పట్టు కోల్పోతున్న కాంగ్రెస్

TRS-జిల్లాలో కనుమరుగవుతున్న కేడర్
-టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం
ఆదిలాబాద్ ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలలో పునరావృతం కావడంతో జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నూతన జిల్లాలకు జిల్లా అధ్యక్షులను నియమించిన పార్టీ అధిష్టానం పార్టీ బలోపేతం కోసం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ మూడో స్థానానికి పడి పోవడంతో పార్టీ శ్రేణులు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ఫలానా పార్టీకి చెందిన వారమని చెప్పుకొనే పరిస్థితులు లేకపోవడం, పార్టీ నేతలు, నాయకులు కేడర్‌ను పట్టించుకోకపోవడంతో అవస్థలు పడాల్సి వస్తుంది. దీంతో విసిగి వేసారి పోయిన కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి కార్యకర్తలు అధికార పార్టీలో చేరుతున్నారు. ఎన్నికల కంటే ముందు భారీగా టిఆర్‌ఎస్ పార్టీలో చేరగా, ఇప్పుడు సైతం పార్టీలో చేరేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఫలితాలతో ఖంగు తిన్న కాంగ్రెస్ పార్టీ క్రమంగా పట్టు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో దారుణ పరాభవం పొందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు క్రమంగా ఆ పార్టీ నుంచి దూరమవుతున్నారు. గత ఐదేళ్ల నుంచి పార్టీని పట్టుకొని ఉంటున్న కాంగ్రెస్ శ్రేణులు ఈ సారి అధికారం తమదేనంటూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాభవం తరువాత పార్టీలో కొనసాగే పరిస్థితులు లేకపోవడం, ప్రధానంగా పార్టీ జిల్లా నాయకుల వర్గ పోరు వారికి తలనొప్పిగా మారుతుందని అంటున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ నాయకులు, నేతలు కనీస స్థాయిలో జోక్యం చేసుకోకపోవడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. కొన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో ఆ పార్టీలో కొనసాగడం కొంత ఇబ్బందికరంగా మారుతుందని చెప్పుకుంటున్నారు. ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల పరిధిలోని పలువురు ముఖ్య నేతలు ఎంఎల్ఎల అనుచరుల ద్వారా టిఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు మంతనాలు కొనసాగిస్తున్నారు. మండలాలలో తమ ఉనికిని కాపాడుకొనేందుకు అధికార టిఆర్‌ఎస్ పార్టీలో చేరడం మినహా వేరే మార్గం లేదని అంటున్నారు. టిఆర్‌ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను చేర్చుకొనేందుకు పార్టీ శ్రేణులు కొంత వెనుకాడుతున్నట్లు చెబుతున్నారు. ప్రజల్లో పట్టు కోల్పోయిన వారిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అంటున్నారు. ఇదిలా ఉంటే ఎంఎల్ఎల గ్రామాల పర్యటన సందర్బంగా భారీగా చేరికలు చోటు చేసుకుంటాయని అంటున్నాయి. మున్సిపల్ ఎన్నికలు మినహా మరో ఐదేళ్ల వరకు ఎలాంటి ఎన్నికలు లేకపోవడం, అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Congress Losing Grip In Adilabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పట్టు కోల్పోతున్న కాంగ్రెస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.