నగరంలో పలు వీధుల్లో కలెక్టర్ పర్యటన

Collector

 

పరిసరాల పరిశుభ్రత, శానిటేషన్ పై పరిశీలన
స్పెషల్ డ్రైవ్ పెట్టి నగరంలో పరిసరాలను పరిశుభ్రం చేయాలని కమిషనర్‌కు ఆదేశాలు

నిజామాబాద్ : నగరంలో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్‌ఎం రావు నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ నగరంలో పరిశుభ్రత, శానిటేషన్ పై పలు వీధుల్లో పర్యటించి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్రిందిస్థాయి నుండి కమిషనర్ స్థాయి వరకు ప్రతిరోజు పరిశుభ్రత, శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. చెత్తను ఎప్పటికప్పుడు డంప్ యార్డ్‌కు తరలించాలని, రోడ్డు పై నిలిచిన నీటిని డ్రైనేజి కాలువలో నీరు నిలువకుండా ప్రతిరోజు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను, ముళ్ళపొదలను తొలగించాలని ఆదేశించారు. నగరంలోని రోడ్ల పై ఉన్న దుమ్మును పేరుకుపోయిన ఇసుకను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

నగర ప్రజలు ప్లాస్టిక్ వాడకం నిరోధించాలని, చెత్తను విచ్చలవిడిగా పారేయకుండా పొడి చెత్త, తడి చెత్తను వేర్వేరు చేసి నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన వాహనాల్లో వేయాలని, మురుగు కాలవలో ప్లాస్టిక్ ఇతర పదార్థాలు, చెత్త వేయకూడదన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకునగరపాలక సంస్థ ఉద్యోగులు కృషి చేస్తున్నందున నగర ప్రజలు సహకరించాలని చెప్పారు. గ్రామపంచాయతీ ప్రత్యేక ప్రణాళికలో భాగంగా పచ్చదనం, పరిశుభ్రత పై ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్నందున అదే విధంజా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో కూడా పరిశుభ్రంగా ఉండాలనే సంకల్పంతో ముందుకువెళ్తున్నట్లు, అందుకు ప్రతిఒక్కరు పూర్తి సహాయ సహకారాలు అందించాలని అన్నారు.

లోతట్టు ప్రాంతాల్లో ప్రైవేటు స్థలాల్లో నీటి నిలువ లేకుండా చేయాలని నిల్వగా ఉన్న నీటిలో దోమలు ఉత్పత్తి కాకుండా నిరోధక చర్యలు తీసుకోవాలని ఇళ్ళలో కూలర్లలో నీరు లేకుండా కొబ్బరిచిప్పలోగానీ, పాడైపోయిన ఇతర వస్తువులలో నీటి నిల్వలు లేకుండా చూడాలని ఆయన ప్రజలను కోరారు. రిక్షాలోగానీ, ఇతర చిన్న వాహనాల్లో సేకరించిన చెత్తను ఒక ప్రదేశంలో డంప్ చేసిన చెత్తను అక్కడే రోజుల కొద్ది అదే ప్రదేశంలో ఉంచకుండా వెనువెంటనే డంప్ యార్డుకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బర్కత్‌పుర బైపాస్‌రోడ్డు, చంద్రశేఖర్ కాలనీ చౌరస్తా, నూతన కలెక్టరేట్ కార్యాలయం వద్ద అర్సపల్లి, మాలపల్లి అర్బన్ హెల్త్ సెంటర్, అహ్మద్‌నగర్ ఖిల్లా, ఎల్లమ్మగుట్ట, రైల్వే కమాన్ వీధుల్లో పర్యటించి పారిశుధ్యం, పరిశుభ్రతను పరిశీలించి ఎప్పటికప్పుడు నగరపాలక అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ అవసరమైన సందర్భంలో పలు సూచనలు, సలహాలు అందజేశారు. మాలపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ప్రజలు మురికి కాల్వల వలన పడుతున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తేగా ప్రజలు ఇబ్బందులను తొలగించేందుకు నగరంలో పర్యటించి సంబంధిత అధికారులకు ఆదేశారు జారీ చేస్తున్నానని అన్ని ఒక్కసారే పరిష్కారం కావని, ప్రజలు కూడా నగరపాలక సిబ్బందికి సహకారం అందించాలని కోరారు. జిల్లా కలెక్టర్ వెంట నగరపాలక కమీషనర్ జాన్సన్, శాంసన్, మున్సిపల్ ఇంజనీర్లు రషీద్, ఆనంద్, టౌన్ ప్లానింగ్, అధికారి తదితరులు పాల్గొన్నారు.

Collector’s tour of many streets in city

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నగరంలో పలు వీధుల్లో కలెక్టర్ పర్యటన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.