టికెట్ల కోసం పైరవీలు 

ZPTC and MPTC Elections-ఎమ్మెల్యేలు, పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు
-గ్రామాల్లో అభ్యర్థులపై కొనసాగుతున్న చర్చలు
– అభ్యర్థుల వేటలో కాంగ్రెస్, బిజెపి
ఆదిలాబాద్‌ : జడ్పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టికెట్ల కోసం పైరవీలను ప్రారంభించారు. అధికార టిఆర్‌ఎస్ పార్టీలో పైరవీలు జోరుగా సాగుతుండగా, కాంగ్రెస్, బిజెపిలలో సైతం టికెట్ల కోసం ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికార టిఆర్‌ఎస్ పార్టీల ఎమ్మెల్యేలకే టికెట్ల పంపిణీ బాధ్యతలు అప్పగించడంతో వారికి అభ్యర్థిత్వం ఖరారు వ్యవహారం కొంత ఇబ్బందికరంగా మారుతుందని అంటున్నారు. ఒక్కో స్థానం నుంచి ఇద్దరు నుంచి నలుగురు అభ్యర్థులు పోటీ పడుతుండడంతో మిగిలిన వారికి నచ్చ చెప్పేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. జడ్పి చైర్మన్, ఎంపిపి స్థానాల కోసం పోటీ పడుతున్న వారు మండలంలోని బలబలాలను బేరీజు వేసుకొని తమతో పాటు తమకు అనుకూలంగా ఉండే వారికి టికెట్లు కేటాయించాలని ఎమ్మెల్యేలను కోరుతున్నారు. జిల్లా స్థాయి నాయకులను కలుస్తూ ఎలగైనా టికెట్ సాధించుకోవాలని భావిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు మండలాల వారీగా ఆశావాహుల జాబితాను రూపొందించి ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే వారిని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కొన్ని మండలాలకు సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయానికి రాగా, మరిన్ని మండలాలలో అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజిని పరిగణలోకి తీసుకొని అభ్యర్థిత్వం ఖరారు చేయాలని భావిస్తున్నారు. ఇదిలాఉంటే కాంగ్రెస్, బిజెపిలు సైతం అన్ని స్థానాలలో పోటీ చేయాలని భావిస్తున్నప్పటికి సరైన కేడర్ లేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని మండలాలలో బలమైన అభ్యర్థులు లేక పోవడంతో ఆయా గ్రామాలలో పలుకుబడి ఉన్న వారిని తమ పార్టీలో చేర్చుకొని పార్టీ టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇదిలాఉంటే జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా టిఆర్‌ఎస్ పార్టీ ఎవరిని ఎంపిక చేస్తుందనే ఆసక్తి జిల్లాలో కొనసాగుతోంది. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జడ్పి చైర్మన్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, పెద్దపల్లి జడ్పి చైర్మన్ అభ్యర్థిగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టు మధు పేర్లను ఖరారు చేసిన సిఎం కెసిఆర్ ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ జడ్పి చైర్మన్ పదవిని ఎస్టీ మహిళకు రిజర్వు చేయగా, ఆదిలాబాద్ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు రిజర్వు చేశారు. అయితే ఇప్పటికే ఆసిఫాబాద్ జడ్పి చైర్మన్‌గా గోండు సామాజిక వర్గానికి చెందిన కోవ లక్ష్మిని ఎంపిక చేయగా, ఆదిలాబాద్ స్థానాన్ని లంబాడ సామాజిక వర్గానికి కేటాయిస్తారా లేక ఆదివాసీలకే ఇస్తారా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఎన్నికల అనంతరమే అభ్యర్థిత్వం ఖరారవుతుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ నాయకులు పోటీ పడుతుండడంతో బలమైన అభ్యర్థులను బరిలో నిలిపి మిగిలిన వారికి నామినేటెడ్ పోస్టులను ఇస్తామని చెబుతూ బుజ్జగించే పనిలో పడ్డారు. అయితే అధికార టిఆర్‌ఎస్ పార్టీలో టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉన్నప్పటికి ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా విజయం కోసం శ్రమిస్తామని పేర్కొనడం పార్టీ శ్రేణుల మధ్య ఐక్యతకు నిదర్శనంగా చెప్పుకుంటున్నారు.

Competition for Tickets in ZPTC and MPTC Elections

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టికెట్ల కోసం పైరవీలు  appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.