మల్కాపూర్ నుంచి నేను ఎంతో నేర్చుకోవాలి : సిఎం

CM KCR Speech at Kanti Velugu

తూప్రాన్: రాష్ట్రానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాన్ని మల్కాపూర్ నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందని సిఎం కెసిఆర్ అన్నారు. ‘కంటి వెలుగు’ లాంటి కార్యక్రమం దేశంలోనే మరేక్కడా లేదని కెసిఆర్ స్పష్టం చేశారు. బుధవారం సిఎం తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో కంటి వెలుగు పథకాన్ని కొద్ది సేపటి క్రితమే ప్రారంభిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో ఎంతోమంది పేద ప్రజలు కంటి జబ్బుల బారిన పడుతున్నారని, వృద్దులకు కంటి పరీక్షలు చాలా అవసరమని కెసిఆర్ సూచించారు. కంటి వెలుగు స్కీమ్ ద్వారా 3 కోట్ల 70 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉచితంగా మందులు, కళ్లద్దాలు అవసరమైతే ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని చెప్పారు.  ప్రజల కోసం ఎంత ఖర్చు పెట్టడానికైన టిఆర్ఎస్ ప్రభుత్వం రెడీగా ఉందన్నారు. ఇదివరకే 40 లక్షల కళ్లద్దాలు తెప్పించామని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కెసిఆర్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 825 టీమ్‌లు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాయని సిఎం తెలియజేశారు.

మల్కాపూర్ నుంచి తాను ఎంతో నేర్చుకోవాల్సి ఉందని సిఎం అన్నారు. మల్కాపూర్‌కు రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇక్కడి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండడం సంతోషకరమని పేర్కొన్నారు. ఆడ, మగ భేదాలు కేవలం భారతదేశంలోనే ఉన్నాయి. అవకాశాలిస్తే మహిళలు అద్భుతాలు చేయగలరని కెసిఆర్ చెప్పుకోచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, బిబి పాటిల్, కేశవరావు, జిల్లాకు చెందిన పలువురు ఎంఎల్ఎ, ఎమ్ ఎల్ సిలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.