కలిసి సాగుదాం

ప్రాతీయమే జాతీయం తమిళనాడు పర్యటన ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రి ఏ జాతీయ పార్టీకీ మెజారిటీ రాదు ప్రాంతీయ పార్టీల బలమే కీలకం జాతీయపక్షాలు మన వద్దకే రావాలి మనకూటమిదే కేంద్రంలో కీలక పాత్ర – డిఎంకె అధినేత స్టాలిన్‌తో కెసిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి ఇంకా 10 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో కేంద్రంలో కాంగ్రెస్, బిజెపికి ప్రత్యామ్నాయంగా సమాఖ్య కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు సిఎం కెసిఆర్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అందులో […] The post కలిసి సాగుదాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
ప్రాతీయమే జాతీయం

తమిళనాడు పర్యటన ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రి

ఏ జాతీయ పార్టీకీ మెజారిటీ రాదు
ప్రాంతీయ పార్టీల బలమే కీలకం
జాతీయపక్షాలు మన వద్దకే రావాలి
మనకూటమిదే కేంద్రంలో కీలక పాత్ర
– డిఎంకె అధినేత స్టాలిన్‌తో కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి ఇంకా 10 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో కేంద్రంలో కాంగ్రెస్, బిజెపికి ప్రత్యామ్నాయంగా సమాఖ్య కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు సిఎం కెసిఆర్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అందులో భాగంగానే ఆయన స్టాలిన్‌తో సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. సుమారు గంటకు పైగా వీరి మధ్య చర్చలు జరిగినట్టు తెలిసింది. ఈ సుదీర్ఘ భేటీలో దేశంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఎన్నికల ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే, ప్రాంతీయ పార్టీలను బలమైన శక్తులుగా మార్చేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ ఖరారుపై వీరు మాట్లాడుకున్నట్టు సమాచారం. భేటీ అనంతరం ఇద్దరు నేతలు మీడియాతో ఏమీ మాట్లాడలేదు. చెన్నై నుంచి కెసిఆర్ హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. వారం వ్యవధిలో సిఎం కెసిఆర్ తమిళనాడుకు వెళ్లడం ఇది రెండోసారి.

గత సోమవారం దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు బయలుదేరే ముందే స్టాలిన్‌ను కలిసేందుకు ప్రయత్నించినా కొన్ని కారణాల నేపథ్యంలో అది వీలు పడలేదు. అనంతరం స్టాలిన్ 13వ తేదీన చెన్నైకి రావాలంటూ కెసిఆర్‌ను ఆహ్వానించడంతో సిఎం చెన్నైకి వెళ్లారు. అందులో భాగంగానే కేంద్రం లో ప్రాంతీయపార్టీలు కీలకపాత్ర పోషించాలని డిఎంకే అధినేత స్టాలిన్‌తో కెసిఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. చెన్నై ఆళ్వార్‌పేటలోని స్టాలిన్ నివాసానికి కెసిఆర్ వెళ్లారు. కెసిఆర్‌ను స్టాలిన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై స్టాలిన్‌తో కెసిఆర్ చర్చలు జరిపారు. కేంద్రంలో ఏ జాతీయపార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాదని, ప్రాంతీయపార్టీలు సాధించే స్థానాలే కీలకం కానున్నాయని వారిద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. ప్రాంతీయపార్టీల వద్దకే జాతీయపార్టీలు వచ్చేలా అందరం కలిసి ముందుకువెళ్దామని ఈ సందర్భంగా కెసిఆర్ స్టాలిన్‌కు వివరించినట్టు తెలిసింది.

