30 రోజుల పల్లె ప్రణాళికపై నేడు సిఎం సమీక్ష

KCR

నేడు మంత్రులు, జిల్లా కలెక్టర్లతో సిఎం కెసిఆర్ భేటీ
తొలి విడత పూర్తి చేసుకున్న ౩౦ రోజుల ప్రణాళికపై కూలంకషంగా చర్చ
రెండవ విడతపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్: పల్లె ప్రగతి ప్రణాళిక(ముప్పై రోజుల కార్యాచరణ)పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేడు సమీక్షించనున్నారు. గ్రామాలను యుద్దప్రాతిపదికన అభివృద్ధి చేయాలన్న లక్షంతో గత నెల 6 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ముప్పై రోజుల ప్రణాళికను రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రణాళికలో గ్రామాల పరిస్థితి పూర్తిగా మారిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏ రోజు ఏఏ కార్యక్రమాలు చేపట్టాలో కూడా ప్రణాళికలో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ఆదారంగా గ్రామాల్లో ఎలాంటి పనులు చేపట్టారు? పారిశుద్ధం పనులు ఎలా జరిగాయి? ఎన్ని గ్రామాలను పచ్చదనంతో తీర్చిదిద్దారు? ఎన్ని రహదారులకు మరమ్మత్తులు చేపట్టారు? తదితర అంశాలపై సమీక్షలో సిఎం ఆరా తీయనున్నారు. ఈ మేరకు గురువారం ప్రగతిభవన్‌లో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో సిఎం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. 30 రోజుల ప్రణాళికలో గ్రామాల అభివృద్ధి ఏ మేరకు జరిగింది? ప్రజల నుంచి ఎలాంటి సమస్యలను ఎదుర్కొనాల్సి వచ్చింది? తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అధికారులు, మంత్రుల నుంచి కెసిఆర్ సేకరించనున్నారు. ఈ సందర్భంగా గ్రామాల వారిగా సిద్దం చేసిన నివేదికలను అధికారులు సిఎంకు అందజేయనున్నారు. ఈ నివేదక ఆదారంగా గ్రామాల్లో సమస్యల పరిష్కారం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

నెల రోజుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామగ్రామాన తిరిగారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధి పనులపై గ్రామ సభలు నిర్వహించి నివేదికలు తయారు చేశారు. మొదటి విడత కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో ఈ సమావేశంలో రెండవ విడతపై సిఎం కెసిఆర్ దృష్టి సారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అధికారులు సమర్పించిన నివేదికల ఆదారంగా విడతల వారిగా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేయనున్నారు. గ్రామాలకు ప్రతి నెలా రూ.౩౦౦ కోట్లకు పైగా నిధులు కేటాంచాలని నిర్ణయించిన నేపథ్యంలో వాటిని ప్రణాళికబద్ధంగా ఖర్చు చేయాలనే విషయంపై కూడా అధికారులకు సిఎం కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారని తెలుస్తోంది. పలు అంశాల వారిగా అధికారులు సిద్ధం చేసిన నివేదికలపై పూర్తి స్థాయిలో చర్చించిన అనంతరం సిఎం పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. 60 రోజులపాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావించగా, తొలి విడతగా 30 రోజుల కార్యక్రమం పూర్తయింది. ఈ నేపథ్యంలో రెండవ విడత ఎప్పడు మొదలు పెట్టాలనే అంశంపై ఈ సమావేశంలో కెసిఆర్ ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా ఈ సమావేశంలో ఆర్‌టిసి సమ్మె విషయం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. సమ్మె కారణంగా తలెత్తిన సమస్యలను యుద్దప్రాతిపదికన పరిష్కరించేలా జిల్లా కలెక్టర్లకు కెసిఆర్ పలు సూచనలు చేస్తారని తెలుస్తోంది.

CM KCR Review Today on 30 day Rural Plan

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 30 రోజుల పల్లె ప్రణాళికపై నేడు సిఎం సమీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.