గుప్త నిధుల వేట: తాడిపత్రివాసుల అరెస్టు

బెంగళూరు: శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి గుప్త నిధుల కోసం కర్నాటకలోని హంపీ సమీపంలోని ఉత్తరాది మఠానికి చెందిన తొమ్మిది మంది మఠాధిపతుల సమాధులు ఉన్న ప్రదేశాన్ని తవ్వి అక్కడ ఉన్న పురాతన కట్టడాలను ధ్వంసం చేసిన ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రికి చెందిన ఆరుగురు వ్యక్తులను కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. హంపీ నగరానికి సమీపంలోని అనెగుండి వద్ద ఉన్న నవ బృందావనం కట్టడాలను ధ్వంసం చేసిన టి బాలనరసయ్య(42), మురీ మనోహర్ రెడ్డి(35), మనోహర్ దేరంగల్లు(27), కుమ్మట కేశవ(29), బి విజయకుమార్(36), శ్రీరాములు(45) అనే ఆదివారం వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి కొప్పల్ జిల్లాకు తీసుకువచ్చారు. శ్రీనివాసరెడ్డి(40) అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఉపయోగించిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రికి చెందిన బాలనరసయ్య అనే పూజారి గుప్త నిధులను తవ్వడానికి వీరిని అక్కడకు తీసుకువెళ్లాడని పోలీసులు తెలిపారు. 1509-1529 కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు తన ఆధ్యాత్మిక గురువు వ్యాసరాజ తీర్థ భౌతికకాయాన్ని వజ్రాలు, ముత్యాలతో అక్కడ సమాధి చేశాడన్న కథ ప్రచారంలో ఉందని, దీన్నే నిందితులకు చెప్పి ఆ పూజారి నమ్మించాడని వారు పేర్కొన్నారు.

మొదట ఆ ప్రదేశాన్ని రెక్కి చేసిన నిందితులు పురాతన కట్టడాల కింద పలుగులు, పారలు వంటివి భద్రపరిచారని, ఆ తర్వాత మూడుసార్లు అక్కడకు వచ్చి ఆ తర్వాత తవ్వకాలు జరిపారని పోలీసులు చెప్పారు. శుక్రవారం ఆ ప్రాంతానికి చేరుకున్న వందలాది మంది ప్రజలు ధ్వంసమైన కట్టడాలను పునరుద్ధరించే కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా చేపట్టారు. పురావస్తు శాఖ అధికారుల సహాయంతో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. తుంగభద్ర నది మధ్యలోని ద్వీపంలో నవ బృందావనం వెలసి ఉంది. వర్షాకాలంలో మాత్రమే అనెగుడి, బళ్లారి నుంచి పడవ ద్వారా ఆ ప్రాంతానికి చేరుకోవచ్చు. హంపీ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంది. ఆ ప్రదేశాన్ని చేరుకోవడానికి నిందితులు తమ సొంత పడవలు ఉపయోగించారని పోలీసులు చెప్పారు.

 

Cop Arrested 6 Accused who Destroyed Nava Brundavana
Police arrested 6 accused who destroyed Nava Brundavana, The accused belongs to Tadipatri of Anantapur district

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గుప్త నిధుల వేట: తాడిపత్రివాసుల అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.