ఫెదరర్, జకోవిచ్ ముందంజ

సిన్సినాటి: టాప్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా), మూడో సీడ్ రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) ప్రతిష్టాత్మకమైన సిన్సినాటి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో మూడో రౌండ్‌కు దూసుకెళ్లారు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో ఆరో సీడ్ పెట్రా క్విటోవా (చెక్), జియాంగ్ వాంగ్ (చైనా) రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. మారియా సక్కారి (గ్రీక్), సిసు వీ (తైవాన్)ల చేతుల్లో వీరు కంగుతిన్నారు. పురుషుల సింగిల్స్‌లో 11వ సీడ్ బౌటిస్టా అగట్ (స్పెయిన్), పబొలొ బుస్టా (స్పెయిన్)లు మూడో రౌండ్‌కు చేరుకున్నారు. ఇక, జకోవిచ్ రెండో రౌండ్‌లో 75, 61తో అమెరికా ఆటగాడు శామ్ క్వేరిను ఓడించాడు. తొలి సెట్‌లో జకోవిచ్‌కు కాస్త పోటీ ఎదురైంది. ప్రత్యర్థి ఆటగాడు అద్భుత పోరాట పటిమను కనబరచడంతో పోరు టైబ్రేకర్ వరకు వెళ్లింది. కానీ, కీలక సమయంలో పుంజుకున్న జకోవిచ్ సెట్‌ను సొంతం చేసుకున్నాడు.

రెండో సెట్‌లో ప్రారంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడిన జకోవిచ్ అలవోకగా సెట్‌ను గెలిచి ముందంజ వేశాడు. మరో పోటీలో ఫెదరర్ 63, 64తో అర్జెంటీనా ఆటగాడు జువాన్ లొనెడెరొను ఓడించాడు. ప్రారంభం నుంచే చెలరేగి ఆడిన ఫెదరర్ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. చివరి వరకు ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వరుసగా రెండు సెట్లను గెలిచి మూడో రౌండ్‌కు చేరుకున్నాడ. బౌటిస్టా అగట్ 76, 63తో హుబర్ట్ (పోలండ్)ను ఓడించాడు. మహిళల విభాగంలో మారియా సక్కారి 64, 26, 63తో పెట్రా క్విటోవాను ఓడించింది. ప్రారంభం నుంచే సక్కారి ఆధిపత్యం చెలాయించింది. రెండో సెట్‌లో క్విటోవా గెలిచినా మళ్లీ మూడో సెట్‌లో సక్కారి హవా నడిపించింది. మరో పోటీలో సి సువీ 63, 64తో 15వ సీడ్ జియాంగ్‌ను ఓడించి ముందంజ వేసింది.

Cincinnati Open 2019: Federer reached to 3rd round

The post ఫెదరర్, జకోవిచ్ ముందంజ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.