దేశీయ మార్కెట్‌పై కాంటినెంటల్ కాఫీ దృష్టి

 

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ లేబుల్ ఇన్‌స్టంట్ కాఫీ తయారీ సంస్థ సిసిఎల్ భారత్ మార్కెట్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో ప్యాకింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకు, వియత్నాం ప్లాంట్ సామర్థ్యాన్ని విస్తరించేందుకు గాను 20 మిలియన్ డాలర్లు(రూ.142 కోట్లు) పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. దీనిలో 12 మిలియన్ డాలర్ల పెట్టుబడులు.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఏర్పాటు చేయనున్న అగ్లోమరేషన్, ప్యాకింగ్ యూనిట్‌కు కేటాయించనుంది. దీని సామర్థం 5,000 టన్నులు ఉండనుంది. వియత్నాం ప్లాంట్ సామర్థ్యాన్ని ఏడాదికి 10,000 టన్నుల నుండి 13,500 టన్నులకు సంస్థ పెంచనున్నట్టు సంస్థ తెలిపింది. ఆగస్టు 15 నుంచి దక్షిణ భారత్‌లో మార్కెట్ ప్రచారం ప్రారంభించనుండగా, దీనికి గాను దక్షిణ భారత్ సినీ నటి నిత్యమీనన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ (సిసిఎల్ ప్రొడక్ట్) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ మంగళవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్గత వసూళ్ల నుంచి పెట్టుబడులు పెట్టనున్నామని, వచ్చే ఏడాది కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అన్నారు. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లిస్టెడ్ సంస్థ సిసిఎల్.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 15-20 శాతం వృద్ధిని లక్షంగా చేసుకుంది. సంస్థ గత ఏడాది 1,100 కోట్ల టర్నోవర్ కలిగి ఉందన్నారు. సిసిఎల్ దాదాపు సుమారు 90 దేశాలకు ప్రాసెస్డ్ కాఫీని ఎగుమతి చేస్తుంది.

ప్రస్తుతం నాలుగు ప్లాంట్లలో సంవత్సరానికి 50,000 టన్నుల సామర్ధ్యం కలిగి ఉంది. సంస్థకు భారతదేశంలో రెండు, విదేశాలలో రెండు ప్లాంట్లు ఉన్నాయి. సంస్థ 1000 మిశ్రమాలలో 100 ఉత్పత్తులను అందిస్తుంది. కొత్త ప్రాసెసింగ్ టెక్నాలజీతో దేశీయ కాఫీ మార్కెట్ పెరుగుతున్నందున, అలాగే డిమాండ్, స్థోమత పెరగడం వల్ల సిసిఎల్ భారతదేశంపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. భారత్‌లో ఇన్‌స్టంట్ కాఫీ మార్కెట్ రూ.2,000 కోట్లుగా అంచనా వేయగా, గత మూడేళ్లుగా 8- నుంచి 10 శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు (సిఎజిఆర్) నమోదు చేస్తోంది. సిసిఎల్ ప్రొడక్ట్ సిఇఒ ప్రవీణ్ జైపురియార్ మాట్లాడుతూ, ప్రీమిక్స్ కాఫీ ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, ఈ విభాగం భారత్‌లో కాఫీ భవిష్యత్తు అని నమ్ముతున్నారని అన్నారు. ఈ విభాగంలో ప్రజలకు అనుగుణంగా సిసిఎల్ కాంటినెంటల్ దిస్ బ్రాండ్ క్రింద ప్రీమిక్స్ కాఫీని ప్రారంభించింది. దీని ధర ఒక కప్పు కేవలం 10 రూపాయలేనని ఆయన అన్నారు.

Continental Coffee Company interest on Indian Market

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దేశీయ మార్కెట్‌పై కాంటినెంటల్ కాఫీ దృష్టి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.