ప్రాంతీయపార్టీలతో ఏర్పాటయ్యే కూటమి ద్వారా కేంద్రప్రభుత్వంలో కీలకపాత్ర పోషించి, రాష్ట్రాలకు అధికారాల బదలాయింపు, అధికార వికేంద్రీకరణ సాధించాలని, ఆ దిశగా మిగతా రాష్ట్రాల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు స్టాలిన్‌కు కెసిఆర్ వివరించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయస్థాయి సమస్యలను కలిసికట్టుగా పరిష్కరించుకోవాలని వారు ఇరువురు చర్చించినట్టు సమాచారం. దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణాలపై చర్చించడంతో పాటు సమాఖ్య కూటమి (ఫెడరల్ ఫ్రంట్) బలోపేతానికి సహకరించాల్సిందిగా స్టాలిన్‌ను కెసిఆర్ కోరినట్లు తెలుస్తోంది. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల సహకారంతో కాంగ్రెస్, భాజపాయేతర ప్రభుత్వాలు అధికారంలోకి రావాలంటూ కొద్ది రోజులుగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే స్టాలిన్‌తో కెసిఆర్ భేటీ అయినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో టిఆర్‌ఎస్ ఎంపీలు వినోద్, సంతోష్ కుమార్, డిఎంకే సీనియర్ నేతలు దురైమురుగన్, టిఆర్. బాలు తదితరులు పాల్గొన్నారు.

ఫెడరల్ ఫ్రంట్‌తో కలిసిరావడానికి పలు రాష్ట్రాల నాయకులు సిద్ధం
సిఎం కెసిఆర్ గతంలో అప్పటి డిఎంకే అధినేత కరుణానిధి, స్టాలిన్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో ఫెడరల్ ఫ్రంట్‌పై కూడా చర్చించారు. త్వరలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు విడుదల కాను న్న నేపథ్యంలో మరోసారి స్టాలిన్‌తో కెసిఆర్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కెసిఆర్ ఇటీవల కేరళ సిఎం పినర యి విజయన్‌తోనూ సమావేశమై ఫెడరల్ ఫ్రంట్‌తో పాటు కేంద్రంలో ప్రాంతీయ పార్టీ లు పోషించాల్సిన పాత్ర గురించి చర్చించిన విషయం తెలిసిందే. దీంతోపాటు కర్ణాటక సిఎం కుమారస్వామితో ఫోన్‌లో మాట్లాడారు.

వీరితో పాటు ఫెడరల్ ఫ్రంట్‌పై కలిసి రావడానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసిపి పార్టీ, ఒడిశాకు చెందిన బిజేడి, పశ్చిమబెంగాల్ సిఎం, టిఎంసి అధినేత్రి మమతాబెనర్జీ, ఎస్పీ నేత అఖిలేశ్‌యాదవ్ సహా పలుపార్టీలకు చెందిన నేతలు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు పార్టీలు ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనను స్వాగతించగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న డిఎంకే సైతం కెసిఆర్ లేవనెత్తే అంశాలకు మద్ధతు ఇవ్వాలని ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రాంతీయ పార్టీల అవసరాలను వెల్లడించడం ద్వారా అన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల మద్ధతు కూడగట్టడానికి కెసిఆర్ తన పర్యటనను రూపొందించుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటికే ఒక దఫా ఫెడరల్ ఫ్రంట్‌కు అనుకూలమైన రాష్ట్రాలను తిరిగొచ్చిన కెసిఆర్ రెండోసారి మళ్లీ ఫెడరల్ ప్రయత్నాలు ప్రారంభించడం విశేషం.

శ్రీరంగం, తిరుచ్చి ఆలయాల సందర్శన
ఆదివారం ప్రత్యేక విమానంలో కెసిఆర్ చెన్నైకు వెళ్లారు. తమిళనాడు పర్యటనలో భాగంగా కెసిఆర్ తన కుటుంబసభ్యులతో కలిసి శ్రీరంగం పుణ్యక్షేత్రంతో పాటు తిరుచ్చి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం చెన్నైకు చేరుకున్న ఆయన సాయంత్రం స్టాలిన్‌తో సమావేశమయ్యారు.

కేరళ, తమిళనాడు తరహాలోనే కర్ణాటకలోనూ సక్సెస్
స్టాలిన్‌తో భేటీ అనంతరం కెసిఆర్ కర్ణాటకలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. పర్యటనలో భాగంగా కర్ణాటక సిఎం కుమారస్వామితో భేటీ అయ్యి ఫెడరల్ ఫ్రంట్ విషయమై చర్చించనున్నట్టు సమాచారం. కేరళ, తమిళనాడు తరహాలోనే కర్ణాటకలో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

CM KCR Meeting Ends With Stalin on Monday evening

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కలిసి సాగుదాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.