు మక్కా, మదీనా, జెరూసలెం పవిత్ర స్థలాలని భావిస్తారు. మౌలానా సాద్ జెరూసలెం కు బదులు తబ్లీగీ జమాత్ మూడవ పవిత్ర స్థలం అనడం వివాదానికి దారి తీసింది. మౌలానా క్షమాపణ చెప్పారు. దానిమీదా విమర్శలు వెల్లువెత్తాయి. మొబైల్ ఫోన్ జేబులో ఉంచుకుని నమాజ్ చేయకూడదని ఆయన చెప్పడం కూడా వివాదాలకు తెరలేపింది. మౌలానా సాద్ సాంప్రదాయిక ఇస్లాం ఆచార విధులను సమర్థించే వారే తప్ప ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఇస్లాంకు ప్రవచనాలు చెప్పగలిగే వారు కాదు. మత సంప్రదాయాల్లో, మత గ్రంథాలలోని అంశాలను తమకు అనువుగా మలచుకుని వ్యాఖ్యానించడానికి అన్ని మతాల్లో అవకాశం ఉంటుంది. అందువల్లే ఒక మతంలోనే అనేక శాఖలు బయలుదేరుతాయి.

తబ్లీగీ జమాత్ లో దిగబడి పోయిన వారు చట్టాన్ని, నియమ నిబంధనలను ఉల్లంఘించారని వాదించే వారికి కొదవ లేదు. వారు బయటకెళ్లడానికి అవకాశం లేకపోవడం వాస్తవమే. కానీ తీవ్ర వ్యాధి ఉన్నప్పుడు, భీకర వర్షం కురిసినప్పుడు ఇంట్లోనే ఉండాలని, ఇంట్లోనే నమాజ్ చేయాలని మహమ్మద్ ప్రవక్త కూడా చెప్పారు. తబ్లీగ్ లో దిగబడి పోయినవారు అదే పని చేశారుగా! దేవుడి మీద విశ్వాసం ఉంచితే కష్టాలు దూరం అవుతాయని, వ్యాధులు నయం అవుతాయన్న నమ్మకం అన్ని మతాల్లో ఉన్నదే. ఇది శాస్త్రీయమా కాదా అన్నది వేరే చర్చ. తబ్లీగీ సమావేశం కోసం అనేక దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. అప్పటికి మన దేశంలో కరోనా తీవ్రత ఇంతగా లేనందువల్ల వారికి పరీక్షలు చేయడానికి అంత శ్రద్ధ తీసుకున్నట్టు లేదు. ఉదాహరణకు థాయ్ లాండ్ నుంచి ఓ వ్యక్తి కోయంబత్తూరు విమానాశ్రయంలో దిగారు.

ఆయనకు పరీక్షలు చేశారు. ఆయనకు కరోనా లేదని తేలింది. కానీ ఆయన వెంట మరో ఏడుగురూ వచ్చారు. వారిలో ఇద్దరికి కరోనా ఉన్నట్టు తేలింది. తబ్లీగీ జమాత్ సమావేశానికి 250 మంది విదేశాల నుంచి వస్తే వారిని సవ్యంగా పరీక్షించారో లేదో తెలియదు. జనవరి నుంచి మార్చి మూడు దాకా విదేశాల నుంచి 15 లక్షల మంది వచ్చారు. వారికి తగిన పరీక్షలు నిర్వహించారా? మార్చి మూడు తరవాతే వారందరికీ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. అందరినీ పరీక్షించిన దాఖలాలు ఉన్నాయా? విదేశాల నుంచి వచ్చే వారిని; ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, కువైత్, ఖతార్ నుంచి వచ్చిన వాళ్లకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది మార్చి 16ననే. చప్పట్లు కొట్టి వైద్యులకు, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేయాలన్న మోదీ మాట ప్రతి నగరంలోనూ ఒకే చోట వేలాది మంది రోడ్ల మీదకు వచ్చేలా చేసింది.

మరి దూరం పాటించడం ఏమైనట్టు? బీజేపీ ముఖ్య మంత్రులే ప్రభుత్వ ఆదేశాలను, సలహాలను తుంగలో తొక్కారు. కర్నాటక శాసన మండలి సభ్యుడి కూతురి పెళ్లికి 2000 మంది అతిథులు వచ్చారు. ఆ పెళ్లికి ముఖ్యమంత్రి బి.ఎస్. ఎడ్యూరప్ప కూడా హాజరయ్యారంటే నిబంధనలను పాటించనట్టేగా. మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన మద్దతుదార్లు వందలాదిగా వచ్చారు. అంటే నిబంధనలను తుంగలో తొక్కినట్టేగా? ఈ మహమ్మారి నుంచి జనాన్ని కాపాడవలసిన ప్రభుత్వం ప్రజా సమూహాల విషయంలో అమానుషంగా ప్రవర్తించిన ఉదంతాలూ ఉన్నాయి. బరేలీలో తప్పని సరి పరిస్థితుల్లో రోడ్డు మీద చతికిల పడ్డ వలస కార్మికులపై రసాయనాలు పిచికారీ చేశారు. పశువుల విషయంలో కూడా ఇంత దారుణంగా ప్రవర్తించరేమో! రోడ్ల మీదకొచ్చిన వారి చేత బస్కీలు తీయిస్తున్నారు.

వీటికి చట్ట సమ్మతి ఉందా? లాక్ డౌన్ అంటే కర్ఫ్యూ అమలులో ఉన్నట్టు కాదుగా? పోలీసుల దురాగతాలు ఉన్నతాధికారులకు, మంత్రులకు కనిపించవా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడం చేతగాక తబ్లీగీ జమాత్ సమావేశానికి హాజరైన వారే కరోనాను వ్యాపింప చేస్తున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఏ ప్రభుత్వమూ ఖండించలేదు. అంటే ముస్లింలే కరోనా వ్యాప్తికి కారకులన్న ప్రచారానికి ఊతమిస్తున్నట్టే. నియమోల్లంఘన చేసిన వారిని చట్టం ప్రకారం శిక్షించాల్సిందే. కానీ కరోనా వ్యాప్తికి ముస్లింలు కారణం అని జరుగుతున్న ప్రచారాన్ని కొనసాగనివ్వడం హిందుత్వ ఎజెండా అమలుకు ఒక ఉపకరణంగానే భావించవలసి వస్తుంది అనుకోవచ్చుగా! ఇలాంటి పని చేయడానికి తేరగా దొరికేది మైనారిటీలే. ముస్లింలను బలిపశువుల్ని చేయడం హిందుత్వ రాజకీయాలకు అనుగుణమైందే.

Coronavirus was a test of secular nationalism

ఆర్వీ రామారావ్, 9676999856

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మహమ్మారికి మతం రంగు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.