సంపూర్ణ పుర విజయం సాధిస్తాం

Municipal Elections

 

పార్టీని మరింత బలమైన శక్తిగా రూపొందించాలి
త్వరలో విస్తృత స్థాయి సమావేశం
జిల్లాకమిటీల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి
నాయకులు ప్రజల్లో నిరంతరం ఉండాలి
పార్టీశ్రేణులు దూకుడు పెంచాలి
ప్రధాన కార్యదర్శుల సమావేశంలో రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

హైదరాబాద్ : టిఆర్‌ఎస్‌ను మరింత బలమైన శక్తిగా తీర్చి దిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్త్తున్నట్లు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. బుధవారం టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, మున్సిపాలిటీ ఎన్నికల సమన్వయ సభ్యులతో కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన టిఆర్‌ఎస్ పార్టీని శాస్త్రీయంగా మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు సంస్థ్థాగత బలంతో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లే అవకాశాలున్నాయన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను,సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత వేగంగా పార్టీశ్రేణులు తీసుకువెళ్లాలని కెటిఆర్ ఆదేశించారు. ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నిప్రాంతాలను, అన్ని పట్టణాలను సమానంగా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో పార్టీ విజయావకాశాలు అత్యధికంగా ఉన్నాయని కెటిఆర్ చెప్పారు.

విజయమే లక్షంగా ముందుకు దూకాలి
పటిష్టమైన పార్టీ శ్రేణులతో, వేలాధిమంది నాయకులతో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన టిఆర్‌ఎస్ మున్సిపాలిటీ ఎన్నికల్లో దూకుడు పెంచాలని కెటిఆర్ చెప్పారు. ప్రజాసంక్షేమమే లక్షంగా పనిచేస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లితే విజమే తమదనే ధీమాను కెటిఆర్ వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పురపాలికల్లో విజయమే లక్షంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పురపాలిక ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధించేవిధంగా శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని కెటిఆర్ ఆదేశించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీల వారిగా కార్యదర్శులు స్థానిక తాజా రాజకీయ పరిస్థితులను తెలిపారు.

త్వరలో విస్తృత స్థాయి సమావేశం
త్వరలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలవారిగా కమిటీల ఏర్పాటుపై సుధీర్ఘంగా చర్చించనున్నట్లు కెటిఆర్ ప్రకటించారు. గ్రామస్థాయి కమిటీలు పూర్తి కావడంతో జిల్లాల వారిగా కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందన్నారు. సమర్థులైన నాయకులకు పార్టీ అవకాశాలు ఇస్తోందని ఆయన గుర్తు చేశారు. పనిచేసే నాయకులకు పార్టీలో విస్తృతంగా అవకాశాలున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వం పూర్తయిన నేపథ్యంలో అన్ని స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని మరింత బలోపేతం చేసేదిశలో పార్టీ కార్యక్రమాలుంటాయని కెటిఆర్ చెప్పారు. మున్సిపాలిటీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులు, నాయకులు సిద్ధంగా ఉండాలని పునరుద్ఘాటించారు. పార్టీ నాయకులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.

కెటిఆర్‌కు ఘన స్వాగతం
రెండవసారి మంత్రి పదవి చేపట్టినఅనంతరం టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పార్టీ కార్యాలయానికి తొలిసారిగా రావడంతో శాసనమండలి సభ్యుడు, టిఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు శంబీపూర్ రాజు ఆధ్వర్యంలో ఘనస్వాగతం ఏర్పాటు చేశారు. వందలాధి మంది పార్టీ శ్రేణులు ప్లకార్డ్ పట్టుకుని కెటిఆర్‌కు స్వాగతం పలికారు. పలువురు టిఆర్‌ఎస్ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు కెటిఆర్‌కు స్వాగతం పలికారు.

కెటిఆర్ పార్టీ కార్యాలయంలోకి రాగానే ముందుగా తెలంగాణ తల్లికి పూలమూల వేసిఅంజలి ఘటించారు. సమావేశం ప్రారంభమైన తర్వాత మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన సత్యవతి రాథోడ్‌కు, శాసనసభ విప్‌లుగా నియమించబడిన బొడకుంటి వెంకటేశ్వర్లు, కర్నె ప్రభాకర్, భానుప్రసాదరావు, బాల్కసుమన్‌లకు సమావేశం పక్షాన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ రెడ్డి జన్మదినం సందర్భంగా కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

complete victory in Municipal Elections

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సంపూర్ణ పుర విజయం సాధిస్తాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.