మెదక్ బరిలో ఎవరో?

  ఎన్నికలు ఏవైనా.. జోరుమీదున్న టిఆర్‌ఎస్ పార్లమెంట్‌కు పోటీపై నేతల వెనుకంజ ఓటమి ఖాయమైన ఆ స్థానంలో బరిలోకి దిగుతారా! అసెంబ్లీ ఓటమితో కకావికలమైన కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ/సంగారెడ్డి: గతంలో ఇందిరాగాంధీ ప్రాతినిధ్యంవహించిన మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఈ సారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు బరిలో ఉండబోతున్నారో అన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఇటీవల వరుసగా అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో హోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో ఎవరిని బరిలో దింపాలో తేల్చుకోలేక […]

 

ఎన్నికలు ఏవైనా.. జోరుమీదున్న టిఆర్‌ఎస్
పార్లమెంట్‌కు పోటీపై నేతల వెనుకంజ
ఓటమి ఖాయమైన ఆ స్థానంలో బరిలోకి దిగుతారా!
అసెంబ్లీ ఓటమితో కకావికలమైన కాంగ్రెస్ పార్టీ

మన తెలంగాణ/సంగారెడ్డి: గతంలో ఇందిరాగాంధీ ప్రాతినిధ్యంవహించిన మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఈ సారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు బరిలో ఉండబోతున్నారో అన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఇటీవల వరుసగా అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో హోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో ఎవరిని బరిలో దింపాలో తేల్చుకోలేక పోతుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతో ఆశతో బరిలోకి దిగిన బడా నేతలు మట్టి కరిచారు. కెసిఆర్ అసెంబ్లీని రద్దు చేసిన నాడు జిల్లాలోని కాంగ్రెస్ నేతలు ఉత్సాహంగా కనిపించారు. జిల్లాలో ఖచ్చితంగా సగానికి సగం గెలుస్తామన్న అంచనాల్లో రంగంలోకి దిగారు. రాను రాను పరిస్థితి టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారుతున్నా.. వారి ఆశలు మాత్రం చావ లేదు. చివరకు ఘోర పరాభవాన్ని మూట కట్టుకున్నారు. కేవలం సంగారెడ్డి మినహా అన్ని చోట్లా ఘోరంగా ఓడిపోయారు. దారుణ పరాభవాన్ని చవి చూశారు. గట్టి పోటీ ఉందని ఆ పార్టీ వర్గాలు భావించిన ఆంథోల్, జహీరాబాద్, పటాన్‌చెరు, నర్సాపూర్‌లో కూడా భారీ తేడాతో ఓడిపోయారు. దీంతో నేతలు ఖంగుతిన్నారు.

అభ్యర్థులైతే పత్తా లేకుండా పోయారు. వారి కోసం పని చేసిన ద్వితీయ శ్రేణి నేతలు దిగాలు చెందారు. ప్రతి చోటా భారీ తేడాతో ఓడిపోవడంతో జిల్లాలో గులాబీ దెబ్బకు కాంగ్రెస్ విలవిలలాడిపోయింది. ఈ దెబ్బకు గజ్వేల్ కాంగ్రెస్ నేత ప్రతాపరెడ్డి ఏకంగా పార్టీకి గుడ్‌బై చెప్పారు.మిగిలిన నియోజకవర్గాల్లో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లోనూ తీరు మార లేదు.చాలా చోట్ల పార్టీ బలపర్చిన అభ్యర్థులకు ఓటమి తప్ప లేదు. వారిని పలకరించిన నేతలు కూడా లేకుండా పోయారు. దీంతో గ్రామాల్లో కూడా ఆ పార్టీ తరపున పని చేసే నేతలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో పార్టీ తరపున పోటీపై చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్షల ఓట్ల తేడాతో ఓడిపోవడం ఖాయంగా కనపడుతోంది. ఘోర పరాభవం ఖాయంగా ఉంది. దీంతో మెదక్ నుంచి ఎవరు పోటీ చేస్తారా? అని అంతా ఆస్తకిగా ఎదరుచూస్తున్నారు. గతంలో దివంగత ప్రధాని ఇందిరా గాందీ ప్రాతినిధ్యం వహించిన చోట ఆ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదర్కోవడం గమనార్హం.

స్టార్ కాంపెయినర్, మెదక్ మాజీ ఎంపి విజయశాంతి పేరు ప్రముఖంగా వినపడుతోంది. ఇటీవలి ఎన్నికల్లో ఆమె మెదక్ లేదా దుబ్బాక స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. చివరకు ఆమె బరిలోనే లేకుండా ప్రచారానికే పరిమితమయ్యారు.దీంతో ఆమెను పార్టీ పెద్దలు పార్లమెంట్ బరిలో దింపుతారని అంటున్నారు.బరా బర్ ఓడిపోతామని తెలిసిన స్థానంలో విజయశాంతి బరిలోకి దిగుతారా?ఓటమిని మరో సారి మూట కట్టుకుంటారా? అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇక ఇటీవల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితురాలైన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల పేరు కూడా వినపడుతోంది. తన భార్య కోసం ఎంపి టికెట్ అడుగుతానని జగ్గారెడ్డి ఇంతకు ముందు అనేక సార్లు ప్రకటించారు. దీంతో ఆమె పేరు తాజాగా చర్చల్లోకి వచ్చింది. కాకుంటే ఇటీవల జగ్గారెడ్డి వ్యవహారశైలి కారణంగా కొంత అనుమానం కూడా కలుగుతోంది.

వీరిద్దరు కాకుండా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పేరు కూడా వినపడుతోంది. సిఎం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ ప్రాంత నేత కావడంతో నర్సారెడ్డిని నిలిపితే సిద్దిపేట జిల్లాపై కొంత ప్రభావం ఉంటుందని కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.వీరే కాకుండా పటాన్‌చెరు ప్రాంత నేతలు సపాన్‌దేవ్, గాలి అనిల్‌కుమార్‌ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.వీరిరువురికి ఇటీవల పటాన్‌చెరు అసెంబ్లీ టికెట్ మిస్సయింది. దీంతో పార్లమెంట్‌కైనా బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.అదే సమయంలో బడా నేతలు కూడా వెనుకంజ వేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. పేర్లు ప్రచారంలో ఉన్నాయి కానీ..పోటీ చేస్తారా ? అన్నది బరిలోకి దిగినప్పుడే తెలుస్తుంది.

Congress Candidate From Medak parliament constituency

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: