40 ఏళ్లుగా ఆ పోలీసులకు అమ్మ…. కన్నుమూసింది

అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు ఆమె తల్లి కాని తల్లి. గడచిన 40 ఏళ్లుగా ఆ పోలీసు స్టేషన్‌కు సేవలందించిన 80 ఏళ్ల మూగమ్మ గత సోమవారం రాత్రి కన్నుమూసింది. ఏ బంధుత్వం లేని ఆమెకు ఆ పోలీసు స్టేషన్ సిబ్బంది బిడ్డలే. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కాని 40 ఏళ్ల క్రితం ఆమె ఆ ప్రాంతానికి వచ్చింది.. నా అనే వాళ్లు ఎవరూ లేని, కనీసం తన గోడును వెల్లబోసుకోవడానికి మాటలు కూడా రాని ఆమెకు తాడేపల్లి పోలీసులే అండగా నిలబడ్డారు. ఆమె కోసం పోలీసు స్టేషన్ వెనుక ఒక చిన్న షెడ్డు కట్టి ఆమెకు అందులో ఆశ్రయం కల్పించారు. మాటలు రాకపోయినా తన చేతి సైగలతో వారికి పెద్ద దిక్కుగా ఆమె మారిపోయింది. పోలీసు స్టేషన్‌ను శుభ్రం చేయడం, వారికి మంచినీళ్లు అందచేయడం వంటి పనులతో ఉడగాభక్తిగా వారికి సేవలందించేది.

ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వచ్చే మహిళలకు ధైర్యం నూరిపోసి పోలీసులంటే భయాన్ని పోగొట్టేది. వారికి నీరు అందించి సేవలు చేసేది. నాలుగు దశాబ్దాల క్రితం మొదటగా ఆమెను గుర్తించిన కానిస్టేబుల్ తిరుమలరావు మంగళవారం ఉదయం విగతజీవిగా పడి ఉన్న మూగమ్మను చూశారు. తమ సొంత తల్లి మరణించినట్లు అక్కడి సిబ్బంది అందరూ కన్నీరుమున్నీరయ్యారు. దగ్గర్లో ఉన్న స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు వారంతా ముందుకు వచ్చారు. సిఐ, ఎస్‌ఐ, ఇతర రిటైర్డ్ పోలీసులు పాడె మోసి ఆమె రుణాన్ని తీర్చుకున్నారు. ఆమెతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి రోజు సాయంత్రం ఆమెకు ఆహారం, టీ అందచేసేవాడినని, ఏది పెట్టినా మారాం చేయకుండా తినేదని, మా పోలీసు స్టేషన్‌కు ఆమె సీనియర్ సిబ్బందిలాంటిదని తిరుమలరావు గద్గదస్వరంతో చెప్పుకొచ్చారు. ఆమె కుటుంబం వివరాలు కనుగొనేదుకు చాలా ప్రయత్నాలు చేశామని, అయితే ఆమె కోసం ఎవరూ రాలేదని ఆయన చెప్పారు. సోమవారం సాయంత్రం తాను డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లేటప్పుడు కూడా తనకు షెడ్డులోనుంచే చేతులూపిందని ఆయన తెలిపారు. 40 ఏళ్లుగా తమలో ఒకరిగా కలిసిపోయిన ఆ పెద్దామె ఇక కనపడదంటే బాధగా ఉందని తిరుమలరావే కాదు..అక్కడి సిబ్బంది అంతా వాపోతున్నారు.

cops bid tearful adieu to 80-year-old woman who lived in station for 4 decades Mugamma, who was speech impaired, had been found at the railway station four decades ago by the cops, who built her a shed behind the police station

The post 40 ఏళ్లుగా ఆ పోలీసులకు అమ్మ…. కన్నుమూసింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.