జలియన్ వాలాబాగ్ బావి పునరుద్ధరణపై అందరి దృష్టి

Jallianwala Bagh

 

అమృతసర్ : చారిత్రక జలియన్ వాలాబాగ్ లోని వందేళ్ల నాటి ‘అమరవీరుల బావి’ పునరుద్ధరణ పనులు అనేక విమర్శలకు దారి తీస్తున్నాయి. ఈ కట్టడానికి ఎలాంటి నష్టం జరగకూడదని అమరవీరుల కుటుంబాలు అధికార వర్గాలను హెచ్చరిస్తున్న నేపథ్యంలో అమృతసర్ పశ్చిమ ఎంఎల్‌ఎ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ రాజ్‌కుమార్ వెర్కా పునరుద్ధరణ పనుల తీరుపై ఆవేదన వెలిబుచ్చారు. బావి ప్రధాన భాగం దెబ్బతింటోందని ఆరోపించారు. వందేళ్ల క్రితం 1919 ఏప్రిల్ 13న జలియన్‌వాలాబాగ్‌లో ప్రజలు శాంతియుత ప్రదర్శన చేస్తుండగా కల్నల్ డయ్యర్ నాయకత్వంలో బ్రిటిష్ సైనిక బలగాలు పాశవికంగా కాల్పులు జరిపి కొన్ని వందల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. ఆ సమయంలో ఆ కాల్పుల నుంచి తమను తాము రక్షించుకోడానికి చాలామంది అక్కడి బావిలో దూకారు. అటువంటి బావికి ఎలాంటి నష్టం జరగకూడదని అమర వీరుల వారసులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. బావి అసలు కట్టడానికి ఎలాంటి మార్పు చేయరాదని గట్టిగా చెబుతున్నారు.

జలియన్‌వాలాబాగ్‌లో ఆనాడు మృతి చెందిన కుటుంబ వారసుడు క్రిష్ణచౌహాన్ మా చిన్నాన్న మేలారామ్ 18 ఏళ్ల వయస్సులో తుపాకీ కాల్పులకు అమరుడయ్యాడని ఆవేదన చెందారు. క్రిష్ణచౌహాన్ 1933 లో జన్మించారు. అడ్వకేట్ మహేష్ బేహి తాతయ్య లాలా హరిరామ్ 36 ఏళ్ల వయస్సులోనే నేలకొరిగారు. ఈ బావి అమాయకుల పాశవిక హత్యకు సాక్షిగా నిలిచిందని అసలు నిర్మాణానికి ఎలాంటి నష్టం లేకుండా చూడాలని కోరారు. పంజాబ్ బిజెపి అధ్యక్షుడు రాజ్యసభ ఎంపి షాయత్ మాలిక్ జలియన్‌వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ ట్రస్టుకు ట్రస్టీగా ఉన్నారు. ఈ పునరుద్ధరణ పనులు చేస్తున్న కమిటీకి వారసత్వకట్టడానికి నష్టం జరగకుండా చూడాలని సూచించినట్టు చెప్పారు. కొన్నేళ్ల క్రితం ఆ బావి చుట్టూ ఇటుకలతో కట్టడమైందని, ఇప్పుడు అది శిధిలావస్థకు చేరుకుందని అందువల్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు.

Concern over renovation of Martyrs Well at Amritsar Jallianwala Bagh

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జలియన్ వాలాబాగ్ బావి పునరుద్ధరణపై అందరి దృష్టి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.