పచ్చడితో ఊరంతా పరేషాన్….

ఇద్దరికి కరోనా పాజటివ్
100మంది హోం క్వారంటైన్

Corona virus spread duo to Mamadikaya pachadi

 

మనతెలంగాణ/హైదరాబాద్ : మామిడి కాయల పచ్చడి పంపిణీతో ఇద్దరు వ్యక్తులకు కరోనా పాటిజివ్ రాగా మరో 100మందిని హోం క్వారంటైన్‌కు తరలించిన ఘటన షాద్‌నగర్‌లోని కొల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈనెల 20న షాద్‌నగర్ నుంచి మామిడి తొక్కు పెట్టేందుకు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రోజంతా ఉండి 12 మంది సమక్షంలో 2 క్వింటాళ్ల తొక్కు పెట్టారు. అనంతరం పచ్చడిని ఉప్మాలో కలుపుకుని తిన్నారు. కాగా పచ్చడి పెట్టిన వాళ్లు వెళ్లిన తర్వాత తొక్కును ప్యాక్ చేసి ఊరంతా పంచాలనుకున్నారు.

కానీ అదే రోజు షాద్‌నగర్ వ్యాపారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తొక్కు పెట్టిన ఇద్దరికీ మరుసటి రోజు పాజిటివ్ ఉన్నట్లు తేలింది. విషయం తెలిసిన ప్రజాప్రతినిధి భర్తతో పాటు గ్రామంలోని అందరిలో భయం మొదలైంది. తొక్కు పెట్టిన వాళ్లకు కరోనా రావడంతో గ్రామస్తులు ఆ తొక్కును డంప్ యార్డులో పడేశారు. కరోనా వైరస్ ఉన్న వారు ఊరికి వచ్చి పచ్చడి పెట్టారన్న సమాచారం తెలియడంతో ఊరు ఊరంతా వణికిపోయింది.

దీంతో వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. కరోనాతో భయపడి గ్రామస్తులు తమకు టెస్టులు చేయండంటూ వేడుకుంటున్నారు. కాగా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ ఇద్దరితో ఎక్కువగా కాంటాక్టయిన 12 మందికైనా పరీక్షలు చేయండంటూ గ్రామస్తులు మొర పెట్టుకుంటున్నారు. దాదాపు 4 వేలకు పైగా జనం ఉన్న ఆ ఊర్లో ఇప్పుడు 100 మందికి పైగా హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. గ్రామంలో ఎవరికి వైరస్ సోకిందో తెలియక అంతా మానసికంగా భయపడిపోతున్నామని, ఇప్పటికైనా టెస్టులు చేయాలని కోరుతున్నారు గ్రామస్తులు. కరోనా వైద్య పరీక్షలు చేయకుంటే ఊరంతా వల్లకాడుగా మారేఅవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

The post పచ్చడితో ఊరంతా పరేషాన్…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.