మేడారంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు

Medaram Jatara

 

హైదరాబాద్ : భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహారించి మేడారం జాతరను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో జరిగే మేడారం జాతర ఆహ్వాన పత్రికను మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం ఉదయం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అందించారు. మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపి మాలోత్ కవితలు సిఎంను కలిసి మేడారం జాతరకు ఆహ్వానించారు. అనంతరం మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర అధికారులతో మేడారం జాతర ఏర్పాట్లను సిఎం సమీక్షించారు.

ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు అందుబాటులో రెండు హెలికాప్టర్లు
ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ వారిని ఉద్ధేశించి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, ఇతర సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించడానికి, మేడారం వెళ్లి రావడానికి ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు హైదరాబాద్‌లో రెండు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచుతామని ఆయన వెల్లడించారు. ‘మేడారం జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో వస్తారని, మంచినీరు, పారిశుద్ధం తదితర విషయాల్లో ఏమాత్రం ఏమరపాటు వహించకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

క్యూలైన్ల నిర్వహణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తదితర అంశాల్లో సరైన వ్యూహాన్ని అనుసరించాలని సిఎం సూచించారు. గతంలో వరంగల్ జిల్లాల్లో పనిచేసి, మేడారం జాతర నిర్వహించిన ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను అక్కడికి పంపాలని, అన్ని శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండి, సమన్వయంతో వ్యవహారించి జాతరను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

 

CM KCR Review on Medaram Jatara

The post మేడారంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.